న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు గురించీ, మరీ ముఖ్యంగా మోడీ సర్కారు నిరంతర ఒత్తిడి, జోక్యం గురించి కథనాలు వింటూనే వస్తున్నాం. ఒక్కసారి జస్టిస్ చలమేశ్వర్ ఆధ్వర్యంలో బహిరంగ తిరుగుబాటు స్వరం వినిపించింది. కానీ న్యాయమూర్తులు గనక జాగ్రత్తగా మాట్లాడుతుండటంతో ఈ విషయాలు సూటిగా రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కౌల్ ఆ తెర తీసేశారు. భయం, ప్రియం లేకుండా అన్న పేరిట రాసిన తన జ్ఞాపకాలలో జస్టిస్ సంజయ్ ఏకంగా మాజీ సిజెఐ డి.వై.చంద్రచూడ్ హయాంలో నిర్వాకాలనే బయిటపెట్టడం ప్రకంపనలు పుట్టించింది. సిజెఐ గా చంద్రచూడ్ ప్రధాని మోడీ పట్ల అవసరానికి మించి విధేయంగా వుండేవారన్నది సంజయ్ కౌల్ మాటల సారాంశం. న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పడిన కొలీజియం సమావేశాల ముందే సిజెఐ చంద్ర చూడ్... మోడీ సర్కారుతో మాట్లాడుతుండేవారట. వారు ఇష్టపడేవారిని నియమించడం సులభమని భావించేవారట. ఇది అనవసరమని తాను సూచించినా ఆయన వినిపించుకోలేదు. ఒకసారి కొలీజియంలో ఒక పేరును అందరూ వ్యతిరేకించారు. కానీ తనను కేంద్రం ఆమోదించే అవకాశముందని తనకు తెలుసని సిజెఐ ఒప్పించారు. ఇలా అయితే ఇక మనం కొలీజియం చర్చ ఎందుకు, మీరే వారిని అడిగి పెట్టేస్తే అయిపోతుంది కదా అని జస్టిస్ సంజయ్ నిరసన తెలిపారట. ఒకసారి తాము వాకౌట్ కూడా చేశామన్నారు. ఇదేగాక ఒకసారి మనీ లాండరింగ్ కేసు వస్తుంటే కాస్త మధ్యేవాదంగా వెళ్లమని సిజెఐ సూచించారట. అంతకు ముందటి పరిణామాల రీత్యా తాను విచారణ నుంచి తప్పుకుంటే వెంటనే తనపై వ్యాఖ్యలు చేసిన మహిళా న్యాయమూర్తితో సహా కొత్త ధర్మాసనం ఏర్పాటు చేశారట. ‘సిజెఐ పై ఎవరో ఒత్తిడి చేస్తున్నారని నాకు అర్థమైంది. అయితే అది ఎవరనేది నేను చెప్పలేన’ని సంజయ్ జాగ్రత్తగా వ్యాఖ్యానించారు. వినాయక ఉత్సవం పేరిట నాటి సిజెఐ ప్రధాని మోడీని అధికార నివాసానికి ఆహ్వానించడం కూడా తనకు నచ్చలేదన్నారు. వాస్తవానికి సిజెఐ గా వున్నప్పుడే చంద్రచూడ్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు లోపలి నుంచే వాటికి నిరూపణ లభించడం విశేషం.
ఖైదు చేసిన రజనీకాంత్
కంసుని చెరసాలలో ఖైదీగా పుట్టావు...కాంతల కౌగిళ్లలో ఖైదీగా పెరిగావు.. కరకు రాతి గుళ్లలో ఖైదీగా వున్నావు.. అని కృష్ణుడి గురించి పాడతాడు ‘బుద్ధిమంతుడు’లో పూజారి మాధవయ్య పాత్రలో అక్కినేని. అలాగే ఖైదును అంటే జైళ్లను కాపలా కాసే ‘జైలర్’ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ అంత పనీ చేశాడు. ఆయన ప్రేక్షకులను ఖైదు చేశాడో లేక వారే ఆయనను చేశారో గానీ 70 ఏళ్ల తర్వాత కూడా తమిళ ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. ‘జైలర్’ హిట్ తర్వాత సీక్వెల్‌గా తీసిన ‘జైలర్ 2’ తమిళంలో అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది కూడా రూ.700 కోట్లకు పైగా రాబట్టి అదే అత్యధిక వసూళ్లు నమోదు చేసిందట. అలా అని పెద్ద అసాధారణమైన చిత్రమా అంటే అదీ కాదు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే నేరస్త నేపథ్య కథ. హింస కూడా ఎక్కువే. రజనీ వేసింది గ్లామర్ రోల్ కూడా కాదు. అయినా రికార్డులు తిరగరాసిందంటే ఆయనపై వున్న అభిమానమే కారణమంటున్నారు. నిజానికి ఇరవై ఏళ్ల కిందట ‘బాబా’ తీసిన రోజు నుంచి రజనీ సినిమాలు మానేస్తానంటూ వుంటారు గానీ అది జరగదు. తమిళ ప్రేక్షకులు ఆయనను వదలడమూ జరగదు. ఈ మధ్యలో కొంత కాలం రాజకీయ ప్రవేశమంటూ ఊగిసలాడి వదిలేశారు. విజయ్ ఆ అవకాశం తీసుకుని సి.ఎం అయిపోయారు. ఇప్పుడు ఆయన మాజీ అల్లుడైన ధనుష్ ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కాకపోతే మామ లాగే ధనుష్ కూడా బిజెపి కి అనుకూలమనే కథనాలున్నాయి. ఇక చూడాలి.
రఘురామ పురాణం
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గురించి ఆయన డైలీ కామెంటరీ గురించి తెలియని వారుంటారా? కూటమి గెలవడానికి ఆయన కామెంటరీ కూడా బాగా ఉపయోగపడిందంటారు గానీ ఆయనకు కోరిన పదవి రాలేదు. అడపాదడపాగా తన అసంతృప్తిని మీడియాలో వెళ్లగక్కుతూనే వుంటారు. రాకున్నా రాజకీయం తక్కువ లేదు. ఆకివీడులో గొంతేనమ్మ గుడి కూల్చి సంఘ పరివార్‌తో కలసి రామాలయ నిర్మాణమంటూ మత రాజకీయాలకు మంట పెట్టారు. నియోజకవర్గంలో పేదల ఇళ్లు తొలగింపచేయడంలోనూ ఒత్తిడి తెచ్చారు. సిపిఎం నాయకులపై నోరు పారేసుకుని దెబ్బతిన్నారు. ఆ సమయంలోనే సిపిఎం నేతలు ముందు మీ అక్రమాదాయాలు, బ్యాంకులకు ఎగవేతలు చూసుకొమ్మని ఎదురొడ్డించారని తల్లడిల్లిపోయారు. ఈ కేసులలో ఒక తాకట్టు ఆస్తిని వేలంలో పాడుకున్న వ్యాపారిపైనా దౌర్జన్యం చేసినట్టు కేసు ఎదుర్కొన్నారు. ‘ఇండ్-భారత్’ సంస్థ పేరిట బ్యాంకుల దగ్గర రూ.230 కోట్లకు పైగా రుణాలు తీసుకుని దారి మళ్లించినందుకు తనపై సిబిఐ చేస్తున్న దర్యాప్తు ఆపేయించాలని ఏకంగా సుప్రీంకోర్టుకే వెళ్లారు. అయితే అక్కడా భంగపాటు తప్పలేదు. అత్యున్నత న్యాయస్థానం ఆయన మొర వినలేదు సరికదా 16 వారాల లోగా వేంటనే దర్యాప్తు ముగించేయాలని ఆదేశాలిచ్చింది. ఇది కూడా అంతకు ముందు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కొనసాగింపుగానే. రోజూ సూక్తులు చెప్పడం కన్నా కనీస విలువలు పాటించడం కీలకమని దీన్ని బట్టి మరోసారి తెలియడం లేదా. రామా రఘురామా!
- పీపీ








కామెంట్‌లు (0)