శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపత్తి రైతుకు ఎల్‌నినో దెబ్బ..

2 గంటల క్రితం

​​పత్తి రైతుకు ఎల్‌నినో దెబ్బ
- వర్షాభావంతో ఎదగని పంట
- పెట్టుబడి కూడా రాని పరిస్థితి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 05:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వర్షాభావంతో ఎదగని పంట

  • పెట్టుబడి కూడా రాని పరిస్థితి

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : తెల్లబంగారంపై ఆశలు పెట్టుకున్న రైతుకు ఈ ఏడాది ఎల్‌నినో దెబ్బ నిరాశను మిగిల్చింది. తొలకరి వర్షాలను నమ్ముకుని పత్తి విత్తనాలు వేసిన రైతులకు ఆ తర్వాత సరైన వర్షాలు కురవకపోవడంతో పంట ఎదుగుదల మందగించింది. మొక్కలు గిడసబారడం, కాయలు తగ్గడం, పూత రాలిపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలో పత్తి ప్రధాన వర్షాధార పంట. ఖరీఫ్‌లో సాధారణంగా 5.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా ఈ ఏడాది 5.48 లక్షల ఎకరాల్లో వేశారు. విత్తిన సమయంలో వర్షం పడినా ఆ తర్వాత కీలకమైన దశల్లో తేమ అందకపోవడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడంతో పూత నిలవకపోవడం, కాయల సంఖ్య తగ్గడం, వచ్చిన కాయలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సెప్టెంబరు 12 నాటికి జిల్లాలో 2,69,975 ఎకరాల పంటలు తేమ ఒత్తిడికి గురైనట్లు అధికారులు గుర్తించారు.

భారీగా తగ్గనున్న దిగుబడి...

పత్తి సాగులో విత్తనాలు, దుక్కులు, ఎరువులు, కలుపు నివారణ, పురుగుమందులు, ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ.30 వేలకుపైగా ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. గత ఖరీఫ్‌లో అనేక ప్రాంతాల్లో సగటు దిగుబడి ఆరు క్వింటాళ్లు. ఈ ఏడాది ప్రారంభం నుంచే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడి మరింత తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. వర్షాభావంతో దెబ్బతిన్న పత్తి పంటను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.

కౌలురైతుపై రెట్టింపు భారం...

భూమి సొంతం కాకపోవడంతో ఎకరాకు వేలాది రూపాయలు కౌలు చెల్లించి సాగు ప్రారంభించిన కౌలు రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కూడా భరించాల్సి వస్తోంది. ఈ ఏడాది వర్షాభావంతో కౌలు, పెట్టుబడి రెండూ రాబట్టుకోవడం కష్టంగా మారింది. పంట చేతికందకపోతే కౌలు చెల్లించేందుకు మరో అప్పు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధిపైనా ప్రభావం...

ఆదోని మార్కెట్‌ యార్డుకు గతేడాది ఆరు లక్ష‍ల పత్తి బేళ్లు వచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం మూడు లక్ష‍ల బేళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పత్తి దిగుబడులు రాకపోవడంతో ఆదోని మార్కెట్‌ బోసిపోయింది. అవసరమైన బేళ్లు రాకపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో వ్యవసాయ కార్మికులకు ఉపాధి కూడా తగ్గనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్