సిఇసి జ్ఞానేష్ కుమార్ ఓట్ చోరీ కుట్రలు, ఎన్నికల కుతంత్రాలపై పోరాటాలతో దేశం అట్టుడికి పోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఇసి అనిల్ చంద్ర పునేఠా కూడా వివాదాస్పదులైనారు. స్థానిక ఎన్నికల సమరంలో నామినేషన్ రిగ్గింగ్ అనే కొత్త మాట పుట్టడానికి ఇక్కడ పాలన చేస్తున్న టిడిపి కూటమి కారణమైనా, ఎస్‌ఇసి అలసత్వం సుస్పష్టం. ఆఖరుకు చరిత్రలో లేని విధంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని నామినేషన్ల ముగింపు తేదీని పొడిగించే పరిస్థితి దాపురించింది. ఈ అధ్యాయం ఇంకా ముగిసిందని చెప్పలేం. ఎందుకంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ ఆదేశాల తర్వాత కూడా మొక్కుబడిగా ఏదో పొడిగింపు ప్రకటించి దౌర్జన్యాలు యథావిధిగా సాగించినట్టు కూటమి భాగస్వాములైన జనసేన నాయకులే మీడియా సాక్షిగా ప్రకటించిన పరిస్థితి. పైగా ఇది మునిసిపాలిటీల ఘట్టమే గనక తర్వాత మండల, జిల్లా పరిషత్‌లు, ఆ పైన గ్రామ పంచాయతీల వరకూ వచ్చేసరికి ఏమవుతుందనేది ఆందోళన కలిగిస్తున్న అంశమే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు దాడులు, లాక్కోవడాలు ఏమీ లేవని కొట్టి పారేస్తున్నారు. కోర్టులను పక్కదోవ పట్టిస్తున్నారని ఎదురు దాడి చేస్తున్నారు. అధికార బలం, హంగు దర్పాలు, దానికి తోడు ఎన్నికల యంత్రాంగం తోడ్పాటు వున్నందువల్ల తుది ఫలితం నిజంగా ఎలా వుంటుందో చూడవలసిందేగానీ ప్రస్తుత కల్లోల వాతావరణానికి ఇదో నిదర్శనంగా మాత్రం కనిపిస్తున్నదనేది నిజం.
సిఇసి ఉదంతంతో మార్పు?
జాతీయ సన్నివేశానికి వస్తే సిఇసి విషయంలోనూ చంద్రబాబు నాయుడు అలవాటైన పిల్లిమొగ్గలే వేశారు. ‘సర్’ పైన, ఎన్నికల సంఘం(ఇసిఐ) పని తీరుపైన మొదట కాస్త విమర్శనాత్మకంగా మాట్లాడినట్టు కనిపించి వెంటనే పూర్తిగా కితాబులిచ్చేందుకు సిద్ధమైపోయారు. ఇసిఐ పేరిట అధికారుల ద్వారా విడుదలైన మొక్కుబడి ప్రకటనే సమస్యలన్నిటికీ సమాధానమన్నట్టు చెప్పేశారు. నిజానికి బిజెపి నేతల కన్నా ముందే చంద్రబాబు జ్ఞానేష్‌కు వంత పాడటం హాస్యాస్పదమే. తెలుగు వారైన మాజీ బ్యాంకు అధికారి (ఇమ్మనేని శేషగిరిరావు) ఆర్‌టిఐ కింద అడిగిన ప్రశ్నకు జవాబుగా ఎన్నికల కమిషనర్లు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన మాట నిజమేనని, వాటిని సిఇసి కే తిరిగి పరిశీలనార్థం పంపించామని జవాబు వచ్చింది. అంటే వారు అభ్యంతరం పెట్టడంపై కథనాలు నిజమని తేలడమే కాదు, దాన్ని స్వయంగా కేంద్రం సిఇసికి పంపినప్పుడు ‘సర్’ నిరంకుశంగా కుట్రపూరితంగా జరిగిన సంగతి విదితం కాదా? కానీ ఏదిఏమైనా మోడీకి విధేయత చాటుకోవడమే కీలకమని చంద్రబాబు భావించారు కాబట్టే వత్తాసుగా రంగంలోకి దిగిపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయితే జెన్ జీ జంతర్ మంతర్ ఆందోళన సమయంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సభలో యువతను తప్పు పడుతూ మోడీ భజన చేశారు. సిఇసి పై సమరం మొదలైన తర్వాత జెడియు, లోక్‌జన్‌శక్తి వంటి పార్టీల నాయకులు కొంతైనా గొంతు వినిపించారేమో గానీ టిడిపి మాత్రం గట్టిగా సమర్థించడానికి హడావుడి పడటమేగాక పోరాడే వారిపైనే దాడి చేసింది.
టిడిపి, జనసేన సర్వ సంపూర్ణంగా బిజెపి, ఎన్‌డిఎ లకు వంత పాడుతూ మెప్పు కోసం పాకులాడినా తెలుగు రాష్ర్టాలలోనూ మొత్తం దక్షిణాదిలోనూ మాత్రం బిజెపి కి, సిఇసి చర్యలకూ సానుకూలత రాకపోవడం గమనార్హం. ఎ.పి లో రెండు ప్రధాన ప్రాంతీయ పాలక పార్టీలు టిడిపి, వైసిపి లు బిజెపి పట్ల ప్రత్యేకించి మోడీకి మద్దతు ప్రకటిస్తూనే వచ్చాయి. మతతత్వం వంటి విధానాల్లో దాటేశాయి గానీ లౌకిక పోరాటంలో పాల్గొనలేదు. తెలంగాణలో బిఆర్‌ఎస్ కూడా స్థానిక పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ను టార్గెట్‌గా చేసుకోవడం తప్ప మత రాజకీయాలు, రాష్టాల హక్కులపై దాడి, ఓట్ చోరీ వంటి విషయాలపై కేంద్రీకరించింది లేదు. ఇలాంటి సమయంలో సిఇసి పై దుమారం రేగడం వాతావరణం కొంత మార్చింది. ఇసిసి నిమామకం విషయంలో తాము మద్దతునివ్వడం పొరబాటేనని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం జాతీయ చర్చకు దారితీసింది. వైసిపి గతంలో దాదాపు అన్ని విషయాల్లోనూ మోడీ సర్కారుకు అనుకూలంగానే ఓటేస్తూ వచ్చింది. అలాంటి పార్టీ ఒక్కసారిగా సిఇసి నియామకం విషయంలో జరిగింది తప్పని చెప్పేసింది.
బిజెపికి బ్రేకులు?
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతోనే అంతా మారిందనీ, ఆయన ‘ఇండియా’ వేదిక వైపు వచ్చేస్తున్నారని కొందరు మీడియా వ్యాఖ్యాతలు చెబుతున్నది కూడా పాక్షికమే. ఎందుకంటే ఎన్నికల విషయంలో మొదటి నుంచి వైసిపి భిన్నస్వరం వినిపిస్తున్నది. 2024లో తీర్పు తారుమారైందనే వాదనతో వారు ఇవిఎం లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి వచ్చారు. కేసులు కూడా వేశారు. కాకపోతే మీరు వైసిపి ని కూడా ఆహ్వానిస్తారా అని కాంగ్రెస్ నేతలను అడిగినప్పుడు బిజెపిని గట్టిగా వ్యతిరేకించే వారికి ఎప్పుడూ తమ తలుపులు తీసేవున్నాయని వారు జవాబిచ్చారు. అయితే వైసిపి మీడియాను, నేతల మాటలను గమనిస్తే వారు కాంగ్రెస్‌పై తమ దాడిని ఏమాత్రం తగ్గించినట్టు కనిపించదు. పైగా జగన్ ఆ పార్టీపై తిరుగుబాటుతోనే రాజకీయం ప్రారంభించారు. ఇప్పుడు ఎ.పి లో పిసిపి అధ్యక్షురాలిగా వున్న సోదరి షర్మిలతోనూ ఆయనకు వ్యక్తిగత ఆస్తి తగాదాలు కూడా తీవ్రంగానే వున్నాయి. ఇక ఆయనకు బాగా దగ్గరగా వుండే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబం ఆ పార్టీ కూడా తెలంగాణలో కాంగ్రెస్‌పైనే ప్రధానంగా పోరాటం తర్వాతనే బిజెపి జాతీయ రాజకీయాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టిడిపి అధినేత చంద్రబాబునూ కలిపి మాట్లాడుతుంటారు. అవసరమైతే బిజెపితో పట్టువిడుపులు చూపించడానికి అభ్యంతరం లేదన్నట్టు వారి నేతలు సంకేతాలిస్తుంటారు. కనక జగన్ సిఇసి పై తీసుకున్న వైఖరిలో ఒక అంశం మాత్రమే.
అయితే అదే సమయంలో జాతీయ రాజకీయాలపై ఈ మార్పు ప్రభావాన్ని విమర్శకులు పరిగణనలోకి తీసుకోవడానికి తగిన కారణముంది. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఇష్టానుసారం ఏకపక్షంగా లోక్‌సభ స్థానాల పెంపుకోసం పావులు కదుపుతున్న బిజెపి కి ఇది ఇబ్బంది కలిగించవచ్చు. సీట్ల సంఖ్య తగ్గకపోతే మద్దతునిస్తామని గతంలో డిఎంకె, బిఆర్‌ఎస్, వైసిపి వంటి పార్టీలు ప్రకటించాయి. నిజానికి తెలుగు పార్టీలు సీట్లు పెరుగుతాయని కొంత ఆనందపడ్డాయి కూడా. టివికె విజయ్ విజయం తర్వాత డిఎంకె స్టాలిన్, బిజెపి నవీన్ పట్నాయక్ వంటి వారు కూడా బిజెపి కి కొంత సుముఖత కనపర్చారు. సిఇసి ద్వారా ‘సర్’ విషయంలో జరిగిన కోట్ల ఓట్ల తొలగింపు కుట్ర బయటికి వచ్చాక విజయ్ ఈ ఆందోళనలో గొంతు కలిపారు. డిఎంకె కూడా సీట్ల పెంపుపై చర్చ జరగాలని ప్రతిపాదించింది. నవీన్ సూటిగానే తమ విముఖత వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసి చాలా కాలమైనా ప్రోరోగ్ చేయకుండా అట్టిపెట్టి అధాటున జరిపించి సీట్లు పెంచేసుకుందాం అనుకున్న బిజెపి కి వీటి వల్ల గొంతులో వెలక్కాయ పడినట్టయింది.
విశాల కృషి దిశలో...
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికి నాలుగు సార్లు చర్చ కోసం మోడీకి లేఖ రాసినా స్పందించకుండా లోపాయికారీగా ఏదో నడిపిస్తున్నారు. మరోవైపున ఖర్గేనే సమయం ఇవ్వలేదని సభావ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వింత ఆరోపణ చేశారు. ‘సర్’ అలా వుండగానే జనాభా లెక్కల మత లెక్కలు కలగాలపులగం చేస్తూ ప్రైవేటు వ్యక్తులను కూడా ఆ పనికి వినియోగించవచ్చునని ప్రకటించడంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ నేరుగా రాష్ట్రపతికే లేఖ రాశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ నిరసనలపై అణచివేత చర్చల గురించి ఆందోళన వెలిబుచ్చుతూ వ్యాఖ్యలు చేస్తే ఆయనకు ఐరాస లోని 20 మంది నిపుణులు మద్దతు ప్రకటించారు. ఓట్ చోరీ తర్వాత మోడీ పట్టు తగ్గిపోయిందని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే బాహాటంగానే వ్యాఖ్యానించడం యాదృచ్ఛికం కాదు. ఈ పూర్వ రంగంలో రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ మంత్రులూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌లూ సర్కారును కూల్చే కుట్రల గురించి గగ్గోలు పెట్టడం చూస్తున్నాం. ఇంకో వైపున రాహుల్ గాంధీ అధికారంలోకి రావడం కల్ల అని మోడీ, అమిత్ షా లు పనిగట్టుకుని దాడి చేయడం కూడా అందులో భాగమే. కాంగ్రెస్, గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ విశాల సమస్యలను దారి తప్పించడం బిజెపి వ్యూహం. సిజెపి, కాంగ్రెస్, ‘ఇండియా’ వేదిక, లౌకిక ప్రాంతీయ పార్టీలూ, ‘పీపుల్స్ ఎగైనెస్ట్ సర్’ లాంటి పౌర సంస్థలూ వేటికవే చూడటంగాక ప్రజాస్వామ్య లౌకిక భారతం కోసం విశాల కృషి సాగించడం కీలకమన్నది గుర్తుంచుకోవాలి. వాటిపై ఏదో పేరుతో దాడి చేయడంలో అంతర్గత పథకాలనూ గమనించాలి. ఉదాహరణకు విజయవాడ మేయర్‌గా ఎ.బి. వెంకటేశ్వరరావును ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలపర్చడంపై వస్తున్న వికృత వ్యాఖ్యానాలు కొందరు అక్కసు వెళ్లగక్కడం ఇలాంటిదే. ఇతరులు పార్టీలు మారినా మద్దతులు, మతలబులు మార్చినా సమస్య లేదు. వామపక్షాలూ విధానపరంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం జీర్ణించుకోలేకపోవడం విడ్డూరం. తెలంగాణలో కౌన్సిల్ ఎన్నికలపై బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలు జాతీయ రాష్ర్ట నేపథ్యాలు గమనించకుండా సంకుచిత కోణాలతో దాడి చేస్తే చెల్లుబాటవుతుందనుకోవడం అజ్ఞానం మాత్రమే. సహాయం కోరితే దానిపైనా దుష్ప్రచారాలు చేసినవారు భంగపడటం అనివార్యమే. సందర్భాన్ని, సమస్యనూ బట్టి లౌకిక ప్రజాస్వామిక శక్తులనూ వ్యక్తులనూ కలుపుకొంటూ ముందుకు సాగడంలో కలిగిన సత్ఫలితాలేంటో తాజా పరిణామాలే చెబుతున్నాయి.
తెలకపల్లి రవి








కామెంట్‌లు (0)