వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని సుదీర్ఘ కాలంగా ప్రజలు పోరాడుతున్నారు. ఫ్లోరైడ్ నీళ్ళతో బాధలు, సాగునీరు లేక కరువు, వలసలు. ఫలితంగా దుర్భర పరిస్థితులు. మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాల భూమి సాగు చేయడానికి సుంకేశుల, గొట్టిపడియ తదితర 11 గ్రామాల్లో 8 వేల పైచిలుకు కుటుంబాలవారు 74 వేల ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసం ఇచ్చారు. కానీ తమ ఇళ్ళు, భూములు, గ్రామాలు, జీవనాధారాన్ని త్యాగం చేసిన ప్రజల జీవితాలు గాలిలో దీపం అయ్యాయి, వారి మెడ మీద కత్తి పెట్టారు. ఖాళీ చేయకపోతే కరెంటు కట్! క్రిమినల్ కేసులంటూ అధికారులు బెదిరిస్తున్నారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు 2008 నుండి నిర్వాసితులుగా మారిపోయారు. వారి భూములను ప్రభుత్వం సేకరించింది. అప్పటి నుండి వారికి పంట రుణాలు లేవు, రైతు భరోసా లేదు, సబ్సిడీలు లేవు, సంక్షేమ పథకాల అమలు లేదు, అభివృద్ధి లేదు. వారి పునరావాసం, పరిహారం, జీవనోపాధి, ఇళ్ళ నిర్మాణం వంటి సమస్యలు ఇన్నేళ్ళయినా పరిష్కరించలేదు. ప్రభుత్వం సుమారుగా 7,555 కుటుంబాలను గుర్తించి, రెండుసార్లుగా గెజిట్ ప్రకటించింది. ఇటీవల నివేదికలలో 7,321 కుటుంబాలకు సంబంధించిన చెల్లింపుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నది. వాస్తవంగా మొదట 2007లో ప్రాజెక్టు గెజిట్ ప్రకటించినప్పుడు 3,901 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. 2016, 2017 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు నిండినవారిని కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చాలని చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2019 ఆగస్టు 31వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను గుర్తించి మరో 3,013 మందిని అర్హులుగా తేల్చి గెజిట్ ప్రకటించారు. కానీ 2019 నుండి ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న సంఖ్యలలో తేడాలున్నాయి. సుమారు 600 కుటుంబాలు గెజిట్‌లో ప్రకటించకపోవడం లేక సర్వేలోనే లబ్ధిదారుల జాబితాలలో లేకుండా పోయారు. ఉదాహరణకు ఆవుల పిచ్చయ్య అన్నదమ్ములు ఐదుగురు. మిగిలిన నలుగురు అన్నదమ్ముల పేర్లు జాబితాలో చోటు చేసుకున్నాయి. కానీ పిచ్చయ్య పేరు జాబితాలో లేదు. ఆయన 2025లో మరణించారు. ఇప్పుడు తన భార్య, ఒక మేజర్ అయిన కొడుకు ఉన్నారు. వారి పేర్లు జాబితాలో చేర్చమని కోరుతున్నా ఇంత వరకూ చేర్చలేదు. ఇలాంటి వాటికి భారీగా లంచాలు వసూలు చేస్తున్నారు.
భూమికి రేటు మాత్రమే కాదు, జీవన భద్రత కీలకం
భూసేకరణ చట్టం-2013 కేవలం భూమికి డబ్బు చెల్లించే చట్టం మాత్రమే కాదు. ఈ చట్టం ప్రకారం మార్కెట్ రేటు కంటే గ్రామాలలో 3 రెట్లు అదనంగా ధర చెల్లించాలి. అంతేకాదు భూమి కోల్పోయిన కుటుంబాలు తమ జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకునేలా సహాయం కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. నష్టపరిహారం చెల్లించేటప్పుడు భూమి విలువతో పాటు ... పంటలు, చెట్లు, ఇతర ఆస్తులకు కలిగే నష్టం, జీవనోపాధిపై ప్రభావం, అంతేగాక ఇల్లు, వ్యాపార స్థలం మార్చుకున్నందున కలిగే ప్రభావం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చట్టం చెబుతుంది. కానీ అధికారులు, ప్రభుత్వం ఈ చట్టాన్ని పక్కకు నెట్టేస్తున్నారు, అమలును నిరాకరిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కొద్దిమంది నాయకులను పిలిచి ఆగస్టు 24 నాటికి ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పడం నిర్వాసితుల కుటుంబాలపై బాంబు వేసినట్లయింది. ఈ సంవత్సరం రైతులు సాగు చేస్తుంటే ప్రభుత్వం మీరు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, సాగు చేయవద్దని చెప్పలేదు. అంతేకాదు ఇప్పటివరకూ పరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం ఇచ్చాక ఆరు నెలల సమయం ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ఎంత కావాలంటే అంత ఎప్పటికప్పుడు చెల్లించిన ప్రభుత్వం మా గురించి ఎందుకు పట్టించుకోదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్వాసితుల ఇళ్ళ నిర్మాణం ఎక్కడా మొదలు కాలేదు. పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలలు లేవు. వాటర్ ట్యాంకుల నిర్మాణం అరకొరగా ఉంది. జీవనోపాధి ఏర్పాట్లే లేవు. అంతేగాదు, గొట్టిపడియా గ్రామానికి ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పూర్తి చేయకుండా ఖాళీ చేయమనడం అంటే వారిని ప్రాజెక్టులో ముంచడమే. ఆనాడు జిల్లా కలెక్టర్ ఇళ్ళు కట్టిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి.
జెన్ జి నిర్వాసితులు
పద్దెనిమిదేళ్ళు నిండిన యువత సమస్య వెలిగొండ నిర్వాసితులకు సంబంధించిన ఒక కీలకమైన అంశంగా ముందుకొచ్చింది. 2019 నాటికి మైనర్లుగా ఉన్న పిల్లలు సుమారుగా 1500 మంది ఇప్పుడు మేజర్లు అయ్యారు. ప్రాజెక్టు ఆలస్యమైనందుకు ఈ యువతీయువకులు బలవుతున్నారు. వారు అప్పటికి మైనర్లు కాబట్టి పక్కన పెడతాం అనడం న్యాయ సమ్మతమా? ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల నిర్వాసితుల కుటుంబాల్లో మైనర్లు యువకులుగా మారితే వారి హక్కులను కూడా పున:పరిశీలన చేయాలి. అందుకే 2013 చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండిన యువతకు హక్కుల్ని వర్తించే విధంగా ప్రభుత్వం జులై 2026ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులివ్వాలని యువత ఆందోళన చేస్తున్నారు. పోలీసు లాఠీలకు వెరవకుండా నిలబడుతున్నారు. తాజా అంచనాల ప్రకారం పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి సంబంధించిన అదనపు చెల్లింపుల కోసం సుమారుగా రూ.180 కోట్లు అవసరమవుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.180 కోట్లు కేటాయించలేరా? అని యువత ప్రశ్నిస్తున్నది.
ఏం జరగాలి?
ప్రభుత్వం తక్షణం యువతపై ప్రత్యేక సర్వే చేయాలి. గ్రామాలవారీగా వారి వివరాలను ప్రకటించాలి. అర్హతపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రభుత్వ ప్రకటన ప్రకారం మరో 4,761 మందికి పరిహారం వెంటనే చెల్లించాలి. అంతేగాక అధికారుల పొరపాట్ల కారణంగా అన్ని అర్హతలున్నా జాబితాలో తప్పిపోయిన కుటుంబాలను పరిశీలించి వారిని కూడా జాబితాలో చేర్చాలి. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కావాలి. ఇళ్ళ నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని అమలు చేయాలి. నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్‌ను ప్రభుత్వం బల్క్‌గా సరఫరా చేయాలి. ఇళ్ళ నిర్మాణం మొదలు కానిచోట కాలనీ మంజూరు చేసేశాం అనే ప్రకటన కాకుండా ప్రతి కుటుంబం కనీసం నివసించగలిగే స్థాయిలో పునరావాసాన్ని పూర్తి చేయాలి. అందుకు ప్రజలకు సమయం ఇవ్వాలి. శ్రీశైలం నిండుతుందో, నిండదో ఎవరూ చెప్పగలిగే పరిస్థితి లేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడిన ప్రాజెక్టు ఇది. నీళ్ళు వస్తున్నాయనే పేరిట అర్థాంతరంగా ఖాళీ చేయమనడం మానవ హక్కులను, చట్ట హక్కులను ఉల్లంఘించడమే. ఇప్పటివరకు తాగునీటి అవసరాల కోసం నిర్మాణం చేయాల్సిన వాటర్ ట్యాంకులనుగానీ, పైప్‌లైన్లు గానీ, సాగునీటికి అవసరమైన కాల్వల నిర్మాణాలు గానీ ఇంకా పూర్తికాలేదు. వెలిగొండ ప్రాజెక్టు నిండినా ఈ నిర్మాణాలు పూర్తి కాకుండా తాగునీరు, సాగునీరు అందుబాటులోకి రాదు.
అడుగడుగునా అవినీతి
ప్రభుత్వం పారదర్శకంగా నిర్వాసిత కుటుంబాలు, పరిహారం చెల్లించిన కుటుంబాలు, పరిహారం చెల్లించాల్సిన కుటుంబాలు, ఒటిఎస్ ఎంచుకున్న కుటుంబాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎంచుకున్న కుటుంబాలు, పద్దెనిమిదేళ్ళు నిండిన కొత్త అర్హుల సంఖ్య తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దళారులకు రూ.10 వేల నుండి రూ.2.5 లక్షల వరకు లంచాలుగా ఇవ్వాల్సి వస్తున్నదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. 2006 నాటి రేషన్ కార్డులు కావాలని అధికారులు అడుగుతున్నారు. అవి ఎవరు ఇవ్వాలి? అధికారులే కదా!
దొందూ దొందేనా?
వైసిపి పాలనలో ఒక టన్నెల్ పూర్తి చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండో టెన్నెల్‌ను పూర్తి చేసింది. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లింపుల గురించి రెండు ప్రభుత్వాలూ జాగ్రత్తగా చూసుకున్నాయి. కానీ పునరావాసం సంగతి మాత్రం రెండు ప్రభుత్వాలకూ పట్టలేదు. గతంలో గండికోట ప్రాజెక్టు పూర్తికాకుండానే నీరు వదిలి నిర్వాసితులను నీట ముంచింది. అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన భోగాపురం విమానాశ్రయ నిర్వాసితులను గాలికొదిలేసింది. రెండు లక్షల కుటుంబాలను నీట ముంచే పోలవరం నిర్వాసితుల పరిహారం పునరావాసం గురించి తగిన విధంగా పట్టించుకోవడం లేదు. ప్రజల త్యాగాలను మరిచి అభివృద్ధి జరిగిందంటూ ప్రచారం సాగిస్తే అది నేతి బీరకాయలో నెయ్యి మాత్రమే అవుతుంది.

వ్యాసకర్త : సిపియం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి







కామెంట్‌లు (0)