(పన్నా నుండి ఢిల్లీ వరకు విస్తాపనకు, ఓటు హక్కు తొలగింపునకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో ఒక అంతఃసూత్రం ఉంది - అదే రాజ్య నిర్బంధానికి, పౌరుల రాజ్యాంగ హక్కులను వ్యవస్థాగతంగా కాలరాయడానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం.)
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా జైలులో, 24 ఏళ్ల యువతి మెరిసే కళ్లతో సూపరింటెండెంట్ కార్యాలయంలోకి అడుగు పెట్టి, మమ్మల్ని పలకరించడానికి తన చేతులు చాచింది. ఆమె పేరు దివ్యా అహిర్వార్. షెడ్యూల్డ్ కులాల రిజర్వుడు స్థానం నుండి ఎన్నికైన వార్డు కౌన్సిలర్. హత్యాయత్నం అనే కల్పిత అభియోగంతో సెప్టెంబర్ 27 నుండి ఆమె జైలులో ఉన్నారు. జబల్పూర్ లోని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. జై కిసాన్ సంఘటన్ వ్యవస్థాపకుడు అమిత్ భట్నాగర్‌తో కలిసి, రాష్ట్రంలోని పన్నా, ఛతర్పూర్ జిల్లాలలో మూడు ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న వేలాది ఆదివాసీ, దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సాగుతున్న ఉద్యమంలో దివ్య ముందుండి పోరాడుతున్నారు. అనేక వారాల పాటు నిరాహార దీక్ష చేసిన అమిత్ కూడా అరెస్టును ఎదుర్కొన్నారు.
ఆ మూడు ప్రాజెక్టులు ఇవీ - మఝ్గయా డ్యామ్, రుంఝ్ డ్యామ్, కెన్వా - బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు. ఇవి భిన్నమైన పరిపాలనా చరిత్రలు, తరతమ విస్తాపన స్థాయిలు కలిగిన వేర్వేరు ప్రాజెక్టులు. కానీ వీటన్నింటిలో ప్రాజెక్టు బాధిత కుటుంబాల హక్కులను నిర్లక్ష్యంగా ఉల్లంఘించడం అనేది ఏక సూత్రంగా ఉన్నది. ఈ ప్రాజెక్టు ప్రాంతాలు తీవ్రమైన నిర్బంధానికి, వీరోచిత ప్రతిఘటనకు కేంద్రాలుగా మారాయి. ఈ సంఘర్షణ రాజ్యానికి, అది ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గ ప్రయోజనాలకు, అలాగే ఆ రాజ్యాధికారానికి బలవుతున్న ప్రజలకు మధ్య ఉన్న అధికార సమీకరణాలపై మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
'ఇక్కడ నుండి కదిలేది లేదు'
మేము రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నాము. అయినప్పటికీ, ఇదే రాజ్యాంగం కింద, భారత దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతి నిమిషం, కేవలం పేదవారు అయినందువల్లే పౌరుల రాజ్యాంగ హక్కులపై ప్రభుత్వం క్రూరంగా బుల్డోజర్ను నడిపిస్తోంది. ప్రజల జీవితాలను, జీవనోపాధిని, మనుగడకు అవసరమైన అవకాశాలను మట్టసంగా అణిచివేస్తున్నది. ఆ అధికార బలం ఎంతటిదంటే, కనీసం ఆ బుల్డోజర్ నడిచే శబ్దం కూడా బయటకు వినిపించకుండా జాగ్రత్త వహిస్తుంది. "రాజ్యాంగాన్ని అమలు చేసేవారిని బట్టే అది మంచిదా లేక చెడ్డదా అనేది ఆధారపడి ఉంటుంది" అని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ఈ గ్రామాల్లో గడిపిన కొన్ని రోజులోనే ఆయన మాటల్లోని లోతైన సత్యం మా కళ్లకు కట్టినట్లు కనిపించింది.
నీటి ప్రాజెక్టులు, నిర్వాసిత జీవితాలు
సిపియం, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ నుండి వెళ్లిన మా బృందం వందలాది బాధిత కుటుంబాలను కలిసింది. మొదటి రెండు ప్రాజెక్టులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవి దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ప్రాజెక్టులు ప్రారంభమై పదేళ్లకు పైగా గడిచిపోయినా... నిర్వాసితులైన వందలాది కుటుంబాలు (వీరిలో ఎక్కువ మంది ఆదివాసీలే) నేటికీ న్యాయమైన పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయి.
ఉదాహరణకు బన్హరికలా గ్రామాన్నే తీసుకోండి. మఝ్గయా డ్యామ్ బ్యాక్ వాటర్స్ ఇప్పటికే ఇళ్లను, పొలాలను ముంచెత్తుతూ, చేతికి వచ్చిన పంటలను నీట ముంచాయి. తమ పశువులకు ఆశ్రయం లేకపోవడంతో, గ్రామస్తులు తమ ఆవులను, మేకలను కారు చౌక ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మొదట కొన్ని కుటుంబాలకు "ప్యాకేజీ" కింద రూ.5 లక్షలు ఇస్తామన్నది. నిరంతర నిరసనల ఫలితంగా, 2025 డిసెంబర్లో ప్రభుత్వం ఆ ప్యాకేజీని రూ.12.5 లక్షలకు పెంచక తప్పలేదు.
‘‘భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం, 2013' లోని సెక్షన్ 38(1) ప్రకారం, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో "సేకరించిన భూములు ముంపునకు గురికావడానికి ఆరు నెలల ముందే పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలి.’’
ఈ నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే తుంగలో తొక్కారు. అసంపూర్తిగా జరిగిన సర్వే కారణంగా భూమి, ఇళ్లు, చెట్లకు ఇవ్వాల్సిన పరిహారాన్ని తక్కువగా అంచనా వేశారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రాజెక్టు అమలవుతున్నప్పటికీ, 2018 కటాఫ్ తేదీని సవరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆనాడు మైనర్లుగా ఉన్న పిల్లలు ఇప్పుడు పెద్దవారైనప్పటికీ, కుటుంబంలోని వయోజన సభ్యులుగా వారికి చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక పరిహార హక్కులను నిరాకరిస్తున్నారు. చాలా కుటుంబాలకు అసలు ఎటువంటి పరిహారం అందలేదు. ఈ అనిశ్చితి గ్రామాన్ని కుదిపేస్తోంది. పిల్లలు బడి మానేశారు, కుటుంబాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇవేవీ జరిగేవి కావు. మఝ్గయా, రుంఝ్ డ్యామ్‌ల వల్ల ప్రభావితమైన చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
దీనికి నిరసనగా గ్రామస్తులు 'చితా ఆందోళన్' (చితి ఉద్యమం) చేపట్టారు. ఇందులో భాగంగా వారు చితులపై పడుకోవడం, మెడకు ఉరితాళ్లు తగిలించుకోవడం లేదా నడుము లోతు నీళ్లలో నిలబడటం వంటి నిరసనలకు దిగారు. "న్యాయ్ దో, యా మార్ దో (మాకు న్యాయం చేయండి లేదా మమ్మల్ని చంపేయండి)" అనేది వారి నినాదం. దీనికి బదులుగా ప్రభుత్వం పోలీసు బెటాలియన్లను పంపింది, విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇక్కడే దివ్యను డజన్ల కొద్దీ పోలీసులు (వీరిలో ఎక్కువ మంది పురుషులే) ఈడ్చుకెళ్లి కొట్టారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో ఆమె బట్టలు చింపి, దాదాపు వివస్త్రను చేశారు. అయినప్పటికీ, దెబ్బలు తిని అరెస్టులైన గ్రామస్తులతో సహా అందరూ మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు.
మూడవది వివాదాస్పదమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు. ఇందులో కెన్ నదిపై దౌధన్ గ్రామం దగ్గర 96.7 మీటర్ల (సుమారు 317 అడుగుల) ఎత్తైన డ్యామ్ నిర్మించనున్నారు. నిత్యం కరువుతో అల్లాడే బుందేల్‌ఖండ్, పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు నీరందించడం దీని ఉద్దేశమని చెబుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు సాధ్యతపై, పర్యావరణ పర్యవసానాలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు.
న్యాయ పరిశీలన
ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన భారత సుప్రీంకోర్టు నియమించిన 'సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ' (సి.ఇ.సి) 2019లో ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన అధికారిక అనుమతులను తీవ్రంగా తప్పుబట్టింది. కెన్ నదిలో అసలు తగినంత నీరు ఉందా అని ప్రశ్నించడమే కాకుండా, ప్రాజెక్టుకు అవసరమైన 9,000 హెక్టార్లలో 6,000 హెక్టార్లు అటవీ భూమి అని (ఇందులో పన్నా టైగర్ రిజర్వ్‌లోని కీలక భాగం కూడా ఉంది), సుమారు 23 లక్షల చెట్లను నరికివేయడం వల్ల తీవ్ర పర్యావరణ పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. విచిత్రమేమిటంటే, ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నప్పటికీ, 2019 నుండి సుప్రీంకోర్టులో ఈ కేసు దాదాపు స్తంభించిపోయింది. బిజెపి కి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 'ఎన్.సి.సి' సంస్థకు ఈ టెండర్ దక్కింది. కోర్టులు ఈ అంశంపై దృష్టి సారించే సమయానికి, ప్రాజెక్టు నిర్మాణం, దానివల్ల కలిగే ముంపు తిరిగి సరిదిద్దుకోలేని ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు మూలంగా 22 గ్రామాల్లోని సుమారు 8,000 ఆదివాసీ కుటుంబాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి. అటవీవాసుల హక్కుల గుర్తింపు, ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాకుండా వారిని ఖాళీ చేయించకూడదని అటవీ హక్కుల చట్టం (ఎఫ్.ఆర్.ఎ) లోని సెక్షన్ 4(5)లో స్పష్టంగా ఉంది. అయినా, ఒక్క గ్రామంలో కూడా ఈ హక్కులను గుర్తించలేదు. సామాజిక అటవీ హక్కులను విస్మరించారు, గ్రామసభ ఆమోదం తీసుకోలేదు. నాలుగు గ్రామాలు కోర్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాయి, వీటికి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం పునరావాసం అనేది ప్రజల స్వచ్ఛంద అంగీకారంతోనే జరగాలి. కానీ ఈ గిరిజన తెగలపై బలవంతంగా రుద్దుతున్న ప్రక్రియలో స్వచ్ఛందం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఆదివాసీలు ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా ఆదివాసీల పూర్వీకుల భూములను స్వాధీనం చేసుకోకుండా సుప్రీంకోర్టు రక్షణ కల్పించిన 'నియమగిరి' కేసులో మాదిరిగానే, ఇక్కడి భూమి కూడా కేవలం ఆర్థిక ఆస్తి మాత్రమే కాదు. ఆదివాసీల అస్తిత్వానికి, సంస్కృతికి విడదీయరాని భాగాలైన పవిత్ర వనాలు, గ్రామ దేవతలు, పూర్వీకుల ప్రార్థనా స్థలాలు ఈ ప్రాజెక్టు వల్ల నాశనమైపోతాయి.
ఇప్పటికే మూడు గ్రామాల నుండి తరలింపు మొదలైంది. మేము పునరావాస కాలనీ అని పిలవబడుతున్న ప్రాంతాన్ని సందర్శించాము; అక్కడ "భూమికి భూమి" ఇస్తామన్న హామీ ఒక ప్రహసనంగా మారింది. కుటుంబాలకు కేవలం 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు గల రాతి నేల ప్లాట్లను కేటాయించారు. అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు, నీరు లేదు, కనీసం దగ్గరలో బడి కూడా లేదు. భూమి పట్టాలకు బదులుగా, తహసీల్దార్ సంతకమని చెబుతున్న అస్పష్టమైన సంతకం, ప్లాట్ నంబర్ ఉన్న రెండు అంగుళాల కాగితపు ముక్కలను ఆ కుటుంబాలు మాకు చూపించాయి. అవే భూమి పట్టాలుగా చెలామణి అవుతున్నాయి. కొన్ని నెలల్లోనే, 10 కుటుంబాలకు మళ్లీ ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి; ఎందుకంటే వారికి పునరావాసం కల్పించిన భూమి ఇప్పుడు కాలువ నిర్మాణానికి అవసరమైందట. పట్టా పేరుతో ఇచ్చిన ఆ కాగితపు ముక్క చిత్తు కాగితంతో సమానమని తేలిపోయింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆదివాసీలపై అప్రకటిత యుద్ధం చేస్తున్నాయి. ఒడిశా లోని సిమ్ఝాలీ నుండి సంతాల్ పరగణాలోని బొగ్గు గనుల ప్రభావిత ఆదివాసీ గ్రామాల వరకు, ఛతర్పూర్ నుండి పన్నా వరకు అంతటా ఇదే తీరు. తరతరాలుగా ఈ అడవుల్లో నివసిస్తూ, వాటిని కాపాడుతూ వస్తున్న వారినే అభివృద్ధి పేరుతో అడవులకు శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల డిమాండ్లు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ వాటి మూలం ఒక్కటే - రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, అధికారంలో ఉన్నవారి దాడుల నుండి దానిని కాపాడుకోవడానికి పోరాడటం. దివ్య విడుదల కోసం, రాండాల్ సిక్వేరా, లక్ష్మీ నాయక్‌లకు న్యాయం అందించడం కోసం, తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వందలాది మంది ఆదివాసీల కోసం వినిపిస్తున్న డిమాండ్లు భారతదేశం అంతటా పుట్టుకొస్తున్న అనేక 'జంతర్ మంతర్'లలో ప్రతిధ్వనించాలి. న్యాయం కోసం జరిగే పోరాటం అవిభాజ్యమైనది. ఈ సూత్రం కార్యరూపం దాల్చినప్పుడు అది వర్గ ఆధారిత అధికార కోటగడీలను బద్దలు కొడుతుంది.

వ్యాసకర్త -సిపియం సీనియర్ నేత బృందా కరత్







కామెంట్లు (0)