స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన రీతిలో ఎన్నికలను నిర్వహించేందుకు బాధ్యత వహించవలసిన స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ-భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) ఈ రోజు దిగంబర చక్రవర్తిలా దొరికిపోయింది. ఇదేదో ఓటర్ల జాబితాలను సరిదిద్దడానికి ఉద్దేశించిన వ్యవహారం కాదని 2025 జూన్ 24న బీహార్‌లో 'ప్రత్యేక సమగ్ర సవరణ' (సర్) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టంగా తెలుస్తూనే వుంది. ఇ.సి.ఐ చెప్పుకున్నట్టు ఇది గతంలో ఎన్నడూ జరిగింది కాదు. గతంలో లేదన్నది అటుంచి ఇప్పుడు దాన్ని చేపట్టడానికి అవసరమైన ఎటువంటి అధికారపూర్వక నిర్ణయమూ జరిగింది లేదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టడానికి ముందు శ్రద్ధాశక్తులతో లోతైన పరిశీలనా జరిగింది లేదు. ఎన్నికల చట్టాలు, ఇందులోని నిబంధనలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన అంశాలు కూడా ఈ ప్రక్రియను బలపర్చేవిగా లేవు. రాజ్యాంగబద్ధంగా పౌరులకుండే ఓటు హక్కును సామూహికంగా తొలగించడానికే ఇది ఉద్దేశించబడింది. అయితే, ఈ తొలగింపు ప్రక్రియ ఏదో ఏకపక్షంగా జరగలేదని, పిచ్చిలోనూ ఒక పద్ధతి అన్నట్టు దీని వెనుక ఒక పకడ్బందీ పన్నాగం ఉందని కూడా స్పష్టమవుతూనే వచ్చింది.
వారి వారి సామాజిక-ఆర్థిక అస్తిత్వ నేపథ్యాలను బట్టి బిజెపి కి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చనుకున్న ఓటర్లను జాబితాలో లేకుండా చేయడమే దీని వెనుక ఉన్న ఖచ్చితమైన పథకం. ప్రజల హక్కులను దెబ్బ తీయడానికి బాగా అనుకూలమైన దండాయుధం, తుడిచిపెట్టే సాధనం చట్టబద్ధమైన పౌరసత్వం అనే అంశమేనని బీహార్ అనుభవంతోనే స్పష్టమైంది.
ఈ అంశమే మొత్తం ప్రక్రియను పెద్ద ఆయుధంగా మార్చింది. విదేశీయత చట్టం నిబంధనల ప్రకారం మరో విధంగా నిరూపితమైతే తప్ప ప్రతి ఒక్కరినీ పౌరులుగానే పరిగణించి సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించ డానికి ఉద్దేశించబడిన రాజ్యాంగంలోని 326 అధికరణాన్నే ఈ ప్రక్రియ కోసం నియోగిండం అత్యంత దుర్మార్గం.
పౌరసత్వంపై వక్రమార్గం
పౌరసత్వ సమస్యను దొడ్డిదారిలో తెరపైకి తీసుకురావడానికి ఉపయోగించిన ఒక తప్పుడు సాకుగా మాత్రమే 326వ అధికరణం పరోక్షంగా ప్రస్తావించబడింది. అత్యంత భారీ ఎత్తున చేపట్టిన ఈ ప్రక్రియను సమర్థించుకునేందుకుగాను ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో 'విదేశీయులు' ఉన్నారని బిగ్గరగా ప్రకటనలు వెలువడ్డాయి. అయితే నాలుగు రాష్ట్రాలు మినహా దేశమంతటా దీన్ని అమలు చేసి, 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించినప్పటికీ అలా గుర్తించబడిన 'విదేశీయుల' సంఖ్యకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన గణాంకాలను ఎన్నికల సంఘం వెల్లడించలేకపోయింది.
షా..జ్ఞానేశా..కుట్ర
'శోధించు, తొలగించు, తరలించు' అనేది హోం మంత్రి అమిత్ షా యొక్క అసలు సిసలు పథకమనేది బహిరంగ రహస్యమే. ఎన్నికల సంఘం, మరీ ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి.ఇ.సి) జ్ఞానేష్ కుమార్ ఆ పథకాన్నే అమలు చేశారు. షా ప్రేరణతో జ్ఞానేష్ కుమార్ అమలు చేసిన 'చొరబాటుదారుల' కట్టుకథకు భారీ సంఖ్యలో ఓటర్ల తొలగింపు ఉండటమే అతి పెద్ద సవాలుగా తయారైంది.
‘సర్’ అమలుకు ముందున్న ఓటర్లు దాదాపు 13.5 కోట్ల పేర్లు ఈ ప్రక్రియలో తొలగించడమంటే మొత్తం ఓటర్లలో సుమారు 15 శాతాన్ని లేకుండా చేయడమన్నమాట.
ఏడాదిన్నరగా తప్పులే
జనాభా-ఓటర్ల నిష్పత్తిని రాష్ట్రాల వారీగా చూసినా, మొత్తం మీద చూసినా ఈ ప్రక్రియ భారీ స్థాయిలో ప్రజల ఓటు హక్కు తొలగించేసిందనే ఒకే ఒక నిర్ధారణకు రావడం అనివార్యమవుతుంది.
సమస్య అక్కడితోనే ఆగలేదు. గత ఏడాదిన్నర కాలం లోనూ ఎన్నికల సంఘం, పద్ధతులనూ చట్టాలను ఇష్టాను సారం తోసిరాజంటూ తన నిజ స్వరూపం తనే బయటపెట్టు కుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 27 లక్షల మంది ఓటు హక్కును అనిశ్చిత పరిస్థితిలో వుంచాల్సి రావడం దీనికి పరాకాష్టగా చూడొచ్చు.
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాటైన న్యాయ ట్రిబ్యునళ్లు, అపరిష్కృతంగా ఉన్న కేసులన్నింటినీ తేల్చడానికి 12 నుండి 25 ఏళ్లు పడుతుందని నిర్ధారణకు వచ్చాయి. వున్నంతలో పరిశీలించిన, తేల్చిన అతి కొద్ది కేసుల వరకైతే 93 శాతం పేర్లు తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చబడ్డాయి.
అత్యున్నత న్యాయస్థానంలో ఎన్నికల సంఘం స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్ తో దాని నేరపూరిత నిర్వాకాలు ఇప్పుడు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. ఓటు హక్కు పునరుద్ధరణ కోసం ట్రిబ్యునళ్లను ఆశ్రయించిన 22 లక్షల మందితో పాటు-న్యాయాధికారులు ఆమోదం తెల్పిన 33 లక్షల మందిలో 16 లక్షల మందిని అదనంగా ఈ ట్రిబ్యునళ్లకు పంపారు. వ్యక్తిగత అభ్యంతరాల కోసం ఉద్దేశించిన ‘ఫారం 7’ ఉపయోగించి వారికి ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్య జరిగింది. ఈ దరఖాస్తులలో పెద్ద భాగం ఎన్నికల సంఘ అధికారులే స్వయంగా పురికొల్పారని ట్రిబ్యునల్ ముఖ్యాధికారులలో ఒకరైన, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు.
బిజెపి కుమ్మక్కుతో..సుప్రీం పాత్ర
బిజెపి కుమ్మక్కుతోనే ఈ తప్పుడు పనులన్నీ సాగాయనడంలో ఎలాంటి సందేహానికి ఆస్కారమే లేదు. ఏ దశలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సరే వెంటనే రంగంలోకి దూకి ఇ.సి.ఐ ని సమర్థించేందుకు పాల్పడింది. కానీ, చాలా తీవ్రమైన రాజకీయ వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ‘సర్’ సవాలు ముప్పును ఇంకా పూర్తిగా అంచనా వేయలేకపోవడానికి దాంతో ముడిపడిన రాజ్యాంగ, శాసనపరమైన సంక్లిష్టతలే కారణమవుతున్నాయి. ఒకవైపు, ముఖ్యంగా పౌరులు, బలహీన వర్గాలు ఎంతో అభద్రతతో అల్లాడుతున్నప్పటికీ మొత్తం మీద తాడోపేడో తేల్చుకుందాం అనేదాకా రాలేదు.
అరకొరగా అర్థమనస్కంగా న్యాయపరమైన జోక్యాలు చేసుకున్నా అదేమీ పరిస్థితిని మెరుగు పరచడానికి దోహదం చేయలేదు. దీనికి అవసరమైనంత తక్షణ ప్రాధాన్యత సుప్రీం కోర్టు ప్రదర్శించలేదు. తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించడంలో ఇ.సి.ఐ స్వాతంత్ర్యానికి హామీ కల్పించడం పైనే సుప్రీంకోర్టు అమితాందోళన ప్రదర్శించింది. అయితే ఇ.సి.ఐ పదేపదే అసత్యాలతో తన వక్ర కథనాలే వినిపిస్తుందన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు చూడలేకపోయింది. ఇ.సి.ఐ అంతర్గత నిర్వహణలో చట్టబద్ధమైన నిబంధనలు పచ్చిగా ఉల్లంఘించబడుతున్నాయనేది న్యాయ వ్యవస్థ దృష్టి నుంచి, ప్రజల దృష్టి నుండి కూడా కప్పిపెట్టబడింది.
ఎక్స్‌ప్రెస్ సంచలనం
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక బయటపెట్టిన సంచలనాత్మక పరిశోధన ఈ మొత్తం పరిస్థితిని సమూలంగా మార్చేసింది. మొత్తం ‘సర్’ కసరత్తు మరీ ముఖ్యంగా ‘ఫారం 6’ రూపకల్పన, చట్టబద్దమైన నిబంధనలను తోసిపుచ్చి తర్వాత దాంట్లో మార్పులు చేయడం, 'ఫారం 7' తో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు పాల్పడటానికి అవకాశం కల్పించడం, సాఫ్ట్‌వేర్, డిజైన్ ఆధారిత ఇ.సి.ఐ నెట్‌వర్క్ వ్యవస్థతో ఎన్నికల నమోదు అధికారుల (ఇ.ఆర్.వో) చట్టబద్ధమైన అధికారాలను దెబ్బ తీయడం వంటి అంశాలన్నీ ఆ పరిశోధనాత్మక కథనంతో ప్రజలకు స్పష్టంగా తెలియవచ్చాయి. దీనికి బాధ్యుడైన అధికారి నియామకం, పర్యవేక్షణ మొత్తం కమిషన్‌కు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి లేకుండా చేయబడింది.
అయితే అంతకంటే ముఖ్యంగా త్రిసభ్య సంఘం తీవ్ర విభేదాల కొంపగా తయారైందని కూడా బయటపడింది. చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానో లేక మెజారిటీ ఆమోదంతోనో తీసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇద్దరు కమిషనర్లు ఫైళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఏకపక్షంగా అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంతో వాటికవే చెల్లనివిగా తయారయ్యాయి.
జ్ఞానేష్ కుమార్ చెబుతున్నట్టు 'ఫారం 6'లో మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం లభించలేదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మౌఖికంగా పేర్కొంది. కనుక తదుపరి విచారణ సందర్భంగా, రాజ్యాంగ పరిధిలోనే ‘సర్’ ప్రక్రియను నిలిపివేసే అవకాశం అత్యున్నత న్యాయస్థానానికి లభించింది. ఇది తప్పక జరగాల్సిందే. లేకపోతే 15 శాతం జనాభా తమ రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. జ్ఞానేష్ కుమార్ ఎంతటి వివాదాస్పద వ్యక్తిగా మారారంటే ఇసుమంతైనా నిష్పాక్షికత, విశ్వసనీయత ఆయన నుంచి ఆశించలేము. ఆయన కమిషన్ సారథ్యం వహిస్తుండగా పారదర్శకమైన, న్యాయమైన స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ జరగడం ఆశించలేము. నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన రుజువైతే ఇక కమిషన్ ఎప్పట్లా యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగించడం జరిగే పని కానే కాదు.
ఉద్యమ ఉధృతి
ఇదే సమయంలో, 'ఓట్ల చోరీ' ఆరోపణలు పరాకాష్టకు చేరాయి. యావత్ ప్రతిపక్ష ఎంపీలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడంలో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న 'జెన్-జీ' ఓటు హక్కును, ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో భాగస్వాములయ్యారు. ఢిల్లీ, ముంబై పరిణామాలను బట్టి చూస్తే ‘ఇండియా’ వేదిక క్రియాశీల పాత్ర తీసుకోవడం వల్ల ఈ ఉద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. అమిత్ షా ఆదేశాలపై పని చేసే ఢిల్లీ పోలీసులు నిరసనలను అత్యంత అమానుషంగా, నీచమైన రీతిలో వికృతంగా దమనకాండకు గురిచేయడం, మరీ ముఖ్యంగా మహిళా నిరసనకారులతో వ్యవహరిస్తున్న తీరు అగ్నికి ఆజ్యం పోస్తోంది.
ఇప్పుడు పరిస్థితి ఒక కీలకమైన సంధి దశకు చేరింది. ఘర్షణ పెరగకుండా నివారించాలా లేదా అనేది ప్రభుత్వం చేతుల్లోనే వుంది. లేకపోతే పరిస్థితి అరాచకంలోకి జారిపోతుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ప్రధానంగా వాదనాపరులైన వంద కోట్ల భారతీయులను నోరూ వాయీ లేని నిర్జీవ ప్రతిమలుగా మార్చడం కుదిరే పని కాదు. అంధ విశ్వాసంపై హేతుశీలత గెలవాలి. ఇదేదో అల్లాటప్పా అరటిపండు దేశం కాదు (బనానా రిపబ్లిక్). స్వాతంత్ర్య పోరాట వారసత్వం, రాజ్యాంగ సూత్రాలు మన ముందు ప్రజ్వలిస్తున్నాయి.
/'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం, అక్టోబర్ 7)







కామెంట్‌లు (0)