ఆధునిక మానవాళి వికాసానికి ‘డిజిటల్ విప్లవం’ బలమైన చోదక శక్తిగా మారింది. స్మార్ట్‌ఫోన్ల విస్తరణ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సర్వర్ల నిర్మాణం, ఆన్‌లైన్ సేవలు మన జీవనశైలిని ఎంతో సులభతరం చేశాయి. వైద్యం నుంచి విద్య వరకు, వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అనేక రంగాల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. కానీ, ఈ సాంకేతిక జిలుగు వెలుగుల వెనుక ‘ఈ-వేస్ట్’ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) మానవాళి భవిష్యత్తుకు పెను ముప్పుగా పరిణమించాయి. సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవనశైలిని ఎంతగా సులభతరం చేసిందో, అంతే స్థాయిలో పర్యావరణానికి తీవ్ర సవాలుగా మారింది. కొత్త పరికరాలను కొనుగోలు చేయడంలో చూపుతున్న ఆసక్తి, పాత పరికరాలను బాధ్యతాయుతంగా పారవేయడంలో కనిపించడం లేదు. ఆధునిక యుగంలో 'డిజిటల్ విప్లవం' తెచ్చిన మార్పులు ఒకవైపు వికాసానికి దారితీస్తుంటే, మరోవైపు పేరుకుపోతున్న ‘ఈ-వేస్ట్’ రాబోయే తరాల మనుగడనే ముప్పులోకి నెడుతోంది. అక్టోబర్ 14న జరుపుకునే అంతర్జాతీయ ఈ-వేస్ట్ దినోత్సవం ఈ విపత్తు తీవ్రతను ప్రపంచానికి మరోసారి గుర్తుచేస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల మేఘాలను తొలగించి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అత్యవసర స్థితిని ఈ రోజు మనకు స్పష్టం చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి తాజా నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 6.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది 2010తో పోలిస్తే 82 శాతం అధికం. ప్రస్తుత ధోరణులు కొనసాగితే 2030 నాటికి ఈ పరిమాణం 8.2 కోట్ల టన్నులకు చేరుతుందని నివేదిక అంచనా. అంటే ప్రపంచం ఉత్పత్తి చేస్తున్న ఈ-వేస్ట్ వేగాన్ని తట్టుకునే స్థాయిలో సేకరణ, రీసైక్లింగ్ వ్యవస్థలు అభివృద్ధి చెందడం లేదు. కేవలం 20 శాతానికంటే తక్కువ భాగం మాత్రమే అధికారికంగా సేకరించబడి, సైంటిఫిక్ పద్ధతుల్లో రీసైకిల్ అవుతోంది. మిగిలిన 80 శాతానికి పైగా వ్యర్థాలు ప్రకృతి వనరులలో కలవడం లేదా మురికివాడల్లో అనధికారికంగా కాల్చివేయడం జరుగుతోంది. రోజువారీ జీవితంలో తక్కువ ధరకు లభిస్తున్నాయని మనం కొనుగోలు చేసే యుఎస్‌బి కేబుళ్లు, పవర్ బ్యాంక్‌లు, చార్జర్లు, ఇయర్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి 'చిన్న పరికరాలు' పాడవగానే పారేస్తున్నాం. ఈ-వ్యర్థాల్లో కేవలం చెత్త మాత్రమే కాదు... బంగారం, వెండి, రాగి, ప్లాటినం, కోబాల్ట్, లిథియం వంటి అత్యంత ఖరీదైన, విలువైన మూలకాలు ఉంటాయి. సరైన రీసైక్లింగ్ లేకపోవడం వల్ల ఏటా వందల కోట్ల రూపాయల విలువైన వనరులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. పరికరాలలో ఉండే సీసం, పాదరసం, కాడ్మియం, బెరీలియం వంటి విషపూరిత రసాయనాలు నేల, నీరు, గాలిలో కలిసి పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ఫలితంగా క్యాన్సర్, నాడీ వ్యవస్థ రుగ్మతలు, శ్వాసకోశ సమస్యలు ప్రపంచ జనాభాను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఈ-వేస్ట్ దినోత్సవం-2026 "ఫాస్ట్ టెక్ – చెత్తబుట్టలో వేయకండి, అధికారికంగా సేకరించండి!" అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది.
అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద మూడో ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా భారతదేశం నిలిచింది. అమెరికా ఏటా దాదాపు 69 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుండగా, ఒక సగటు అమెరికన్ ఏడాదికి దాదాపు 21.3 కిలోల ఈ-వ్యర్థాలను పారవేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి ఏటా ఉత్పత్తి చేసే ఈ-వ్యర్థాల పరిమాణం 7.8 కిలోలు. కానీ అమెరికాలో ప్రతి ఒక్కరూ పారవేసే ఈ-వ్యర్థాలు ప్రపంచ సగటు కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ అధ్యయనాల ప్రకారం- భారత్‌లో ఏటా దాదాపు 45 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు నమోదవుతున్నాయి. ఇందులో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి 12 లక్షల టన్నులు కాగా, మొబైల్ ఫోన్లు, టెలికాం పరికరాలు 9 లక్షల టన్నుల వ్యర్థాలు నమోదవుతున్నాయి. వీటిని శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల తీవ్ర వాయు, జల కాలుష్యం ఏర్పడుతోంది. రసాయన విష ప్రభావంతో ఏటా 12 వేలకు పైగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని, లక్ష మందికి పైగా చిన్నారులు సీసం ప్రభావంతో నరాల బలహీనతలకు గురవుతున్నారని అంచనా. ‘దేశంలో ఈ-వేస్ట్ నిర్వహణ పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సామాజిక ఆరోగ్య అత్యవసర పరిస్థితి కూడా. అనధికారిక రంగంలో పనిచేస్తున్న కార్మికులను సురక్షితమైన, అధికారిక రీసైక్లింగ్ చట్రంలోకి తీసుకురావడం తక్షణ అవసరం’ సిఎస్‌ఇ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా నారాయణ్. ‘ఈ-వేస్ట్’ అనేది కేవలం వ్యర్థాల సమస్య మాత్రమే కాదు; అది మానవాళి భవిష్యత్తుకు, పర్యావరణ సమతుల్యతకు ఎదురవుతున్న తీవ్రమైన సవాలు. ఈ-వేస్ట్ దినోత్సవం సందర్భంగా మనమందరం-"తక్కువగా కొందాం, పాత వాటిని బాగుచేసి వాడదాం, వ్యర్థాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేద్దాం!" అనే ప్రతిజ్ఞ తీసుకోవాలి. సాంకేతిక పురోగతి... పర్యావరణ నాశనానికి హేతువు కాకూడదు, మానవ వికాసానికి, హరిత భవిష్యత్తుకు పునాది కావాలి. ఫాస్ట్ టెక్ మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలకు భద్రమైన భూమి కూడా కావాలి!







కామెంట్‌లు (0)