క్యూబాపై అమెరికా దుర్మార్గపు ఆంక్షలను ప్రపంచం మరోసారి ఛీకొట్టింది. దిగ్బంధాన్ని విధించి ప్రజల ప్రాణాలను బలిగొనే పరిస్థితులను సృష్టిస్తున్న ట్రంప్ సర్కారు వైఖరిని తెగనాడింది. ‘క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ద్రవ్యపరమైన ఆంక్షలను ముగించాల్సిన ఆవశ్యకత’పై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 193 సభ్య దేశాల్లో 130 దేశాలు ఓటు వేయడం హర్షణీయం. అమెరికా ఒత్తిళ్లతో 17 దేశాలు వ్యతిరేకించగా, 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ట్రంప్ సర్కారు ఎన్ని కుట్రలు పన్నినా వరుసగా 34వ సారి అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ప్రపంచ దేశాల వైఖరి సోషలిస్టు క్యూబాకు తిరుగులేని సంఘీభావాన్ని ప్రకటించడమే.
క్యూబాలో ఫైడెల్ కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో సోషలిస్టు విప్లవం విజయవంతమైనప్పటి నుంచి అమెరికా కంటగింపు కొనసాగుతూనే ఉంది. 1960 నుంచి క్యూబా వాణిజ్యంపై నిషేధాన్ని విధించింది. అమెరికా సంస్థల విదేశీ అనుబంధ సంస్థలు క్యూబాలో వాణిజ్యం చేయకూడదంటూ 1992 నాటి క్యూబన్ ప్రజాస్వామ్య చట్టం ఆంక్షలు పెట్టింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితా నుంచి ఒబామా, బైడెన్ ప్రభుత్వాలు తొలగించినా.. ట్రంప్ సర్కారు మళ్లీ చేర్చడం దుర్మార్గం. ప్రపంచానికి వైద్యం అందిస్తూ... కోవిడ్ సహా మహమ్మారుల సమయంలో అండగా నిలుస్తున్న క్యూబాను ఆ జాబితాలో పెట్టడం ట్రంప్ అహంకారానికి నిదర్శనం.
అమెరికా కుట్రలను తట్టుకుంటూ ‘చమురు బదులు సేవలు’ ఒప్పందంలో భాగంగా వెనిజులా నుంచి క్యూబా ఇంధనాన్ని పొందుతోంది. వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులను అర్ధరాత్రి అమానుషంగా కిడ్నాప్ చేసి, అక్కడి యంత్రాంగాన్ని నియంత్రణలోకి తీసుకోవడంతో క్యూబాకు చమురు నిలిచిపోయింది. మెక్సికో ఆపన్నహస్తం అందించినా... అమెరికా ఒత్తిళ్తు తీవ్రం కావడంతో విరమించుకోవాల్సి వచ్చింది. క్యూబాకు చమురు విక్రయించే లేదా సరఫరా చేసే ఏ దేశం నుంచైనా వచ్చే వస్తువులపై అదనపు సుంకాలను విధించడానికి అధికారం కల్పించిన ఉత్తర్వుతో పాటు, క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై వివాదాస్పద ఆరోపణలతో అభియోగాలు మోపింది. అక్కడికి వెళ్లే నౌకలను 180 రోజుల వరకూ అనుమతించబోమని ప్రకటించింది. బ్యాంకులు క్యూబా చెల్లింపులను తిరస్కరిస్తున్నాయి. ఆ ద్వీపానికి వెళ్లే ట్యాంకర్లు, ఓడలను అమెరికా కోస్ట్ గార్డ్ అడ్డగిస్తోంది. వీటన్నింటినీ ఎదుర్కొని రష్యా అడపాదడపా నౌకలను పంపిస్తున్నా... క్యూబా అవసరాలు తీరడం లేదు. ప్రతిరోజూ 12 గంటల నుంచి 20 గంటల వరకూ విద్యుత్ కోతలు సాధారణమయ్యాయి. అత్యవసర మందులు, వైద్య పరికరాలు, యంత్రాలు రాకపోవడం, విద్యుత్ కొరతలతో ఐరాస నిపుణుల అంచనా ప్రకారమే లక్ష మంది వరకూ శస్తచికిత్సలు నిలిచిపోయాయి. వారిలో 11 వేల మంది చిన్నారులే.
"ఇంధన కొరత", ఆ ద్వీప దేశంపై "చట్టవిరుద్ధమైన దిగ్బంధనం" అని, దానిని ఖండించాలన్న స్వతంత్ర మానవ హక్కుల నిపుణుల పిలుపును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం నివేదించింది. క్యూబాను స్వాధీనం చేసుకుంటానని బెదిరించడం ట్రంప్ దురహంకారానికి నిదర్శనం. ఒక దేశం రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా "బలప్రయోగం లేదా బలప్రయోగ బెదిరింపు"ను నిషేధించే ఐక్యరాజ్యసమితి చార్టరు ప్రకారం ఇటువంటి బెదిరింపు చట్టవిరుద్ధం. రవాణా, ఆహార పంపిణీ, ఆరోగ్య సంరక్షణ, నీటి వ్యవస్థ, కమ్యూనికేషన్లకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నా సోషలిస్టు వ్యవస్థకే కట్టుబడి ఉంటామన్న క్యూబన్లకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన అవసరముంది. సిపిఎం, అనేక ప్రజాసంఘాలు దేశవ్యాప్తంగా విరాళాలు, మందులు సేకరించి క్యూబాకు పంపడం, ఆంక్షలను ఎదుర్కొని రష్యా చమురును పంపడం కొంత ఉపశమనం. భారత ప్రభుత్వం, ప్రజలు దశాబ్దాలుగా క్యూబాతో స్నేహం సంఘీభావం నెరపుతున్నాయి. అలీనోద్యమం ఉచ్ఛ స్థాయిలో వున్న సమయంలో అది మరింత సమున్నతంగా వెలుగొందింది. అయితే, మోడీ సర్కారు ఏర్పడ్డాక ఆ వైఖరి నుంచి భారత ప్రభుత్వం కొంత దూరం జరుగుతూ వచ్చింది. అయితే, తాజాగా ఐరాస జనరల్ అసెంబ్లీలో మద్దతు పలకడం కొంత మెరుగు. కేవలం ఐరాస తీర్మానంలో క్యూబాకు మద్దతు తెలిపితే చాలదు. అమెరికా దాష్టీకాలకు కూడా కేంద్రంలోని బిజెపి సర్కారు వ్యతిరేకంగా నిలిచేలా భారత ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. అటువంటి విశాల సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమ నిర్మాణం సాగాలి. తన సార్వభౌమాధికారం, రాజకీయ వైఖరి విషయంలో దృఢంగా నిలబడిన క్యూబాకు గ్రూప్ 77, అలీన దేశాలు అనుకూలంగా ఓటు వేయడం అభినందనీయం. అమెరికా ఏకపక్ష దాష్టీకాలను వ్యతిరేకించడం, చిన్న దేశాల, గ్లోబల్ సౌత్‌లోని దేశాల గొంతును బలోపేతం చేయడం అత్యవసరం.







కామెంట్లు (0)