భాస్కర-II
భూమి మీద నిలబడి చూసినప్పుడు మనకు కనిపించేది ఒక ప్రాంతం మాత్రమే. కానీ అంతరిక్షం నుంచి పరిశీలించినప్పుడు నదుల ప్రవాహాలు, అడవుల విస్తీర్ణం, సముద్రాల స్వభావం, నేల లోని మార్పులు ఒక విశాలమైన చిత్రంగా ఆవిష్కృతమవుతాయి. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మనిషి వేసిన అడుగుల్లో ఉపగ్రహ సాంకేతికత గొప్ప మలుపు. ఆ దిశగా భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాల్లో భాస్కర ఉపగ్రహాల ప్రయోగాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ అవసరాలకు విజ్ఞానాన్ని అనుసంధానించాలనే సంకల్పానికి భాస్కర-II ఒక మంచి నిదర్శనం. 1981 నవంబర్ 20న భాస్కర-II ఉపగ్రహాన్ని అప్పటి సోవియట్ యూనియన్ లోని కపుస్తిన్ యార్ ప్రయోగ కేంద్రం నుంచి ఇంటర్కాస్మోస్ వాహకంతో అంతరిక్షంలోకి పంపించారు. ఈ ఉపగ్రహం భూమికి సమీప కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీలన కార్యక్రమాలను నిర్వహించింది. దీనిలో అమర్చిన రెండు టెలివిజన్ కెమెరాలు భూమిని రెండు వేర్వేరు కాంతి తరంగ పరిధుల్లో పరిశీలించేవి. ఒకటి మన కంటికి కనిపించే కాంతి పరిధిలో చిత్రాలను సేకరిస్తే, మరొకటి సమీప పరారుణ కిరణాల ఆధారంగా సమాచారాన్ని అందించేది. ఈ రెండు రకాల చిత్రాలను పోల్చడం ద్వారా నేల స్వభావం, వృక్ష సంపద, నీటి విస్తీర్ణం వంటి అంశాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. సాధారణంగా మనిషి కంటికి కనిపించే దృశ్యానికి మించి ప్రకృతిలో దాగి ఉన్న మార్పులను గుర్తించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత దేశానికి నీటి వనరుల సమాచారం ఎంతో అవసరం. భాస్కర-II ద్వారా అందిన పరిశీలన సమాచారం జలవిజ్ఞాన అధ్యయనాలకు ఉపయోగపడింది. అడవుల విస్తీర్ణం, వృక్ష సంపదలో మార్పులు, భౌగోళిక నిర్మాణాల పరిశీలనలోనూ ఈ ప్రయోగం శాస్త్రీయ అవగాహనను పెంచింది. ఈ ఉపగ్రహంలోని మరో ముఖ్యమైన పరికరం ‘సమీర్’ అనే మైక్రోవేవ్ రేడియోమీటర్. సముద్ర ఉపరితలాన్ని, వాతావరణంలోని నీటి ఆవిరి సంబంధిత పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడింది. సముద్రాలపై ఏర్పడే మార్పులు, తేమ పరిస్థితులు, వాతావరణ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి పరిశీలనలు అవసరం. నిర్దేశిత కార్యాచరణ కాలాన్ని మించి కొంతకాలం పనిచేసిన ఈ ఉపగ్రహం 1983 చివరి దశ వరకు ప్రయోగాత్మక పరిశీలనలకు తోడ్పడింది. దాని ద్వారా వచ్చిన అనుభవం తదుపరి ఉపగ్రహాల రూపకల్పనలో శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రయోగంలో ఎదురైన పరిమితులు కూడా భవిష్యత్తు సాంకేతిక మెరుగుదలకు పాఠాలయ్యాయి. భాస్కర-I, భాస్కర-II ప్రయోగాల నుంచి వచ్చిన అనుభవం భారత భూ పరిశీలన కార్యక్రమానికి బలమైన పునాదిగా మారింది. ఉపగ్రహాన్ని రూపొందించడం నుంచి కక్ష్యలో దాని పనితీరును పర్యవేక్షించడం, సమాచారాన్ని స్వీకరించడం, అవసరాలకు అనుగుణంగా విశ్లేషించడం వరకు ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో ఈ ప్రయోగాలు తోడ్పడ్డాయి. నేడు మనం ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేస్తున్నా, పంటల పరిస్థితులను పరిశీలిస్తున్నా, నీటి వనరులను గుర్తిస్తున్నా, ఆ సామర్థ్యం వెనుక ఎన్నో దశాబ్దాల శ్రమ ఉంది. ఆ శ్రమలో భాస్కర-IIకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆకాశాన్ని అందుకోవాలనే కల కన్న శాస్త్రవేత్తలు, ఆ కలను దేశ ప్రయోజనాలకు అనుసంధానించినప్పుడు విజ్ఞానం ప్రజల జీవితాల్లోకి చేరుతుంది. భాస్కర-II మనకు అందించిన అసలైన సందేశం అదే.
(నేడు భాస్కర-II ఉపగ్రహ ప్రయోగ దినం)
- చిటికెన కిరణ్ కుమార్,
సాహితీవేత్త, సెల్: 9490841284







కామెంట్లు (0)