శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశమంతటా జంతర్‌మంతర్లు పుట్టుకొస్తాయ్!

1 గంట క్రితం

దేశమంతటా జంతర్‌మంతర్లు  పుట్టుకొస్తాయ్!
- జ్ఞానేశ్ కుమార్‌ను ఎంతోకాలం కాపాడలేరు
- ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు మోడీ సర్కారు ఎంతకైనా తెగిస్తుంది
- అరెస్టులకు వెనక్కి తగ్గం
- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
- ఆందోళ‌న‌ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచేందుకు కుట్ర‌:  ఐషీ ఘోష్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జ్ఞానేశ్ కుమార్‌ను ఎంతోకాలం కాపాడలేరు

  • ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు మోడీ సర్కారు ఎంతకైనా తెగిస్తుంది

  • అరెస్టులకు వెనక్కి తగ్గం

  • సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

  • ఆందోళ‌న‌ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచేందుకు కుట్ర‌: ఐషీ ఘోష్‌

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజాస్వామ్య నిరసనలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జంతర్‌మంతర్‌ను మూసివేస్తే దేశవ్యాప్తంగా వందలాది జంతర్‌మంతర్లు పుట్టుకొస్తాయ‌ని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ హెచ్చరించారు. ఆందోళ‌న‌ల‌ను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో వేల సంఖ్యలో కేంద్ర బలగాలు, పోలీసులను మోహరించారని తెలిపారు. నేడు జంతర్‌మంతర్‌లో జరిగే ఆందోళనలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులంతా పాల్గొంటారాన్నారు. శుక్రవారం నాడిక్క‌డ హ‌రికిష‌న్ సింగ్ సుర్జీత్‌ భవన్‌లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఎం ఎ బేబీ మీడియాతో మాట్లాడారు. అరెస్టు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నాయకులను అరెస్టు చేసినా వందలాది మంది ముందుకొస్తారన్నారు. నిరసనలను అణచివేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ను ఎంతో కాలం మోడీ, అమిత్ షాలు కాపాడలేరని హెచ్చరించారు.

​హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాం

ఢిల్లీలో సామాన్య ప్రజల రాక‌పోక‌ల‌ను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా, నిర‌స‌న తెలిపే హ‌క్కు కోస‌మే సిపిఎం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని బేబీ తెలిపారు. పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పాక్షిక ఉపశమనం కల్పించిందన్నారు. అప్రజాస్వామ్యం గా నిరసనలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే, కఠిన ఆంక్షలు, నిషేధాలు విధించి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు ఈ చర్యలని విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు కోసం సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

​నేటి ఆందోళనలో పాల్గోనున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు..

నేడు జంతర్‌మంతర్‌లో జరిగే ఆందోళనలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులందరూ పాల్గొంటారని బేబీ తెలిపారు.

-ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికే సిపిఎం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కేంద్ర కమిటీ సమావేశం కొనసాగుతుందని, మరుసటి రోజున సభ్యులంతా నిరసనలో పాల్గొంటారన్నారు. సమకాలీన రాజకీయ పరిణామాలు, జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన తదుపరి ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.

​ఆంక్షలతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు: ఐషీ ఘోష్‌

మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను పెద్దఎత్తున నిర్బంధిస్తున్నారని విమర్శించారు. కార్యాలయాల్లోకి పోలీసులు చొరబడ్డారని, రైళ్లను భారీగా రద్దు చేశారని, మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఢిల్లీకి వచ్చే ప్రయాణికుల వివరాలను విమానాశ్రయాల్లో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వస్తున్న పలువురు విద్యార్థులను మార్గమధ్యంలోనే నిర్బంధించారని తెలిపారు. ఢిల్లీ పోలీసులు తమకు పదేపదే ఫోన్‌ చేసి వేధిస్తున్నారన్నారు. విద్యార్థి సంఘాలు నిర్వహించే నిరసనలు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవని, పోలీసుల ఆంక్షలవల్లే సమస్య అని ఐషీఘోష్‌ పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్