హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ
స్థానిక ఎన్నికల చర్చతో వాటి జోలికి వెళ్లని ప్రభుత్వం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : స్థానిక ఎన్నికల అంశంపై తెరపైకి రావడంతో కొత్త పింఛన్ల మంజూరు వెనక్కి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు జరుగుతాయన్న చర్చ నేపథ్యంలో ఇప్పుడు కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపడితే ఎన్నికల్లో లబ్ధి కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న బేరీజుతో ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చర్చ నడుస్తోంది. కొత్త పింఛన్లను నవంబర్ నెల నుంచి ఇస్తామని ప్రభుత్వం దరఖాస్తుల సమయంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే స్క్రూట్నీ చేసి అర్హులైన వారికి నవంబరు నుంచి పింఛన్లు అందించే ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నా కనీసం వాటిపై కదలిక గానీ ప్రభుత్వం నుంచి ప్రకటన గానీ రాలేదు. ప్రతి నెల పింఛన్ల అందజేతలో భాగంగా ఈనెల ఒకటో తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నా కొత్త పింఛన్ల మంజూరుపై కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు రెండు లక్షల మంది వరకు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అదనంగా ఉంటే మరో లక్ష మంది వరకు పింఛన్ల అందజేతకు ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో సుమారు ఐదేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు లేకపోవడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 13.40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం గరిష్టంగా మూడు లక్షల మందికి ఇవ్వాలనుకుంది. ఇవి కనీసం 20 శాతం మందికి కూడా సరిపోని పరిస్థితి నెలకొంది.
కొందరికి పింఛన్లు ఇచ్చి, కొందరికి తర్వాత విడతలో ఇస్తామని చెప్తే లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి వస్తుంది. పాత పింఛన్ల జోలికి వెళ్లకుండా కొత్త పింఛన్ల మంజూరు విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ మార్గదర్శకాలను వెలువరించింది. ఇంటి పన్ను రశీదు, కరెంట్ బిల్లు తదితర నిబంధనలతో పాటు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా కొత్త పింఛన్లు మంజూరు చేయాలంటూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. నిబంధనల పేరుతో పింఛన్లు రాని వారంతా ప్రభుత్వంపై స్థానిక ఎన్నికల్లో తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కే అవకాశం ఉందనే అంచనా వేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వాటిపై ముందుకు వెళ్లకుండా ఉండటం మంచిదన్న భావనతో వాటిని హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. ఎన్నికల తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేస్తామంటూ ప్రచార అంశంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని అంచనాలకు వచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పింఛన్లు ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియదు కనుక అంతా తమకు ఓట్లు వేస్తారని ప్రభుత్వం ఎత్తుగడగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కొత్త పింఛన్లపై ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందన్న చర్చ నడుస్తోంది.








కామెంట్‌లు (0)