శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతక్షణం స్పందించాలి!

20 గంటల క్రితం

hunger strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నీట్‌ (ఎన్‌ఇఇటి) సహా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో వరుసగా బయటపడ్డ అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకులు, నిర్వహణ వైఫల్యాలపై ప్రభుత్వ స్పందనను, విద్యాశాఖమంత్రి రాజీనామాను కోరుతూ ఢిల్లీలో సాగుతున్న ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవటం అప్రజాస్వామికం. ఎవరెంతగా మొత్తుకున్నా మాకేటి వెరపు అన్నట్టుగా భీష్మించుకుని కూర్చోవటానికి ఇది రాచరికం కాదు, వలస పాలన అంతకంటే కాదు; ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం! పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్‌ సంఘీభావం ప్రకటించడమే కాదు, జూన్‌ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూలై 16 నాటికి ఆయన దీక్ష 19వ రోజుకు చేరుకుంది. రోజురోజుకూ ఆయన పరిస్థితి విషమిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం అత్యంత దారుణం, బాధ్యతారాహిత్యం.

సోనం వాంగ్‌చుక్‌ జీవితాంతం విద్యా సంస్కరణలకే అంకితమైన విద్యావేత్త. 1988లో ఆయన సహచరులతో కలిసి ‘‘స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ లడఖ్‌ ’’ ను స్థాపించారు. సంప్రదాయ విద్యా విధానంలో విఫలమైన, చదువు మానేసిన విద్యార్థులను తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. కంఠస్థం చేయించే విద్యకు బదులుగా సమస్యలను అర్థం చేసుకోవడం, స్వయంగా ప్రయోగాలు చేయడం, ప్రకృతితో మమేకమై నేర్చుకోవడం, సమాజానికి ఉపయోగపడే నైపుణ్యాలను పెంపొందించడం వంటి విధానాలను ఆయన అమలు చేశారు. లడఖ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్న సమయంలో సెక్మోల్‌ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు గణనీయమైన విజయాలు సాధించి, విద్యావేత్తల దృష్టిని ఆకర్షించారు. విద్య మార్కుల కోసం కాదు, జీవితానికి సిద్ధం చేసే ప్రక్రియ అని వాంగ్‌చుక్‌ ఆచరణలో నిరూపించారు. విద్యతో పాటు గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలోనూ విశేష కృషి చేశారు.

వాంగ్‌చుక్‌కు విద్యపై ఉన్న నిబద్ధత ఎంత గాఢమో, లడఖ్‌పై ఉన్న బాధ్యత కూడా అంతే గాఢమైనది. 2019 ఆగస్టు 5న కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ తరువాత లడఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంత హోదా వచ్చింది. అది లడఖ్‌ ఉద్ధరణకు కాకుండా, ఉన్న రక్షణలకు ఎగ్గొట్టి కార్పొరేట్లకు చోటిచ్చే ప్రయత్నమని యువత గ్రహించి, 2025 సెప్టెంబరులో ఆందోళనలకు దిగింది. ఆరో షెడ్యూల్‌ కింద రాజ్యాంగ రక్షణ, స్థానిక భూములు, ఉద్యోగాలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ వంటి హామీల అమలు గురించి ప్రశ్నించింది. మోడీ ప్రభుత్వం వారి న్యాయబద్ధమైన డిమాండ్లను పట్టించుకోకపోగా, ఆ ఆందోళన వెనుక కుట్రపూరిత ప్రణాళిక ఉందంటూ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టింది. తగిన సాక్ష్యాలు చూపలేక తరువాత కేసును ఉపసంహరించుకొంది. కానీ, ప్రభుత్వ కక్షకు బలై ఆయన 170 రోజులు జైల్లో మగ్గాల్సి వచ్చింది. విద్యారంగంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధతో వాంగ్‌చుక్‌ కాక్రోచ్‌ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు, యువత లేవనెత్తిన డిమాండ్ల సాధన కోసం జూన్‌ 28 నుంచి ఢిల్లీ జంతర్‌‌మంతర్‌ ‌వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. స్వాతంత్ర్యోద్యమం మనకు అందించిన సత్యాగ్రహం, నిరాహార దీక్ష వంటి ఆందోళనా పద్ధతులనే ఆయన ఎంచుకున్నారు. కానీ మోడీ–షా ప్రభుత్వం ఈ ఆందోళనను నిస్సిగ్గుగా నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో రైతుల ఉద్యమం పట్ల, రెజ్లింగ్‌ ‌యువతుల ఆందోళనల పట్ల వ్యవహరించినట్టే పట్టనితనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ 19 రోజుల దీక్షలో వాంగ్‌చుక్‌ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. 9 కిలోలకు పైగా బరువు తగ్గారు. అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా ప్రతిరోజూ వైద్య పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయినప్పటికీ, ఉద్యమం లేవనెత్తిన ప్రధాన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కనీసం పెదవి కూడా విప్పలేదు. బదులుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రభుత్వ అనుకూల భజనపరులు ఆయనపై వ్యక్తిగత దూషణలు, అపహాస్య వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణం, నీచం. దేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన సమయంలో, ఆయన వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు, మానవీయ సంస్కృతికి విరుద్ధం.

నీట్‌ అవకతవకలు కోట్లాది మంది విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ఆశలు, విద్యపై సమాజం పెట్టుకున్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. విచారణ కమిటీలు వేయడం మాత్రమే సరిపోదు. పరీక్షల భద్రత, పారదర్శకత, స్వతంత్ర పర్యవేక్షణ, సాంకేతిక సంస్కరణలు, బాధ్యులపై కఠిన చర్యలు, జవాబుదారీతనాన్ని నిర్ధారించే విధానాలు వెంటనే అమల్లోకి రావాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రభుత్వం విద్యార్థి, యువజన ప్రతినిధులతో చర్చలు ప్రారంభించి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. రోజురోజుకూ క్షీణిస్తున్న వాంగ్‌చుక్‌ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవప్రదమైన పరిష్కారం కనుగొని ఆయన నిరాహార దీక్షను విరమింపజేయాలి. ఒక విద్యావేత్త తన ప్రాణాన్నే పణంగా పెట్టి పోరాడుతుంటే, స్పందించడం ప్రభుత్వ కనీస బాధ్యత.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్