కార్మికులు, ఉద్యోగుల పక్షాన భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగుల భవిష్య నిధి కార్పొరేట్లకు, యజమానులకు కొమ్ముకాయడం శోచనీయం. దేశంలో సామాజిక పింఛన్ల కంటే ఘోరంగా ఉద్యోగుల పెన్షన్ పథకం (ఇపిఎస్) ఉన్నా పట్టించుకునే తీరిక పన్నెండేళ్లుగా కొలువుదీరిన మోడీ సర్కారుకు లేకపోవడం దారుణం. ఇపిఎఫ్‌ఒ 2024-25 వార్షిక నివేదిక ప్రకారం సంస్థ పరిధిలోని 81.5 లక్షల మంది పెన్షనర్లలో సుమారు 36.8 లక్షల మంది పొందేది వెయ్యి లేదా అంతకంటే తక్కువ పింఛనేనంటే కేంద్రానికి కార్మికవర్గం పట్ల ఉన్న వివక్షను అర్థం చేసుకోవచ్చు. పింఛను పెంపుతోపాటు కనీస వేతనం పెంపుకోసం ఆశించిన చందాదారులకూ సంస్థ తాజాగా జారీ చేసిన నిబంధనలు మొండిచేయి చూపడం క్షమార్హం కాదు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చింది. సామాజిక భద్రతా కోడ్ - 2020ని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్), ఉద్యోగుల పెన్షన్ పథకం (ఇపిఎస్), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కోసం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ జారీ చేసిన కొత్త నిబంధనలు చందాదారులకు, పింఛనర్లకు ఎటువంటి ఊరటనివ్వలేదు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ - 1948, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్‌లేనియస్ ప్రావిజన్స్ యాక్ట్ - 1952 వంటి తొమ్మిది చట్టాలను విలీనం చేస్తూ రూపొందించిన కొత్త కోడ్‌కు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలను అమలు చేయాలన్న ప్రతిపాదనకు ఇపిఎఫ్‌ఒ కేంద్ర ధర్మకర్తల మండలి (సిబిటి) నాలుగు నెలల కిత్రం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పింఛను పథకం - 1995 స్థానంలో ఇపిఎస్-2026 కు మండలి ఆమోదం తెలపడం ఏకపక్ష చర్య. ఈ నిర్ణయాలన్నీ యజమానుల కొమ్ము కాసేవి, కార్మికులకు నష్టం కలిగించేవే. లబ్ధిదారులతో ఏవిధమైన సంప్రదింపులు జరపకుండా తీసుకున్నవే. సుమారు ఎనిమిది కోట్ల మంది చందాదారులు, 81.5 లక్షల మంది పింఛనుదార్లకు ప్రయోజనం కలిగించాలన్న, వారి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలన్న ఆలోచన సర్కారుకు ఏమాత్రం కలగకపోవడం అమానవీయం.
పన్నెండేళ్ల క్రితం నిర్ణయించిన కనీస పింఛను వెయ్యి రూపాయలను, పిఎఫ్ చందా కోసం ఉన్న రూ.15 వేల వేతన పరిమితిని తాజా నోటిఫికేషన్ సవరిస్తుందని, గణనీయంగా పెంచుతుందని ఆశించిన ఇపిఎఫ్ చందాదారులకు తాజా ఉత్తర్వులు తీవ్ర నిరాశ కలిగించాయి. సోషల్ మీడియాలో కనీస పింఛను రూ.10 వేలు చేశారని, వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచారని నిత్యం తప్పుడు ప్రచారం చేసే సంఘ్ శ్రేణులకు కొదవే లేదు. అత్యధిక కాలం కేంద్రంలో అధికారం వెలగబెట్టామని ప్రచారం చేసుకుంటున్న మోడీ సర్కారు వారి ఆశలను ఇన్నేళ్లుగా పట్టించుకోకపోవడం పాలకుల వర్గ నైజాన్ని ఎత్తిచూపేదే. అంతేకాదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న చర్యలన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవే. పెన్షనర్ పొందే చివరి జీతానికి 12 నెలల సగటు నుంచి 60 నెలలకు మార్పు చేశారు. దీనివల్ల వారి పెన్షన్ మొత్తం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్‌ను తీవ్రంగా నష్టపరిచింది. వేతన పరిమితితో సంబంధం లేకుండా మూల వేతనంలో 12 శాతం వరకూ చందా చెల్లించే విధానం కోవిడ్ -19 మహమ్మారి వచ్చే వరకూ ఉండేది. యాజమాన్యాలు వేతన పరిమితిని రూ.15 వేలకు పరిమితం చేయడం, దానిని కేంద్రం ఆమోదించడం చందాదారుల ప్రయోజనాలకు విఘాతమే. పింఛనుదారులకు ప్రయోజనం చేకూర్చే కనీస పెన్షన్ కోసం ప్రభుత్వం ఏటా అందించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థికసహాయం) వెయ్యి కోట్లే. వేతనంతో సంబంధం లేకుండా చందాదారులందరికీ గౌరవప్రదమైన, జీవనాన్ని కొనసాగించేందుకు తగినంత ఇపిఎస్ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం కనీస బాధ్యత. కనీస వేతన పరిమితిని గణనీయంగా పెంచాలి. రెక్కలు ముక్కలు చేసుకుని చెమటోడ్చే చందాదారుల కష్టాన్ని యజమానులకు ధారాదత్తం చేసే విధానాలకు ఇకనైనా ముగింపు పలకాలి. లేకుంటే శ్రమజీవుల ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదు.








కామెంట్‌లు (0)