" ఇటు తుఫాను మీద తుఫాను.. అటు ఎలక్షన్ మీద ఎలక్షను! ఒకపక్క పంటల్ని ముంచేశాయని రైతుల బెంబేలు.. మరొక పక్క ప్రెజాస్వోమ్యం ముంచేస్తున్నారని అపోజిషనోల గగ్గోలు! ఆ పైన కోర్టు వారి కోపాలూ,సిరాకులూ! ఎందుకీ పర్రాకులు( కష్టాలు)? అవసరమా! ఇలాటి వోతావరణంలో సమ్మిట్టు అవసరమా? పబ్లిసిటీ కైనా సమయమూ, సందర్భమూ ఉండాలా?"
" ఏమి సమ్మిట్టులే! ఈసారి మాడిపోయిన పెసరట్టే! అతగాడొక డప్పు.. ఇతగాడొక డోలు.. జతగాల్లకి తప్పెట గుళ్ళు! ఇక యికలూ.. పకపకలూ..తైతక్కలూ! కొత్తేటీ? ఎన్నో సమ్మిట్లు సేసిన అనుభవం ఏటయ్యిందో ఈసారి! గజీతగాడు గెడ్డలో పడినట్టయింది!"
"సమ్మిట్టు అనగానే మా ఏరియా గుండెల మీద సమ్మెటతో కొట్టినట్టు అవుతది.. ఆనాడు హల్వా తినేసి వెళ్లిపోవడం కాదుగానీ, ఎప్పుడు భూములు లాగేసుకుంటారో అని, మా రైతులు తెగ బెంగ బెట్టీసుకుంటున్నారు!"-- పరదేశి, వెంకటస్వామి మాటల్లో తల దూర్చాడు.. మాడుగుల కొండబాబు.. బయట బోరున వర్షం.
" ఈ సంకురాతిరి హాయిగా గడిసిపోద్ది లేరా! ఇంతలోన ఇటుపక్క కొత్త కంపెనీలు ఏవి వచ్చినట్లు లేదు. ఆరోజు ఓపినింగ్ నీరు తప్ప, పోలవరం కాలువకి మల్లా జ్వరమొచ్చీసింది కదా!"--భుజం మీద తువ్వాలు సర్దుకొని, హాల్లోకి వచ్చాడు దశుమంతు నాయుడు. ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాత, లేచి నిల్చున్న వాళ్లంతా కూర్చున్నారు.
" మక్కకి పట్టిస్తే లాగీగలం గానీ, మనసుకు పట్టిన జలగని లాగీలేం గదా! అనుమానాలు అలాగే ఉండిపోయాయి. మా ఏరియా కి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. భూములుంటాయో.. గ్రేమాలుంటాయో? గ్యారెంటీ లేకుండా పోయింది!"
" పంచాయతీ ఎలక్షన్లు ఎలా ఉన్నాయిరా.. మీ వైపు?"
" గుర్రం గుడ్డిదైనా దానాకు లోట్లేదు! ఊరు పోతే కదా, పంచాయతీ పోవడానికి! పోటీకి ఎవడూ తగ్గట్లేదు. ఇన్నాళ్ళు, ఎనక నుంచి నడిపించి, ఎవుడ్నో ఒకడ్ని ప్రెసిడెంట్ చేసే వాడ్ని. కంపెనీలకు భూములు, ఊరు పోకముందే ఈసారి సరదాకి అవకాశం ఇమ్మంటే, ఎవుడి మొకం లోనూ కళ లేదు. పాతోడే మళ్లీ చేస్తామంటున్నాడు. ఆడ్ని తీసుకొచ్చాను.. నువ్వు ఒకసారి చెప్పన్నా!"-- బయటికి వెళ్లి తాజా మాజీ సర్పంచ్‌ను, మరికొందరిని తీసుకువచ్చాడు కొండబాబు.
వాళ్లు లోపలకు వచ్చి, నమస్కారం పెట్టి, నాయుడు సైగ చేయగానే కూర్చున్నారు." ఏమయ్యా! సరదా పడుతున్నా డు. మా కొండకి ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదా!"--కుర్చీలో వెనక్కి చేరబడి కొంచెం రిలాక్సయ్యాడు నాయుడు.
" నాయుడు బాబూ! కొండబాబు నాకు దూరపోడేటీ కాదు.. ఆడు భూమి పోయినా, పుట్ట పోయినా బతగ్గలడు. మీలాంటి పెద్దల సపోర్టుంది. రియలెస్టేటు.. భూముల బిజినెస్సూ.. గ్రేమ కంఠాలకి ఉరితాడు బిగించీగలడు.. రేప్పొద్దున్న కంపెనీలొచ్చి.. భూములు పోయి.. ఇల్లూ పోతే, ఆడపిల్లకి ఎలాగా పెళ్లి సెయగలను? దాని పెళ్లి కార్డు మీద నా పేరు పక్కన, ప్రెసిడెంటు.. అని ఉంటే గౌరవం అని ఈ సారికి నాకు ఒదిలీమని కోరతున్నాను."
" ఆడు ఆల్రెడీ ఆ పదవి సేసేశాడు.. ఈసారి నాకివ్వడానికి ఏటి నొప్పి? ఊరూ, భూములు కంపినీ వొచ్చి ఊర్చికెళ్లిపోతే.. లేని పంచాయతీకి ప్రెసిడెంట్ ని అయిపోతానేటీ?"
" అంతా తెలిసీ..నువ్వలాగ అనీస్తే..నేనేటి సెయ్యలేను"-మాజీ సర్పంచ్ లేచిపోయాడు. తానేమీ చెప్పక ముందే అతడు లేచిపోవడం నాయుడికి కోపం వచ్చింది. బయటకు కనిపించకుండా--కూర్చోవయ్యా! పోయే పంచాయతీకి ఇద్దరూ పోటీ! గానుగకి ఏనుగు లాగా.. నీకేల్రా కొండా!"-చిరాకుపడ్డాడు. మాజీ సర్పంచ్ మనసు తేలికైంది. నాయుడు మళ్ళీ మాట్లాడుతూ" ఈసారి మీ ఏరియా భూముల కోసం వైజాగ్ లో సమ్మిట్టు జరగదట! కంపెనీ వాళ్ళు, వాళ్లకు నచ్చిన భూములు వాళ్లే చూసుకోవడానికి గ్రామాలకే వచ్చి చూస్తారట! ప్రభుత్వానికి కూడా, మాట మాటకి వైజాగ్ లోనే సమ్మిట్టు పెడితే, వచ్చినోళ్ళకి బోర్ కొట్టేస్తుందని మొన్న అర్థమయిపోయింది. ప్రజల వద్దకే పాలన లాగా, భూములు దగ్గరికి పరిశ్రమలు.. అనే ఐడియా బాబు గారికి ఎవరో ఇచ్చారట! ఒకవేళ అదే జరిగితే, మీ ఏరియా వాళ్ళు ఆ కష్టసుఖాలు మీరే చూసుకోవాల! ఏ ఎక్కువ తక్కువ వచ్చినా నా దగ్గరకు రాకూడదు"-కొండబాబును చూసి బాణం విసిరాడు గానీ, అది మాజీ సర్పంచ్ కే తగిలింది. తనను బెదిరించడానికి ఆ బాణం వేసినట్టు అర్థమైంది. నాయుడు కొనచూపుతో అది గ్రహించాడు.
పైకి ఏమీ తెలియనట్టు నటిస్తూ-" ఎట్రా కొండా! ఎప్పుడూ లేదు, మీ ఏరియాలో రైతులు గంజాయి అమ్మడమేంట్రా?" అన్నాడు.
అది ఈసారి మాజీ సర్పంచ్ కు బాణంలా కాదు, బల్లెంలా తగిలింది. కొండబాబు ఏమీ మాట్లాడలేదు. మాజీ సర్పంచ్ పైకి లేచి, నమస్కారం పెట్టి-" బాబూ! ఈ సుట్టుపక్కల నువ్వు వుండబట్టి.. ఈ నాలుగు వర్షాలైనా పడతన్నాయి. లేకపోతే మాలాటోళ్లం ఏటైపోదుమో! కొండబాబు నామినేషన్ కి, డిపాజిట్ నేనే కడతాను. ఏకగ్రీవం సేసిన తర్వాత కొండమ్మ సంబరానికి మీరు తప్పక రావాల "-అనేసి వెళ్లిపోయాడు.
" సమ్మెట గట్టిగానే తగిలింది..రాయి బద్దలైపోయింది"- ఈసారి మెల్లగా నవ్వాడు పరదేశి.
-- ' నల్లి ' కుట్టు







కామెంట్లు (0)