సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతాంగ హక్కుల సాధనకు అలుపెరుగని పోరాటాలు

1 రోజు క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 04:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

రైతాంగ పోరాటాలకు కేంద్రంగా ఉన్న అఖిల భారత కిసాన్ సభ (ఎ.ఐ.కె.ఎస్‌) జాతీయ మహాసభ నవంబర్ 15 నుండి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్గొండలో జరగనుంది. ఎ.ఐ.కె.ఎస్‌ 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో రైతాంగ ప్రయోజనాల కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం నికరంగా నిజాయితీగా నిలిచింది. ఆ పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రపంచంలోనే ముఖ్యమైన సంఘంగా, దేశంలో అతి పెద్ద రైతు సంఘంగా ఎ.ఐ.కె.ఎస్‌ గుర్తింపు పొందింది. 1936 ఏప్రిల్ 11వ తేదీన లక్నోలో ఆవిర్భవించిన అఖిల భారత కిసాన్ సభ నాడు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాగా నేడు 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోటి 58 లక్షలకు పైగా సభ్యత్వంతో రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేస్తున్నది.

90 సంవత్సరాల కిసాన్ సభ

అణిచివేత, దోపిడితో కూడిన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనుల సమస్యలపై పోరాటాల ఫలితంగా కిసాన్ సభ ప్రారంభమైంది. జమీందారీ వ్యవస్థ నిర్మూలన, దున్నేవారికే భూమి, సహకార పద్ధతిపై సాగు లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. రైతులను ఐక్యంచేసి పోరాటాలను పటిష్టపరిచేందుకు కృషి చేసింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, బెంగాల్‌ ‌లో తెబాగా పోరాటాలు, కేరళలో ఉన్నప్ర వాయలార్, ఉత్తర మలబార్ పోరాటాలు, త్రిపురలో గణ ముక్త్ పరిషత్ పోరాటాలు, బీహార్‌‌లో బకాస్త్, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ, అస్సాంలో సుర్మావాలి పోరాటాలను ఎ.ఐ.కె.ఎస్‌ పెద్దఎత్తున నిర్వహించింది. అలాగే పంజాబ్‌‌లో ముదిరాజ్ కౌలు పోరాటాలు, కాశ్మీర్‌లో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

స్వాతంత్య్రానంతరం కూడా కిసాన్ సభ తన పోరాట పంథాను కొనసాగించింది. బ్రిటిష్ వాడు పోయి మన పాలకులు వచ్చినా చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా భూస్వాములకు మేలు జరిగింది. ఒకవైపు భూమి కేంద్రీకరణ పెరగగా మరోవైపు భూమి లేని పేదలు కూడా పెరిగారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు తీవ్ర అణచివేతకు గురయ్యారు. కానీ కిసాన్ సభ తన విప్లవాత్మక భూసంస్కరణకై దున్నేవానికి భూమి, భూమిలేని వారికి భూమి నినాదంతో ఉద్యమాలను కొనసాగించింది.

నూతన ఆర్థిక విధానాల దుష్ప్రభావాలపై రైతాంగ పోరాటాలతోపాటు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో నష్టదాయకమైన ఈ విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ 2014 నుండి బిజెపి ప్రభుత్వం రైతులు, కార్మికులపై దాడులు తీవ్రం చేసింది. ఈ విధానాలు సామ్రాజ్యవాద శక్తులకు, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాయి. దీంతో వ్యవసాయ రంగంలో వచ్చిన సంక్షోభం వల్ల గత మూడు దశాబ్దాల్లో నాలుగు లక్షల మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకోగా... మోడీ కాలంలోనే లక్ష మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పేదరికం, నిరుద్యోగం, ఆకలి ఎన్నో రెట్లు పెరిగాయి.

అందువల్ల 2014 నుండి రైతాంగ పోరాటాలు తీవ్రమయ్యాయి. రైతు వ్యతిరేక మూడు చట్టాల రద్దు, సి2+50 ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు నిర్ణయం, రైతుల ప్రయోజనాలను రక్షించే విధంగా పంటల బీమా పథకం, సమగ్ర భూసంస్కరణలు, అటవీ హక్కుల చట్టం అమలు కోసం రైతుల పోరాటాలు జరిగాయి. యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, విద్యుత్‌ సాగునీటి వనరుల ప్రైవేటీకరణ, కార్పొరేట్ అనుకూల నాలుగు లేబర్ కోడ్స్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం స్థానంలో వచ్చిన వి.బి గ్రామ్‌ జి ఉపాధి హామీ చట్టం, ప్రతిపాదిత అమెరికా భారత వాణిజ్య ఒప్పందం లాంటి సమస్యలపై పోరాటాలు చేసింది.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టాన్ని మారుస్తూ 2015లో ఆర్డినెన్సు తీసుకువచ్చారు. భూమి అధికార్ ఆందోళన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోరాటంతో మోడీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అలాగే 2020 నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతాంగ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాదాపు సంవత్సరం పైగా ఎన్నడూ లేనంతగా లక్షలాది మంది రైతులు పాల్గొన్న ఈ ఉద్యమం మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునేలా చేయగలిగింది. ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరులైనారు.

ఈ కాలంలోనే రుణ మాఫీ, పెన్షన్, పంటల బీమా ప్రయోజనాల చెల్లింపు కోసం రాజస్థాన్‌ ‌లో, రుణ మాఫీ కోసం మహారాష్ట్రలో రైతులు పోరాడి కొంతవరకు సాధించారు. భూమి హక్కుల కోసం, అటవీ హక్కుల చట్టం అమలు, రుణమాఫీ,పెన్షన్ చెల్లింపు కోసం ఆదివాసీలు, రైతులు, మహిళలు చెప్పులు కూడా లేకుండా నాసిక్ నుండి ముంబాయి వరకు నిర్వహించిన లాంగ్ మార్చ్ ఎంతో గుర్తింపు పొందింది. ఈ విధంగా దాదాపు లక్షలాది మంది రైతులు ఉద్యమాల్లో పాల్గొని ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా కేంద్రంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా 124 రోజులు పోరాడారు. 33 మందిని అరెస్టు చేసి జైలుకి పంపారు. అంతిమంగా విజయం సాధించారు. కర్ణాటక లోని చెన్నరాయపట్నంలో ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు పూనుకోగా...ఆ ప్రాంత రైతాంగం 1200 రోజులు వీరోచితంగా పోరాడారు. చివరికి ప్రభుత్వం ఆ జీవోని వెనక్కి తీసుకుంది. భూసేకరణ కోసమే అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా కరేడులో ప్రభుత్వం భూసేకరణ చేయడానికి సిద్ధపడగా స్వతంత్రంగా, ఐక్యంగా ఆందోళన చేశాం. ప్రస్తుతానికి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దేశంలో రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల చట్టాలు అనేకం వస్తున్నాయి. గత పోరాటాల అనుభవంలో మరిన్ని పోరాటాలు చేసి వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి, రైతులు గెలవడానికి కృషి చేయాలి.


లక్నో నుంచి నల్గొండ వరకు

కిసాన్ సభ నేటికీ కోట్లాది మంది రైతులకు, కౌలు రైతులకు, ఇతర పేదలకు ఆశాజ్యోతిగా, పోరాటాలకు చిహ్నంగా ఉంది. ఎఐకెఎస్ చరిత్ర కాన్ఫరెన్స్ (మహాసభ) గదిలో లిఖించబడదు. క్షేత్రాలలో, గ్రామాలలో చేయబోయే పోరాటాలతో రాయబడుతుంది. ప్రత్యామ్నాయం కోసం చేసే పోరాటాల్లో భాగంగా లక్షలాది క్షేత్రాల్లో మన ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుంది. అందుకోసం ‘రైతాంగాన్ని ఐక్యం చేద్దాం. ముందుకు సాగుదాం’ అని ఈ మహాసభ పిలుపునిస్తున్నది.


వ్యాసకర్త: యం. హరిబాబు

ఎ.పి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్