రాజు భయపడినప్పుడే కోటను బలోపేతం చేసుకుంటాడంటారు. దేశ రాజధాని ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. సుమారు లక్ష మంది భద్రతా సిబ్బంది, జంతర్‌మంతర్ చుట్టూ కంచెలు, వీధివీధినా నిఘా, సామాజిక మాధ్యమాలపై డేగకన్ను, విద్యార్థుల కోసం పోలీసుల తనిఖీలు, హోటళ్లపై ఆంక్షలు, ఇంటర్నెట్ నిలిపివేత, విమానాల్లో ఢిల్లీ చేరుకునే వారి జాబితా... ఇదంతా శాంతిభద్రతల కోసమేనా, లేక ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికా? ఇదే నేడు భారతావని అడుగుతున్న ప్రశ్న. నాటి బ్రిటిషోడిని తలపించేలా భద్రతా వలయం ఉందనేది ప్రజాస్వామ్యవాదుల మాట. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం తన పౌరుల నిరసనకు భయపడకూడదు. నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కన్న సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు కేంద్ర పాలకులకు చెంపపెట్టులాంటివి.
అవే డిమాండ్లతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి)తో పాటు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు నేడు జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చాయి. దీనికి ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే విస్మయం కలుగుతుంది. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి సుమారు 70 సిఆర్‌పిఎఫ్ కంపెనీలను, అంటే దాదాపు 7 వేల మందిని ఢిల్లీకి తరలించారు. హోంమంత్రి తన పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఢిల్లీకి వచ్చే పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మెట్రో స్టేషన్లు మూసేయాలంటూ ఆదేశించారు. ఒక శాంతియుత నిరసననను అణచి వేయడానికి ఇంతటి సన్నాహాలు ఎందుకు? శుక్రవారం ఢిల్లీ పోలీసులు సిజెపి నిరసనకు అనుమతి నిరాకరించారు. దరఖాస్తు బుధవారం అందిందని, జంతర్‌మంతర్ వద్ద నిరసనకు కనీసం 10 రోజుల ముందు అనుమతి కోరాలంటూ చెప్పడం విడ్డూరం. జులై 26 నుంచీ ఆ ప్రాంతాన్ని మూసివేసి, భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఊరేగింపులు, ధర్నాలను నిషేధించినప్పుడు, పది రోజుల ముందు దరఖాస్తు చేసినా అనుమతి వచ్చేదా? రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును నిషేధాజ్ఞలతో నిరవధికంగా అడ్డుకోవడం న్యాయసమ్మతం కాదు. జులై 20 నాటి నిరసనలో పెల్లెట్ గన్‌లు వాడారన్న ఆరోపణలు దేశాన్ని కలచివేశాయి. ప్రజాగ్రహానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఆ ఘటనపై స్వతంత్ర విచారణ జరిగినట్లు ఇప్పటివరకు కనిపించదు. గాయాన్ని మాన్పకుండా, మళ్లీ అదే వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్లడం ప్రమాదకరం.
నిరసనలు అణిచేయడానికి వేలాది మందిని నిర్బంధించారు, అర్ధరాత్రి ఇళ్లలోకి పోలీసులు చొరబడి, చిన్న పిల్లల ముందు కుటుంబాలను వేధించారు, రైళ్ల నుంచి దించేసి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసేటప్పుడు కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. పోలీసులు దాన్ని పాటిస్తున్నారా? కారణం చెప్పకుండా విద్యార్థులను తీసుకెళ్లడం, న్యాయవాదిని కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం తగదు. అలాగే సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా వందల మంది నిరసనకారులు, స్వతంత్ర జర్నలిస్టులపై నిఘా పెట్టడం భావప్రకటనా స్వేచ్ఛకు చేటు. నేరాలకు పాల్పడేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణ అంటే నిరసనలను అడ్డుకోవడం కాదు, వారిని బెదిరించే వారిని అదుపు చేయడం. ఉద్యమకారులు శాంతియుతంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేసినా 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఏర్పడిన అపనమ్మకానికి ఎన్నికల సంఘం జవాబుదారిగా వ్యవహరించాలి. అలాగే, ఓటర్ల జాబితాల విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చినప్పుడు, వాటికి సమాధానం చెప్పాల్సింది కూడా ఎన్నికల సంఘమే. నిరసనను పోలీసు బలంతో అణచడం ఆ నమ్మకాన్ని పెంచకపోగా తగ్గిస్తుంది. అలాగే ‘‘తప్పుడు సమాచారం’’ పేరుతో సామాజిక మాధ్యమ సంస్థలపై ఒత్తిడి తేవడం ప్రజావ్వామ్య స్ఫూర్తీ అనిపించుకోదు. ఉద్యమం ఇప్పటికే దేశమంతటా సాగుతోంది. ముంబైలో జరిగిన భారీ నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు ఎస్‌ఐఆర్ బాధితులు ప్రజా ట్రిబ్యునల్ ముందు తమ గోడు వినిపించారు. ఇలాంటి ఉద్యమాలు ఎంత అదిమితే అంతగా రాజుకుంటాయన్నది ప్రపంచం నేర్చిన పాఠం. ప్రభుత్వం చేయాల్సింది స్పష్టం. నిరసనకు శాంతియుత వేదిక కల్పించాలి, అక్రమ నిర్బంధాలను ఆపాలి, సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను సాగనంపాలి.
బలగాలు కోటను కాపాడతాయేమో గాని, ప్రజా విశ్వాసాన్ని నిర్మించలేవు. రైళ్లను ఆపినా, నగరాన్ని నిర్బంధించినా, యువతను బంధించినా వారు లేవనెత్తిన ప్రశ్నల జవాబుల కోసం పోరాడుతూనే ఉంటారు. కేంద్ర పాలకుల నిరంకుశ చర్యలను తిప్పికొడతారు. అప్రజాస్వామిక ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ‘ఇండియా’ వేదిక పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తున్నాయి. 10వ తేదీన రాష్ట్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి.







కామెంట్‌లు (0)