శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశ్వాసం - విద్వేషం

9 గంటల క్రితం

ephildiscrimination-1789652315445-7166.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

మతం లేదా ఒక భావజాలం పట్ల విశ్వాసంగా ఉండడం వ్యక్తిగతం. తన విశ్వాసమే నిజమని, దానినే అందరూ అంగీకరించాలని బలవంతం చేయడం విద్వేషం. వ్యక్తిగత విశ్వాసం విద్వేషంగా మారితే సమాజానికి, దేశానికి తీవ్ర ప్రమాదం. విద్వేషాన్ని అరికట్టడానికి, పౌరుల హక్కులను కాపాడడానికి తరాలనాటి అనుభవాల ఆధారంగా ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థ చట్టాలను రూపొందించుకుంది. ఏ మత, లేదా భావజాల విశ్వాసకులైనా ఆ చట్టాలకు లోబడే జీవించాలి. అందుకు విరుద్ధంగా ప్రవర్తించకుండా చూడాల్సిన బాధ్యత చట్టాలది, వాటిని అమలు చేయడం పాలకుల విధి. ఇటీవల దేశం లోపల, బయట జరిగిన మూడు ప్రధాన ఘటనలు పెరుగుతున్న విద్వేష ప్రమాదానికి సంకేతాలు. దేశంలో స్వతంత్ర భరద్వాజ్, పారిస్‌లో స్వామినారాయణ్ సంస్థ, కెనడాలో ప్రవాస భారతీయురాలి వివాదం, ఈ ఘటనలు వేరువేరు సందర్భాలలో చోటుచేసుకున్నా ఒకే ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. ‘విశ్వాసానికి హద్దు ఎక్కడ?’, విశ్వాసం పేరుతో ఇతరుల హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న వీరి ధైర్యానికి మద్దతుదారులు ఎవరు?

ఎవరీ స్వతంత్ర భరద్వాజ్?

విశ్వాసం ముదిరి విద్వేషంగా మారితే ఎంత క్రూరంగా వుంటుందో స్వతంత్ర భరద్వాజ్ ఘటన చాటిచెబుతుంది. ఈయన బీహార్‌లోని పాట్నాలో జన్మించి, ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడిన వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్. పోటీ పరీక్షల కోసం ఢిల్లీకి వచ్చి అక్కడ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి భావజాలం వైపు మొగ్గి, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విద్వేష ప్రచారాన్ని చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం జులైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల ఆందోళనను అణచేసేందుకు ప్రభుత్వం పోలీసులతో పాటు, కొందరు ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించినట్లు అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి ప్రైవేటు వ్యక్తుల్లో భరద్వాజ్ ఒకడు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న ఒక అమ్మాయి తండ్రి సంజయ్ కుమార్ తలపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడు. ఈ దాడి చేసిన తీరును పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పుకున్నాడు. “నేను ఒకరి తల పగలగొట్టాను, అతనికి అనేక కుట్లు పడ్డాయి. నాకు కేంద్ర మంత్రులు, రాజకీయ దిగ్గజాల అభయహస్తం ఉంది కాబట్టే పోలీసులు నన్ను అరెస్టు చేయలేకపోయారు” అని అహంకారపూరితంగా ప్రకటించాడు. అంతేకాక భవిష్యత్తులో కర్రలతోనే కాదు, నాటు తుపాకి కూడా వాడతామంటూ చెప్పుకున్నాడు.

ఈయన చెప్పిన కర్రలు, నాటు తుపాకులు ఎవరు వాడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోజూ కర్రలతో సాధన చేసేవారు, మహాత్మా గాంధీ నుండి దభోల్కర్, గౌరీ లంకేష్ ల వరకు అనేక మందిని నాటు తుపాకులతో కాల్చి చంపిన వారంతా నేటి దేశ పాలకుల మాతృసంస్థకు చెందినవారే. 21 సంవత్సరాలు పూర్తిగా నిండని ఈ నిరుద్యోగ యువకుడు ఇంత ఉన్మాదిగా మారడానికి ఎవరు కారణం? గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల నుండి ఇతను తీవ్రమైన విద్వేషాన్ని చిమ్ముతుంటే పోలీసు నిఘా ఎందుకు గుర్తించలేకపోయింది? ఇది ఒక భరద్వాజ్ ఘటన కాదు, ఢిల్లీతో సహా అనేక చోట్ల జరిగిన మత ఘర్షణల్లో, విశ్వవిద్యాలయాలపై జరిగిన దాడుల్లో ఇలాంటి అరాచక కిరాయి ముఠాల అకృత్యాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. వీటిని అరికట్టకపోగా, ‘సంఘ సేవకులు’, ‘సామాజిక పోలీసులు’ అనే పేర్లతో పాలకులే కీర్తిస్తున్నారు.

ఈఫిల్ టవర్ వద్ద వివాదం

ఈ నెల 7న పారిస్ లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌ను మన దేశానికి చెందిన స్వామి నారాయణ సంస్థ ప్రతినిధులు సందర్శించిన సమయంలో మహిళా పర్యాటకులతో పాటు, అక్కడ పని చేస్తున్న మహిళా సిబ్బందిని లేకుండా నిషేధించారు. ఈ చర్యను నిరసిస్తూ పారిస్‌లో ప్రదర్శనలు జరిగాయి. “లింగం ఆధారంగా మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించి, కనిపించకుండా చేసి, వారి స్థానంలో పురుషులను నియమించాలన్న కార్యాలయ ఆదేశాలు” ఆమోదయోగ్యం కావని అక్కడి ఉద్యోగ సంఘం చేపట్టిన ఆందోళనకు ఆ దేశ పౌరులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. దీంతో ఈఫిల్ టవర్‌ నిర్వహణ ఏజెన్సీ అధ్యక్షుడు స్పందిస్తూ “ఈ ఘటన పూర్తిగా దిగ్భ్రాంతికరమైనది, ఆమోదయోగ్యం కానిది” అంటూ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు మహిళలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

వివాదాస్పద మత సంస్థ ‘స్వామి నారాయణ్’

స్వామి నారాయణ మత భావాలను ప్రచారం చేయడం కోసం 1905లో గుజరాత్‌లోని బోచాసన్ గ్రామంలో ఏర్పడిన ఒక మత సంస్థ ఇది. ఆ గ్రామ పేరుతో ‘బోచాసన్వాసి అక్ష‌ర పురుషోత్తమ్ స్వామినారాయణ్‌ సంస్థ’ (బి.ఎ.పి.ఎస్‌)గా పిలవబడుతున్నది. ఈ సంస్థ అనుచరులు ప్రధానంగా గుజరాత్‌కు చెందినవారు. ఈ సంస్థ ప్రకటించిన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో 1,300కి దేవాలయాలను నిర్మించి తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. తాజాగా పారిస్‌లో కూడా ఒక దేవాలయాన్ని నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ చేసిన సందేశంలో “భారత్, ఫ్రాన్స్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో ఒక కొత్త మైలురాయి”గా దీన్ని కీర్తించారు. ఆయన చెప్పినట్లు కొత్త మైలురాయి కాదు కదా తరాలనాటి లింగ వివక్ష అనే పాత మైలురాయి వద్దకు మన దేశాన్ని తీసుకువెళ్లింది. దేవాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన బి.ఎ.పి.ఎస్ కు చెందిన 100 మంది ప్రతినిధులు పారిస్‌ లోని ఈఫిల్ టవర్‌ను చూడదలుచుకుంటే చూడవచ్చు, కానీ తమ విశ్వాసాన్ని బట్టి మహిళల హక్కులను కాలరాచే హక్కు ఎవరిచ్చారు? విద్వేషంతో కూడిన లింగవివక్షను పాటించే ఈ సంస్థ ఆలయాన్ని లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధాని ఎలా ప్రారంభిస్తారు?

ఈ సంస్థతో మోడీ బంధం చాలా కాలంగా కొనసాగుతున్నది. 2016 ఆగస్టులో బి.ఎ.పి.ఎస్ ఆధ్యాత్మిక అధిపతి ప్రముఖ్ స్వామి మహారాజ్ అంత్యక్రియలకు మోడీ హాజరయ్యారు. ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వంటి ప్రముఖ గుజరాతీలూ పాల్గొని ప్రసంగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈఫిల్ టవర్ వివాదమే కాదు గతంలో ఇలాంటి అనేక వివాదాలకు ఈ సంస్థ కారణమైంది. 2021లో అమెరికాలో ఆర్‌1 వీసాలపై తీసుకెళ్లిన భారతీయ కార్మికులను తక్కువ వేతనాలు ఇచ్చి దోచుకుంటుందని న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో ఒక కేసు దాఖలైంది. ఈ వీసా కింద సాధారణంగా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే స్వచ్ఛంద సేవకులు లేదా మత విశ్వాసకులు మాత్రమే వెళ్లాలి. ఉద్దేశపూర్వకంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని తీసుకువెళ్ళి వారితో రాళ్లు కోయడం, చెక్కడం, గ్రైండింగ్, పాలిషింగ్, రాళ్లు అమర్చడం వంటి శారీరక శ్రమతో కూడిన నిర్మాణ పనులు నిర్వహించిందని ఈ కేసు నమోదయ్యింది. దేశంలో నిర్మించిన ఒక ఆలయంలోకి దళితుల ప్రవేశాన్ని నిషేధించాలని ఈ సంస్థ కోర్టుకు వెళ్ళింది.

కెనడా ఘటన

కెనడాలో భారతీయ మూలాలున్న ఒక మహిళ, ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తుల ఆహార అలవాట్లను అడ్డుకున్న ఘటన విద్వేషంలోని మరో కోణం. బీఫ్ వండటాన్ని వ్యతిరేకించడమే కాకుండా మతపరమైన కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఆమెను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. మన దేశంలో గత దశాబ్ద కాలంగా ఆహార అలవాట్లు, మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు, చివరకు దుస్తుల ఎంపిక కూడా వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఈ ఘటనను చూడాలి.

గత దశాబ్ద కాలంలో మన దేశంలో ఆహార అలవాట్లు ముఖ్యంగా గోమాంసం (బీఫ్) తిన్నారని లేదా రవాణా చేస్తున్నారనే అనుమానాలతో అనేకమంది మూక దాడికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌ లోని దాద్రి సమీపంలోని బిసారా గ్రామంలో 52 ఏళ్ళ మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి తన ఇంట్లో గోమాంసం తింటున్నాడని ఒక గుంపు కర్రలు, ఇటుకలతో దాడి చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆయన తిన్నది ఆవు మాంసం కాదని రుజువైంది, కానీ ప్రాణం మాత్రం పోయింది. రైల్లో ప్రయాణిస్తున్న హర్యానాకు చెందిన 16 ఏళ్ళ జునైద్ ఖాన్ ను బీఫ్ పేరుతో కత్తితో పొడిచి చంపేశారు.

ఇదే సంవత్సరం రాజస్థాన్ లోని అల్వార్‌లో పెహ్లూ ఖాన్‌ను, జార్ఖండ్‌ లోని రామ్‌గఢ్‌లో అలీముద్దీన్ అన్సారీ కారులో గోమాంసం తీసుకెళ్తున్నాడని కారుకు నిప్పు పెట్టి సజీవ దహనం చేసేశారు. గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న నలుగురు దళిత యువకులపై గోరక్షక బృందాలుగా చెప్పుకునే ఒక గుంపు దాడి చేసి నగ్నంగా ఊరేగించింది. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.

స్వతంత్ర భరద్వాజ్, స్వామి నారాయణ్ సంస్థ, కెనడా ఘటనలకు మూలం మను ధర్మ సిద్ధాంతంలో ఉంది. దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించే పాలకుల ప్రోత్సాహంలో ఉంది. ఇలాంటి వారి నుండి నిజమైన విశ్వాసకులు వేరుపడాలి. స్వార్థంతో విద్వేషాలు రగిల్చే ఈ శక్తులను ఒంటరి చేయాలి.

వి. రాంభూపాల్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్