ప్రస్తుతం 30 లక్షల మంది విమాన రాక పోకలు సాగిస్తున్న విశాఖపట్నం ఎయిర్ పోర్టును ఏకంగా 30 ఏళ్ల పాటు మూసివేస్తామని కేంద్ర బిజెపి-రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు జిఎంఆర్ సంస్థతో ఒప్పందం కూడా చేశాయి. జులై లోనే విశాఖపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో జిఎంఆర్ కార్పొరేట్ సంస్థ నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభంతో విశాఖ ప్రభుత్వ ఎయిర్‌పోర్టు శాశ్వితంగా మూతకు గురికాబోతున్నది. దీనినే ఉత్తరాంధ్ర అభివృద్ధికి రోల్ మోడల్‌గా కూటమి ప్రభుత్వం ప్రచారం సాగిస్తున్నది.
ఈ పరిణామాన్ని విశాఖ ప్రజలు హర్షించడం లేదు. విశాఖ ఎయిర్ పోర్టు మూసేస్తే విశాఖ నుండి భోగాపురం వెళ్లాలంటే కనీసం ప్రతి ప్రయాణికుడు కనీసం రూ.3 వేలు లోకల్ క్యాబ్ ట్రావెల్ ఖర్చు భరించాల్సి వస్తుంది. విమాన సమయానికి 4 గంటల ముందే బయలుదేరాల్సి ఉంటుంది. అంతే కాదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్యం (పిపిపి) పేర జిఎంఆర్ సంస్థ నిర్మాణం చేసింది. దీనివల్ల విమాన ప్రయాణీకులు వివిధ పేర్లతో భారీగా యూజర్ చార్జీలు చెల్లించుకోవాలి. దేశీయ ప్రయాణికుడు (డొమెస్టిక్) అయితే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యుడిఎఫ్) కింద రూ.750, విదేశీ ప్రయాణికుడు (ఇంటర్నేషనల్) అయితే రూ.1500 చెల్లించుకోవాలి. అలాగే ప్రతి ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ భద్రత, సర్వీసుల కింద మరో రూ.200 ఫీజు చెల్లించాలి. ఇవన్నీ విమాన టికెట్ ద్వారా విమాన సంస్థలు వసూలు చేసి జిఎంఆర్ కి తిరిగి చెల్లిస్తాయి. ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ప్రయాణికుల మీదే వసూలు చేస్తారు. ఎయిర్‌పోర్టు విజిటర్స్ ఎంట్రీ ఫీజు ఏకంగా రూ.200 చెల్లించాలి. ఇక కార్ పార్కింగ్ అయితే 30 నిమిషాలు లోపు రూ.150, గంట లోపు అయితే రూ.250, బైక్‌కు రూ.40 చొప్పున పార్కింగ్ ఫీజులు చెల్లించుకోవాలి. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టు ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ఆధీనంలో ఉండటం వల్ల ఈ యూజర్ చార్జీలన్నీ చాలా స్వల్పంగా ఉన్నాయి. అంతేగాక ఇవి ఎప్పటికప్పుడు నియంత్రించబడతాయి. ప్రయాణికుల మీద భారం పడకుండా యూజర్ చార్జీలను ఎయిర్ పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఎఇఆర్‌ఎ) అనే ప్రభుత్వ సంస్థ పర్యవేక్షిస్తోంది. ప్రైవేట్ ఎయిర్‌పోర్టు సంస్థలు మాత్రం ఇష్టానుసారం ప్రయాణికుల నుండి భారీగా యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. అంతేగాక ఎపుడు కావాలంటే అపుడు వీటిని పెంచుకుంటున్నాయి. ప్రైవేట్ సంస్థలు విచ్చలవిడిగా యూజర్ చార్జీల పేరుతో సాగిస్తున్న దోపిడీపై ఇటీవల పార్లమెంట్ కమిటీ, కాగ్ తీవ్రంగా తప్పు పట్టాయి. వీటిని కఠినంగా నియంత్రించాలని కోరినా మోడీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. పై పెచ్చు వీటిపై నియంత్రణలు అభివృద్ధికి ఆటంకం అంటూ ఎదురు దాడికి దిగుతున్నది.
ఇంతకీ జిఎంఆర్ భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? ప్రతి విమాన టికెట్ మీద కేవలం రూ.303 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి జిఎంఆర్ చెల్లిస్తుంది. రవాణా సరుకు మీద, ఇతర రకరకాల ఆదాయాల మీద ఒక్క రూపాయి కూడా జిఎంఆర్ చెల్లించదు. పైగా ఈ రూ. 303 కూడా ఎయిర్‌పోర్టు ప్రారంభం అయిన రోజునుండి చెల్లించదు. పదేళ్ల తరువాత అంటే 2036 నుండి మాత్రం చెల్లిస్తుంది. 60 ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టు జిఎంఆర్ గుత్త సంస్థగా కొనసాగుతుంది.
వాస్తవంగా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) సొంత నిధులతో నిర్మిస్తానని ముందుకొచ్చింది. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఎఎఐ ఎల్1గా వచ్చి టెండర్ దక్కించుకుంది. ఎయిర్ పోర్టు నుండి వచ్చే ఆదాయంలో 30.2 శాతం వాటాతో పాటు ఎయిర్ పోర్టులో 26 శాతం ఈక్విటీ హక్కు గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని టెండర్‌లో పేర్కొన్నది. అంతేగాక ఎకరానికి రూ.20 వేలు చొప్పున లీజు కింద మొత్తం భూమికి ఏడాదికి రూ.5.40 కోట్లు కూడా చెల్లిస్తామని, ప్రతి ఏడాది లీజును 6 శాతం పెంచుతామని కూడా టెండర్‌లో హామీ ఇచ్చింది. అప్పటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కార్పొరేషన్ బోర్డు ఎఎఐ టెండర్‌ని ఆమోదించింది. సాధికార కమిటీ కూడా ఎఐఐ ప్రతిపాదనలను అంగీకరించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని ఎఎఐ కి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎఎఐకి భోగాపురం ఎయిర్ పోర్టు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆఘమేఘాల మీద 2018లో క్యాబినెట్ సమావేశం జరిపి ఎల్1గా వచ్చిన ఎఎఐ టెండర్‌ను చట్ట విరుద్ధంగా రద్దుచేశారు. జిఎంఆర్ కి ఇవ్వాలనే దుర్బుద్ధితో ఈ చర్యకు చంద్రబాబు నాయుడు పాల్పడ్డారు.
రెండోసారి పిలిచిన టెండర్ల పక్రియలో కేంద్ర బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు కుట్ర పన్ని అసలు ఎఎఐని టెండర్లలో పాల్గొనకుండా పూర్తిగా నిషేధించాయి. ఎఎఐ టెండర్లలో పాల్గొంటే ప్రైవేట్ సంస్థలు పోటీలో నిలబడగలిగే స్థితిలో ఉండదు. అందుకే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టును ఎఎఐ చేపట్టినట్లయితే ఆ ప్రాంతం అభివృద్ధికి ఎంతో దోహదపడేది. వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబడి ఆ ప్రాంతంలో సేవారంగం వృద్ధి కావటానికి దోహదపడేది. అసంఘటిత రంగం, నిర్మాణ, ఆర్థిక కార్యకలాపాలు విస్తరణకు ప్రాతిపదిక ఏర్పడేది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం చేకూరేది. చుట్టుపక్కల స్థానిక సంస్థలకు కూడా ఆదాయం పెరిగేది. మౌలిక సదుపాయాల మెరుగుదలకు దారితీసేది. రైతులు త్యాగం చేసిన భూముల వల్ల కనీసం ఆ ప్రాంతానికి కొంతైనా మేలు జరిగేది. జిఎంఆర్ కి ఇవ్వటం వల్ల ఇవన్నీ కోల్పోయాయి.
నేడు భోగాపురం చుట్టూ ఉన్న గ్రామ ప్రజలను భూములు లేని గ్రామీణులుగా మార్చేశారు. భూములిచ్చిన రైతుల పరిస్థితి చూస్తే అత్యంత దయనీయంగా మారింది. నాలుగు గ్రామాల ప్రజలు భూములు కోల్పోయి ఉపాధి కోసం వలసల బారినపడ్డారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో కనీసం వీరికి ఉపాధి కల్పించలేదు. ఆర్‌ఆర్ ప్యాకేజి కింద ఇచ్చిన ఇంటి స్థలాల వద్ద కూడా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఎయిర్ పోర్టు ప్రారంభమైన తరువాత నిర్వాసితులకు అందులో ఉపాధి కల్పిస్తామని హామీ కూడా ఇవ్వలేదు. పై పెచ్చు ఎయిర్ పోర్టు రోడ్‌కు న్యాయబద్ధమైన నష్టపరిహారం చెల్లించకుండానే పేద రైతుల భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. పనులను అడ్డుకున్న రైతులను అత్యంత రాక్షసంగా బుల్డోజర్లతో దాడికి ప్రయత్నించారు.
ప్రతి రోజు రాష్ట్రానికి లక్షల కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం టముకు వేస్తున్నది. భోగాపురం ఎయిర్ పోర్టులో జిఎంఆర్ పెట్టిన పెట్టుబడులు చూస్తే కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల భాగోతం బయటపడుతోంది. ఎయిర్ పోర్టుకి మొత్తం 2203 ఎకరాల రైతుల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. రూ.4592 కోట్లు పెట్టుబడి పెడతానని జిఎంఆర్ ఒప్పందం చేసింది. కానీ రూ.100 కోట్లు కూడా జిఎంఆర్ పెట్టుబడి పెట్టలేదు. సుమారు రూ.3,214 కోట్లు ఐదు ప్రభుత్వ బ్యాంకుల నుండి కేంద్ర బిజెపి ప్రభుత్వమే జిఎంఆర్ కి రుణం ఇప్పించింది. అదిగాక మరో రూ.1000 కోట్లు ఈక్విటీ పెట్టుబడి కూడా సమీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వయబులిటీ గ్యాప్ ఫండ్ సబ్సిడీ కింద రూ. 270 కోట్లు ఇచ్చాయి. ఇదే తంతు నేడు రాష్ట్రంలోను, దేశంలోను సాగుతున్నది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, ఓర్వకల్లు (కర్నూలు) విమానాశ్రయాల గురించి చెబుతోంది. పెరుగుతున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, పర్యాటక అవసరాలు తీర్చలేకపోతున్నాయని అందువలన మరిన్ని ఎయిర్ పోర్టుల నిర్మాణం అత్యవసరంగా ఉందని ఇటీవల రాష్ట్ర విమానయాన విధానం-2026ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 28 జిల్లాలను అనుసంధానించే విధంగా నూతన ఎయిర్ పోర్టులను నిర్మించాలని, తక్షణం నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం పలాస, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలు, తాడేపల్లిగూడెం, అమరావతి, అనంతపురం కేంద్రాలుగా నూతన విమానాశ్రయాలు నిర్మాణం చేపట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు.
కార్గో లాజిస్టిక్స్, ఏరో స్పేస్ పరికరాల తయారీ, మెయింటినెన్స్ రిపేర్, ఓవర్ హాల్ సౌకర్యాలు (ఎంఆర్‌ఓ), విమాన నైపుణ్య మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ విధానంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రాంతీయ విమానాశ్రయాలతో పాటు తక్కువ ఖర్చుతో నిర్మించే నో ఫ్రిల్స్, వాటర్ ఏరోడ్రోములు, హెలీ పోర్టులు, సీ ప్లేన్ ఆపరేషన్స్ వంటి వాటి ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని విధాన పత్రంలో తెలిపారు. ఎయిర్ పోర్టులకు అనుసంధానంగా స్టార్ హోటళ్లు, ట్రేడ్ సెంటర్లు, బిజినెస్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్లు, మెగా షాపింగ్ మాల్స్, ఎత్తైన బహుళ అంతస్తుల విలాస వంతమైన భవనాలతో కూడుకున్న అధునాతన ఎయిర్ పోర్టు సిటీలు కూడా నిర్మాణం చేపట్టాలని అంటున్నారు.
ఇవన్నీ పిపిపి పద్ధతిలో ప్రైవేట్ సంస్థలు నిర్మాణం చేస్తాయి. వీటికి అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా సేకరించి ఆ సంస్థలకు సమర్పిస్తుంది. అంతేగాక ఆ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు పెట్టుబడి సబ్సిడీ 20 శాతం చొప్పున చెల్లిస్తాయి. భూ బదలాయింపు చార్జీలు ఉండవు. జిఎస్టీ పదేళ్లు మినహాయింపు. ప్రాజెక్టు ప్రారంభమైనా పదేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో ఆ ప్రాజెక్టులకు రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి సదుపాయాలన్నీ కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, ఓర్వకల్లు ఎయిర్ పోర్టులన్నీ ఆధునీకరణ, విస్తరణ పేర ప్రైవేట్ సంస్థలకు కట్టబెడతారు. ప్రస్తుత గన్నవరం ఎయిర్ పోర్ట్ విశాఖ ఎయిర్‌పోర్టు వలే మూసివేతకు గురవ్వవచ్చు. ఎందుకంటే అమరావతిలో ప్రైవేట్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇదో దోపిడీ వలయం. దేశవ్యాప్తంగా బిజెపి సాగిస్తున్న ఈ క్రోనీ దోపిడీనీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విచ్చలవిడిగా చేస్తున్నది. ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రజా వనరులను, మౌలిక సదుపాయాలను, సహజ వనరులను, రైతుల భూములను కార్పొరేట్ శక్తుల దోపిడీకి ధారాదత్తం చేస్తున్నది. లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇస్తూ రాష్ట్ర ఖజానాను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అందులో భాగమే రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిర్ పోర్టులు.
- వ్యాసకర్త: డా. బి. గంగారావు
సెల్: 9490098792








కామెంట్‌లు (0)