పునాదిపాడులో బాలికల జూనియర్ కళాశాల భవనం ప్రారంభంలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి - కంకిపాడు : విద్యార్థుల ఫలితాల మెరుగుదలే లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యాయులు పనిచేయాలని విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం పునాదిపాడులో పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యుల విరాళం రూ.1.20 కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల లేబరేటరీలను పరిశీలించారు. దాసరి ఆళ్వార స్వామి రచించిన భారతదేశ ప్రధానమంత్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పునాదిపాడులోని జడ్‌పి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ పాఠశాలలో గతేడాదితో పోలిస్తే 19 మంది కొత్త విద్యార్థులు చేరడాన్ని అభినందించిన మంత్రి, విద్యార్థుల లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయుల హాజరు, బోధన నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఒకేషనల్ ల్యాబ్‌లు, వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేయాలని, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులపై మరింత శ్రద్ధ చూపాలని, పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. 340 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో నాణ్యమైన మార్పు కనిపించాలని, ఆ మార్పు పదో తరగతి ఫలితాల్లో ప్రతిబింబించాలని స్పష్టం చేశారు. అనంతరం తొమ్మిదో తరగతి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థి మిత్ర కిట్ పంపిణీపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంఎల్‌సి పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, ఆర్‌టిసి చైర్మన్ కొనకళ్ల నారాయణ, కలెక్టర్ డికె బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, ఆర్‌జెడి నాగమణి, డిఇఒ యువి సుబ్బారావు, ఎంఇఒ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)