గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదాడి దాటుకుని సోనియా కితాబ్‌

13 గంటల క్రితం

Sonia Kitab survives the attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 05:22 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ప్రజా జీవితంలో కీలక పాత్ర వహించిన అధినేతలు మలి దశలో జ్ఞాపకాలు అందించడం ఒక వరవడిగా స్థిరపడిపోయింది. వాటిలో రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా ఏమేం జరిగిందన్నది కూడా చెప్పే అవకాశం లభిస్తుంటుంది. తమ పట్ల వున్న విమర్శలకూ అపోహలకూ చలామణిలో వున్న అవాస్తవాలకూ సమాధానం చెప్పే లేదా సమర్థించుకునేందుకు కూడా నేతలు వాటిని వాడుకుంటారు. పాశ్చాత్య దేశాలలోనైతే ప్రజా జీవితంలో కీలక పదవులకు పోటీ చేసే ముందు ఒక ఆత్మకథ లేదా జ్ఞాపకాలు కాదంటే మరో రూపంలో నేరుగా ప్రజలతో మాట్లాడటం తప్పనిసరిగా మారింది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్‌ ‌సహాయకులైన ఉపాధ్యక్షుడు వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ లు కూడా వచ్చే ఎన్నికలలో పోటీ కోసం ఆత్మకథలు సిద్ధం చేసుకుంటున్నారట. సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ (‌బంధం) పేరిట రాసిన ఆత్మకథ కూడా సంచలనాత్మక ఘట్టంలోనే బయిటకు వచ్చింది. దీన్ని మొదటి ప్రచురణకర్తగా వున్న ‘పెంగ్విన్‌’ మోడీ సర్కారు వత్తిడితో వెనక్కు పోతే ‘హార్పర్‌ ‌కాలిన్స్‌’ విడుదల చేసింది. ముందు నుంచి మంచి ఆసక్తితో పాఠకులు దీన్ని తీసుకుంటున్నారని సమాచారం.కికిక మీడియాలో జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ లతో ప్రమోషన్‌ ‌కూడా బాగా చేశారు. అందులో ఎవరి గురించి, ఏ ఘట్టం గురించి, ఏమి రాశారనేదానిపై వస్తున్న కథనాలు అంతటా కనిపిస్తున్నాయి. రాజీవ్‌ ‌గాంధీపై ప్రేమ, ఇందిరా గాంధీ కోడలిగా వచ్చిన తర్వాత పరిణామాలు, దారుణ హత్యలకు గురైన వారిద్దరి జ్ఞాపకాల బరువును అక్షరీకరించారామె. ముఖ్యమైన అంశాలు రెండు: తన విదేశీయతపై నిరతం దాడి చేయడాన్ని తప్పు పట్టడంతో పాటు తానెప్పుడూ ప్రధాని పదవి కోరుకోలేదని, వద్దనే అనుకున్నాననీ తేల్చి చెప్పారు. ఎమర్జన్సీకి, సిక్కులపై హత్యాకాండకు అనామోదం ప్రకటించారు. బాబ్రీ విధ్వంసంపై తీవ్ర విమర్శ చేస్తూ పి.వి. నరసింహారావు, ప్రణబ్‌ ‌వంటి వారిపై అభ్రిపాయాలు చెప్పారు. రాజకీయాలలో భిన్నాభిప్రాయాలు తప్పవు గానీ మొత్తంపైన సోనియా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌మతతత్వ రాజకీయ భావజాలం మాత్రం సహించరాదనే సంకల్పం వెలిబుచ్చారు. పైగా మీడియా వర్గాలు బాగా స్వాగతించాయి. దాంతో బిజెపికి ఈ పుస్తకం మింగుడు పడని వ్యవహారంగా మారింది. విదేశీయత వంటి విద్వేష వ్యాఖ్యలతోనే విరుచుకుపడి, విద్వేషం వెలిగక్కడం షరా మామూలే.

దిమాగీ నక్సల్‌... ‌నహీ అంటున్న హోం

దీపావళి జవాన్లతో జరుపుకుంటానన్న ప్రధాని మోడీ చత్తీస్‌గఢ్‌ వెళ్లి మావోయిస్టులను లేకుండా చేసినా దిమాగీ న‌క్సల్స్‌‌తో ప్రమాదం పొంచి వుందని రాజకీయ లెక్చరు దంచడం పరిశీలకులను ఆశ్చర్యపరచింది. ఒక ఆర్టీఐ కార్యకర్త దిమాగీ న‌క్సల్స్‌‌ అంటే ఎవరు, నిర్వచనమేమిటి, ఎంతమంది వున్నారు? వివరాలు కావాలని హోం శాఖకు అర్జీ పెట్టారు. అయితే తమాషా ఏమంటే హోం శాఖ నుంచి ఆయనకు వచ్చిన సమాధానంలో అలాంటి వివరాలు తమ దగ్గరేమీ లేవని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ చూసేది హోం శాఖ అయినప్పుడు వారికి తెలియకుండా ప్రధానికి మాత్రం ఎలా తెలిసింది? అర్బన్‌ ‌న‌క్సల్స్‌‌, ఆందోళన జీవి, దిమాగీ ఇవన్నీ ఆయన అనవరతం జపించే ఆణిముత్యాలు. మనసులో కూడా ఎవరూ బిజెపిని తప్ప మరో పార్టీని తల్చుకోకూడదా? ఇంతకూ ఎర్రకోట స్పీచు నుంచి చత్తీస్‌గఢ్‌ ‌బోధ వరకూ ఏలిన వారు ఎలా ఊక దంచుతున్నారో తెలియలేదా? రాహుల్‌‌ గాంధీ వంటి వారిని కూడా దిమాగీ నక్సల్‌, జాతి వ్యతిరేకులు అనడంతో ఆయన చర్చకు సిద్ధమా అంటూ ఎల్‌.ఒ.పి సవాలు విసిరారు కానీ నో రిప్లై! ఇంకో వైపున మల్లికార్జున ఖర్గే దీపావళిని సంతోషాల ఈద్‌ అనడం ముస్లింలు సంతోష పెట్టడానికని మరో దాడి. మనుషులను మతాల పేరిట విడగొట్టడమేగాక భాషకు కూడా ఆ రంగు పులమడం దారుణం కదా. మరి ఫెస్టివల్ ఆఫ్‌ ‌లైట్స్‌ అంటే పర్వాలేదా!

రామాయణం షాక్‌‌

​ నితీశ్‌ ‌తివారి దర్శకత్వంలో రణవీర్‌ ‌కపూర్‌, ‌సాయి పల్లవి, యష్ లతో వచ్చిన రామాయణం సంఘ్‌ ‌పరివార్‌‌కు దిగ్ర్భాంతికరంగా మారింది. ఈ దర్శకుడు రామాయణాన్ని వారు చెప్పే రీతిలో గాక కొత్త పోకడలతో తీయడమే అందుకు కారణమైంది. దాంతో రామాయణమా రావణాయణమా అని గగ్గోలు మెదలెట్టారు. సీతగా సాయి పల్లవి వేయడమేమిటన్నది చాలక చిత్రంలో ఆ పాత్ర పోరాటాలు చేయడం వారిక అస్సలు నచ్చలేదు. ఇది మొదటి భాగమే గనక మిగిలిన వాటిని కూడా చూద్దామనే కనీస ఓపిక లేకుండా శాపనార్థాలు పెడుతున్నారు. రామాయణం ప్రపంచంలో వందల రకాలుగా వుంది. తెలుగులోనే మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం ఆఖరుకు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం తమ తమ పద్ధతులలో భావనలు చేశాయి. తెలుగువారి ప్రియతమ పౌరాణిక నాయకుడు ఎన్టీఆర్‌ ‌‘సీతారామ కళ్యాణం’ నుంచి ‘దానవీర శూరకర్ణ’ దాకా పౌరాణిక పాత్రలను అనేక కోణాలలో ఆవిష్కరించారు. విస్సన్న చెప్పిందే వేదం అన్నట్టు తాము చెప్పేదే మతం, విశ్వాసం అనే వాళ్లకు ఇవన్నీ నచ్చుతాయా? సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ రామాయణం బ్రహ్మాండమైన వసూళ్లతో దూసుకుపోతున్నది. రాబోయే భాగాలు మరెంతగా షాకిస్తాయో అని హడలిపోతున్నారట. బిజెపి ఎంపీగా చేసిన బుల్లితెర కృష్ణుడు నితీశ్‌ ‌భరద్వాజ్‌ ‌మొదట చేసిన ప్రశంసను కూడా వెనక్కు తీసేసుకున్నారు. కాగా పోగా రామ్‌‌గోపాల్‌‌ వర్మ మాత్రం ఇది సంప్రదాయక రామాయణం కాదని అభినందించారు. పాత పౌరాణికాలపై తనకెప్పుడూ సంతృప్తికలగలేదన్న రాజమౌళి పూర్తి సంతృప్తి ప్రకటించారు.

సిఇసి జ్ఞానేశ్‌‌ లా పతా.. ఎబిసి ఉచ్చు?

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకే గోవింద అన్నట్లయింది పాపం సిఇసి జ్ఞానేశ్‌ ‌కుమార్‌ పరిస్థితి. ఇప్పటికి అరశత దినోత్సవమైంది ఆయన జనం ముందు మీడియాలో కనిపించి. ‘సర్‌’ ‌ప్రకంపనలతో దేశం అట్టుడికిపోయినా...మొత్తం ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) పీకల్లోతులో కూరుకుపోయి ఆ నిగూఢ ప్రక్రియకు రోజుకో సవరణ ప్రకటిస్తున్నా... లా పతా అన్నట్టు అడ్రసు లేకుండా పోయారంటే ఒక సమాధానం లభిస్తున్నది. ఇరవయ్యేళ్ల కిందట కేరళ రవాణా సంస్థ తాలూకు నిర్మాణాల కాలంలో అధికారిగా వుండిన జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌లంచం కోసం ఒత్తిడి చేయడంతో మలేషియాకు చెందిన ఇంజనీర్ లీ సీ బెన్ ఆత్మహత్య చేసుకుంటూ నోట్‌‌లో తన పేరు రాశారని గతంలోనే బయిటకొచ్చింది. బయిట పెట్టింది కూడా సి.పి.ఎం మాజీ అర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌. ఆయనపై చర్యలు మొదలు పెడుతున్న సమయంలోనే ఢిల్లీకి తీసుకుపోయి అమిత్‌‌ షా కు ఆంతరంగికుడై... ఆ పైన సర్వ రక్షణతో సి.ఇ.సి అయ్యారు. కాకుంటే తీగ లాగితే డొంక కదిలినట్టు ఐజాక్‌ ‌ప్రకటన తర్వాత ప్రస్తుత కేరళ ప్రభుత్వం ఎ.సి.బి దర్యాప్తునకు ఆదేశించింది. జ్ఞానేశ్‌ ‌తనను వేధిస్తున్నట్టు ప్రాణాలు తీసుకున్న లీ సీ బెన్‌ తనతో చెప్పారని అప్పటి కాంట్రాక్టరు వివో సాజన్‌ ఎ.సి.బి కి సాక్ష్యమిచ్చారు. అప్పుడే తను చెప్పినా పై అధికారులు పట్టించుకోకుండా మూసేశారని ఆయన కథనం, అవకాశమిస్తే కుటుంబ సభ్యులు అతని చివరి నోట్‌ ‌సమర్పిస్తారనీ, ఇతర సాక్ష్యాలూ వున్నాయని చెబుతున్నాడాయన. ఇది ఎంత దూరం పోతుందోనన్న భయమే సిఇసి ని నిలవేస్తున్నదా? ఇప్పుడంటే సిఇసి గా జ్ఞానేశ్‌‌కు రాజ్యాంగ రక్షణ వుంది గానీ గతంలో జరిగిన వాటికి వుండదు కదా? దాని గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి ఇరుక్కోవడమెందుకనా?

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్