గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశ్వవ్యాప్త కార్యాచరణ

2 గంటల క్రితం

sadds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మారుతున్న వాతావరణ పరిస్థితులు, వేడెక్కుతున్న భూమి నేపథ్యంలో కరువు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికే పరిమితం కావడం లేదు. అది ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారుతుండటం ఆందోళనకరం. గత ఏడాది వివిధ దేశాలను కరువు పీడించగా, ఈ ఏడాది ఎల్‌ ‌నినో కారణంగా అనేక దేశాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెల్కొన్నాయి. ప్రఖ్యాత సైంటిఫిక్‌ ‌జర్నల్‌ ‌‘నేచర్‌ ‌రివ్యూస్‌ ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌‌మెంట్‌’ ప్రకారం గత ఏడాది ప్రపంచ భూభాగంలో సుమారు 30 శాతం కరువు ప్రభావానికి గురైంది. ఈ సంవత్సరం నెలకొన్న ఎల్‌ నినో పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ఎల్‌ నినో ఈ ఏడాది చివరికి మరింత బలపడే అవకాశం ఉంది. యునిసెఫ్‌ అంచనాల ప్రకారం 2026 అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య దాదాపు 100 దేశాల్లోని 34.7 కోట్ల మందికి పైగా పిల్లలు దీని ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. మన దేశంతో పాటు కొలంబియా, ఫిజీ, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్‌ వంటి ప్రాంతాల్లో కరువు, నీటి కొరత వంటి దుర్భిక్ష పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. అయితే, ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు అనేక ఇతర అధ్యయనాలు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రపంప వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించాయి.

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికీ, తరచుగా కరువులు ఏర్పడటానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు ఇప్పుడు నిర్ధారణ అయింది. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంలోనూ, పర్యావరణ వ్యవస్థల్లోనూ కరువు పరిస్థితులు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్‌ ప్రభుత్వ వాతావరణ మార్పుల మండలి సైతం పేర్కొంది. వాతావరణం నుంచి నీరు ఆవిరి కావడం భారీగా పెరగడంతో నేలలో తేమ గణనీయంగా తగ్గుతోంది. ఈ కారణంగానే 1901 నుంచి ప్రపంచవ్యాప్తంగా కరువు తీవ్రత సగటున 40 శాతం పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు కుదించుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయి. 2050 నాటికి కరువు కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 32 లక్షల మంది మరణించే అవకాశం ఉందన్నది ఒక అంచనా. ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచం ఈ సంక్షోభం పట్ల మేల్కొంటోంది. కరువు వల్ల ఆర్థిక వ్యవస్థలకు, పర్యావరణానికి పెరుగుతున్న నష్టం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత విధానం మాత్రం లేదు.ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ వ్యతిరేక ఒప్పందం (యునైటేడ్‌ ‌నేషన్స్‌ ‌కన్వెన్షన్‌ ‌టు కంబాట్‌ ‌డిజర్టిఫికేషన్‌- ‌యుఎన్‌‌సిసిడి) కింద ప్రపంచవ్యాప్త కరువు నిర్వహణ చట్రంపై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పురోగతి మాత్రం నత్తనడకన సాగడం విచారకరం. మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో ఇటీవల ముగిసిన యుఎన్‌‌సిసిడి దేశాల కాప్‌-17 ‌సదస్సులోనూ ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. కరువును తట్టుకునే సామర్ధ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి ఇప్పుడు ఖర్చు చేస్తున్న నిధులు కాకుండా మరో 278 బిలియన్‌ ‌ డాలర్ల లోటు ఉందని, ఆ మొత్తాన్ని అభివృద్ధి చెందిన దేశాలు సమకూర్చాలన్నది యుఎన్‌‌సిసిడి ప్రతిపాదన! షరా మామూలుగానే అమెరికా ఈ ప్రతిపాదనకు మోకాలడ్డింది. అమెరికాకు తానా తందానా అనే మరికొన్ని దేశాలు కూడా దీనిని వ్యతిరేకించాయి. కరువు అనేది ఒకటి, రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత సమస్య అని, దీనికి అంతర్జాతీయ ఒప్పందం అవసరం లేదని అమెరికా వాదించడం బరితెగింపు.

అయితే, అమెరికా చేసిన ఈ వాదన మారుతున్న వాతావరణ, ప్రపంచ పరిస్థితుల్లో ఏమాత్రం చెల్లుబాటు కాదని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశంలో నెలకొన్న కరువు అంతర్జాతీయ ఆహార భద్రత, వాణిజ్యం, ఉపాధి, ప్రజారోగ్యాలను ప్రభావితం చేసేదిగా మారుతుందని వీరు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, ఆహార నిల్వలు, అత్యవసర సరఫరా వ్యవస్థలు సక్రమంగా సాగాలంటే విపత్తులను ఎదుర్కొనే అంశాల్లోనూ ప్రపంచ దేశాల మధ్య పటిష్ట సహకారం అవసరమన్న వీరి విశ్లేషణ సరైనదే. ఈ నేపథ్యంలో నవంబర్‌ 9నుండి 20వ తేది వరకు టర్కీలోని అంటాల్యాలో జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సు (కాప్‌-31) ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గత ఏడాది నెలకొన్న కరువు, ఈ ఏడాది ఎల్‌ ‌నినో హెచ్చరికలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కరువు వంటి విపత్కర పరిస్థితులు ఇకమీదట ఒక దేశానికో, ఒక ప్రాంతానికో ఏ మాత్రం పరిమితమైనవి కావు. వాటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. వాతావరణ విపత్తులకు సరిహద్దులు ఎలా ఉండవో, వాటిని ఎదుర్కోవడానికి, బాధిత ప్రజానీకానికి ఊరటనివ్వడానికి ప్రపంచ దేశాలు కూడా సరిహద్దులకు అతీతంగా కదలాలి. ఆ కదలిక ఒక దాతృత్వ చిహ్నంగా కాకుండా, బాధ్యతగా ఉండటం అవసరం.​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్