శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతాతాజీ ఎప్పటికీ ఆదర్శప్రాయుడే!

9 గంటల క్రితం

tapidharmarao-1789655672194-8564.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‘‘దేవుడి గది వైపు కాళ్ళు పెట్టి చదువుకుంటున్నావేమిట్రా? తియ్-కాళ్ళు తీసి ఇటు వైపు పెట్టుకో’’ అని గద్దించింది ఓ తల్లి కొడుకును. పాఠం చదువుకుంటున్న కుర్రవాడు గబుక్కున కాళ్ళు దగ్గరికి లాకున్నాడు. కానీ, వెంటనే తనకు గుర్తొచ్చిన పద్యం చదివి వినిపించాడు. ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు ... ఎందెందు వెదికినా అందందే గలడు" అని అంటారు కదమ్మా? దేవుడు లేని స్థలమంటూ లేదని చెపుతున్నప్పుడు.. మరి నేను కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలీ?’’ అని అమాయకంగా అడిగాడు. అంతే కాదు, ఆ కుర్రవాడు ఒక తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తాడు. అతని గొంతులో హేతువాదం బలంగా వినిపించింది. ఆ కుర్రవాడి పేరు తాపీ ధర్మారావు. వివేచన, వివేకంగల పిల్లలు సహజంగానే హేతువాదులవుతారు. వారి ఆలోచనలు సూటిగా బలంగా ఉంటాయి. అహేతుకమైన అంశాల్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతారు.

అలాగే, నవయువకుడిగా ఎఫ్.ఎ (ఇంటర్ స్థాయి) పరీక్షలకు వెళుతున్నప్పుడు మరొక సంఘటన జరిగింది. నూనె కావడి ఎదురొచ్చింది. అలా రావడం అశుభమని, అగి- పొమ్మని చాలా మంది వారించారు. ధర్మారావు వినలేదు. ఆగిపోలేదు. వెళ్ళి, పరీక్షలు రాసి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అలా అంధ విశ్వాసం అడ్డు తొలగించుకున్నాడు.

బాల్యంలోనూ, తొలి యవ్వన దశలోనూ ధర్మారావు ఎవరినో చూసి, నేర్చుకున్నది ఏమీ లేదు. ఇంట్లోగానీ, చుట్టు పక్కలగానీ ఆ వాతావరణమే లేదు. అయినా, బాల్యంలోనే అతనికి తర్కం సహజంగా అబ్బింది. అందుకే ప్రముఖ హేతువాదిగా ఎదగగలిగాడు. తెలుగు ప్రజల మొద్దు నిదురను వదిలించే 'కాగడా'ను ఎత్తి పట్టుకున్నాడు. భక్తుల మూఢ నమ్మకాల్ని బద్దలుకొట్టాడు. ‘కాగడా, జనవాణి, సమదర్శిని, కొండెగాడు...’ వంటివన్నీ ఆయన పత్రికా రచయితగా ఎదిగిన తర్వాత, ప్రారంభించి, నిర్వహించిన తెలుగు పత్రికలు. బహుముఖాలుగా విలసిల్లిన ఆయన ప్రతిభకు ఇదొక పార్శ్వం. ‘‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకూ?", ‘‘పెళ్లి - దాని పుట్టు పూర్వోత్తరాలు", "ఇనుప కచ్చడాలు"-వంటి తాపీ ధర్మారావు రచనలు చదవని తెలుగు పాఠకులు బహుశా ఉండి ఉండరు. 'పాత పాళీ', ‘ కొత్త పాళీ', ‘ఆలిండియా అడుక్కుతినే వాళ్ళ మహాసభ' వంటి ప్రసిద్ధ గ్రంథాలు - ఆయన భాషా పాండిత్యాన్ని ఒకవైపు ప్రదర్శిస్తూ ఉంటే, అవే- మరొక వైపు సామాజిక స్థితిగతులపై తీవ్రమైన అస్త్రాలుగా పనిచేశాయి. "ఆంధ్రులకొక మనవి"- అంటూ 1911లో గ్రంథ రచనను ప్రారంభించిన తాపీ, దాదాపు 22 ప్రసిద్ధ గ్రంథాల్ని తెలుగు పాఠకులకు అందించారు. తరాలు మారుతున్నాయి. కానీ, తాపీ ధర్మారావు రచనలు పునర్ముద్రణలు పొందుతూ, కొత్త తరానికి అందుతూనే ఉన్నాయి. ఇంటింటా జ్ఞాన దీపాలు వెలిగిస్తూనే ఉన్నాయి.

తాపీ ధర్మారావు 1887 సెప్టెంబర్ 19న ఒరిస్సాలో ఉన్న గంజాం జిల్లా బరంపురం (బెర్హంపూర్)లో జన్మించాడు. అసలు వీరి పూర్వీకుల ఇంటి పేరు బండారు. కానీ, పూర్వీకుల్లో ఒకరైన లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగిగా పని చేసి, తిరిగి వచ్చాక తాపీ పనితో ప్రాచుర్యం పొందాడు. తాపీ లక్ష్మయ్యగా అందరూ వ్యవహరించే వారు. అలా వారి ఇంటి పేరు బండారు మరుగున పడిపోయి, తాపీగా స్థిరపడింది. ధర్మారావు చదువు పూర్తి చేసుకుని, కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయుడిగా చేరారు. కాలక్రమంలో ప్రసిద్ధ పత్రికా రచయితగా ఎదిగిన తర్వాత, పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు ఈయనకు శిష్యుడయ్యాడు.

రచయితగా తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన ధర్మారావు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. 1937 లో ‘మోహినీ రుక్మాంగద'కు సంభాషణలు రాయడం ప్రారంభించి, 1962లో 'భీష్మ' చిత్రానికి సంభాషణలు రాసేవరకు నిరాఘాటంగా కొనసాగింది. మధ్యలో 'మాలపిల్ల', 'రైతుబిడ్డ ' లాంటి ప్రసిద్ధ తెలుగు చలన చిత్రాలు ఆయన ఖ్యాతిని ఇనుమడింపచేశాయి. గుడిపాటి వెంకటాచలం తాపీ వారిని గౌరవంగా ‘తాతాజీ' అని పిలిచేవారు. ఆ పేరు చాలా ప్రాచుర్యం పొందింది.

85 సంవత్సరాలు అవిశ్రాంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన తాపీ ధర్మారావు 1973 మే 8న శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. జన సామాన్యానికి సులభంగా అర్థమయ్యే జనభాషను పత్రికా రచనలో ప్రవేశపెట్టి తాపీ ధర్మారావు ప్రాచుర్యం కల్పించినందువల్ల కదా మనం ఇంత విస్తృతంగా తెలుగులో సమాచారం పంచుకోగలుగుతున్నాం? ఆ విషయం గుర్తుంచుకోవడానికే తాపీ ధర్మారావు జయంతి 19 సెప్టెంబర్ ను 'తెలుగు మాధ్యమాల దినోత్సవం'గా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం! తాతాజీ లాంటి అతి కొద్దిమంది తాము జీవిస్తున్న కాలానికే కాదు, భవిష్యత్‌ కాలాలకు కూడా ఆదర్శప్రాయుల వుతారు. తమ సమకాలీనుల్ని చైతన్యపరచడమేకాదు, రాబోయే తరాల్ని కూడా ప్రభావితం చేస్తారు. చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, ఉపాధ్యాయుడు, హేతువాది, సాహితీవేత్త అయిన తాతాజీ - మన తాపీ ధర్మారావు మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడే!

devarajumaharaju-1789656795705-8598.jpg

వ్యాసకర్త - ప్రొ. దేవరాజు మహారాజు,
కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్