శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడిజిటల్‌ విలవిల..

35 నిమిషాల క్రితం

Technical disruptions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:52 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఒక చిన్న సాంకేతికలోపం లేదా సైబర్‌ దాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రణాళికలను తలకిందులు చేసే ముప్పు ఉండటం ఆందోళనకరం. ఐదు రోజుల వ్యవధిలో ప్రజలు సర్వసాధారణంగా భావించే సేవల నుంచి అమెరికా సహా వివిధ దేశాల ప్రభుత్వాలు అత్యంత రహస్యంగా భావించే నెట్‌వర్క్‌ల వరకూ ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలడం డిజిటల్‌ వ్యవస్థల కేంద్రీకరణ, కార్పొరేట్‌ గుత్తాధిపత్యం, ప్రత్యామ్నాయ వ్యవస్థలు లేకపోతే తలెత్తే ఉపద్రవాలను ముందుకు తెచ్చాయి. అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌, అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఎఎ), జెపి మోర్గాన్‌ చాజ్‌, ఆపిల్‌, ఎన్‌ఎస్‌ఎ, మారియట్‌ సహా తొమ్మిది సంస్థల్లో సాంకేతిక అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ 365కి అంతరాయం కలగడంతో అవుట్‌లుక్‌ ఇ - మెయిల్స్‌, టీమ్స్‌, షేర్‌ పాయింట్‌, కో పైలట్‌ వంటి సేవలన్నీ ప్రభావితమై 75 దేశాల్లో 45 కోట్లకుపైగా పెయిడ్‌ సబ్‌స్కైబర్లు ప్రభావితమయ్యారు. వివిధ సంస్థలతోపాటు మనదేశం, రాష్ట్రం సహా వివిధ దేశాల్లోని అనేక విభాగాలు పెయిడ్‌ సబ్‌స్కైబర్లుగా ఉండటంతో ఉద్యోగులు, ప్రజానీకం బాధితులుగా మారడం విషాదం. ఇమెయిల్‌, ఫైల్‌ షేరింగ్‌, ఎఐ సాధనాల వినియోగం సహా కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యాపారాలు సహా పలు సేవలు కుప్పకూలాయి.

ప్రపంచంలోనే అత్యంత సురక్ష‍ితంగా చెప్పబడే ఆపిల్‌ సంస్థకు సంబంధించిన బక్లౌడ్‌, యాప్‌ స్టోర్‌, ఆపిల్‌ మ్యూజిక్‌సహా పలు సేవలు బుధవారం ఆగిపోయాయి. కొత్త డివైజ్‌ను యాక్టివేట్‌ కాకపోవడం, ఖాతాల్లో లాగిన్‌ కాలేకపోవడం సహా అనేక సమస్యలు తలెత్తాయి. తమ అంతర్గత అప్‌డేట్‌ వల్లే ఈ సమస్య వచ్చిందని ఆ సంస్థ ప్రకటించింది. ఎఫ్‌ఎఎ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యతో అగ్రరాజ్యం అమెరికాలో విమానాల ప్రయాణంపై తాత్కాలిక నిషేధం అమలైంది. 15 లక్ష‍లమందికిపైగా ప్రయాణికుల ప్రణాళికలు తలకిందులయ్యాయి. కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ పై అధిక డేటా ఒత్తిడే కారణమన్నది ప్రాధమిక నిర్ధారణ. 7 కోట్ల 80 లక్ష‍లమంది వరకూ డిజిటల్‌ కస్టమర్లున్న అమెరికాలోని అతిపెద్ద బ్యాంకు జెపి మోర్గాన్‌ చేజ్‌ డిజిటల్‌ సేవల్లో అంతరాయానికి సాఫ్ట్‌వేర్‌ బగ్‌ కారణమన్నది ప్రాథమిక నిర్ధారణ. దాదాపు తొమ్మిది సంఘటనలకూ ఒక దానితో ఒకటి సంబంధం ఉందని కానీ, సైబర్‌ దాడుల వల్లేనని కానీ ఆధారాలు లేవు. ఈ ఘటనలతో అమెరికా అతలాకుతలమైంది. కృత్రిమ మేధ (ఎఐ) గుర్తించిన లోపాలను సరిదిద్దే క్రమంలోనే ఈ అంతరాయాలు కలిగాయని అమెరికా నిఘా విభాగాధిపతి కాంగ్రెస్‌ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అసలు కారణాలు ఏమిటో ఇంకా నిర్ధారించలేదు.

2024లో సైబర్‌ భద్రతా సంస్థ క్రౌడ్‌ స్టైక్‌ ఘటన ప్రపంచానికి తొలి హెచ్చరిక. ఈ సంస్థ తన ఫాల్కన్‌ సాఫ్ట్‌వేర్‌కి విడుదల చేసిన తప్పుడు అప్‌డేట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఉన్న 85 లక్ష‍లకుపైగా కంప్యూటర్లు, పరికరాలను ప్రభావితం చేసిందన్నది మైక్రోసాఫ్ట్‌ అంచనా. మనం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ ఎంత ఆధునికమైనా, దానిలోని ఒక చిన్నలోపం కోట్లాదిమంది జీవితాలపై ప్రభావం చూపుతుందని, అంతర్జాతీయ సంక్ష‍ోభానికి కారణమవుతుందన్న స్పృహ ప్రభుత్వాలకు మరింత అవసరం. మన దేశంలో రోజురోజుకూ డిజిటల్‌ సంస్థల గుత్తాధిపత్యం పెరిగిపోతోంది. ఆ సంస్థల పెయిడ్‌ సబ్‌స్కైబర్లలో మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు కూడా ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఐటి మంత్రిత్వశాఖ అనుమతించిన ప్రభుత్వ క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లలో మైక్రోసాఫ్ట్‌ ఒకటి. గూగుల్‌ సెర్చ్‌కి ప్రత్యామ్నాయంగా బైడూ, మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, ఆఫీస్‌కు ప్రత్యామ్నాయంగా డబ్ల్యుపిఎస్‌ ఆఫీస్‌, వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా వుయ్‌ చాట్‌, గూగుల్‌పేకు బదులు వుయ్‌చాట్‌ పే లాంటి దేశీయ ప్రత్యామ్నాయాలెన్నింటినో చైనా అభివృద్ధి చేసుకుంది. అందువల్ల అక్కడి ప్రజలందరికీ డిజిటల్‌ సేవలు ఉచితంగా లేదా చౌకగా అందుబాట్లో ఉన్నాయి. అమెరికా సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో అత్యవసర చర్యలు తీసుకున్నా... చైనాలో ఎటువంటి ప్రభావమూ ఉండదు. అందుకు భిన్నంగా కొద్దిమంది టెక్నాలజీ దిగ్గజాల సేవలపై ఆధారపడిన ఏ దేశానికైనా అధోగతే. దేశీయ టెక్నాలజీ పరిశోధనలకు భారీగా పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వరంగ సంస్థలకు స్వదేశీ సాఫ్టవేర్‌ వినియోగంలో ప్రోత్సాహాన్ని అందించడం, విదేశీ సంస్థలకు మార్కెట్‌ ప్రవేశంపై, డేటా నిర్వహణపై కఠిన నిబంధనలు అమలు చేయడం లాంటి చర్యలు ఏ దేశానికైనా స్వయంప్రతిపత్తికి ఆధారం. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ఆయా దశల్లో ప్రతిదానికీ ప్రత్యామ్నాయాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సైబర్‌ దాడులను తట్టుకుని, తిప్పికొట్టే సమర్థమవంతమైన వ్యవస్థల్ని నిర్మించుకోవాలి. దేశీయ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్న మోడీ సర్కారు ఏలుబడిలో డిజిటల్‌ స్వయంప్రతిపత్తి అత్యాశే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్