‘భగత్‌సింగ్ చరిత్ర ఆద్యంతం చైతన్య పూరితం. నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన వారు ఆయన చరిత్ర చదివితే చాలు... చటుక్కున లేస్తారు. పులిలా గర్జిస్తారు’ అంటారో రచయిత. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ‘భగత్‌సింగ్’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక నిరంతర చైతన్య తరంగం. 23 ఏళ్ల వయస్సులోనే మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన జెన్-జీ ఆయన. జాతీయ ఉద్యమంలో ఆయన రగిలించిన ఉద్యమ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న స్పష్టమైన ఆలోచనా దృక్పథం నేటికీ ఆచరణీయమే. ‘నన్ను చంపగలరు, కానీ నా ఆలోచనలను చంపలేరు. నా శరీరాన్ని నాశనం చేయగలరు, కానీ నా ఆత్మను కాదు’ అంటూ పిడికిలెత్తిన సమరశీలి భగత్‌సింగ్. బ్రిటిష్ వారి అణచివేత ధోరణి, అమాయక ప్రజల రక్తపాతానికి కారణమైన జలియన్ వాలాబాగ్ దురంతం- చిన్ననాడే భగత్‌సింగ్‌లోని దేశభక్తిని దృఢ సంకల్పంగా మార్చాయి. బ్రిటిష్ వారిని సాగనంపడానికి కేవలం వినతిపత్రాలు, శాంతియుత నిరసనలు మాత్రమే సరిపోవని నినదించాడు. ‘‘1929లో సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరిన ఘటన నాటి బ్రిటిష్ పాలకవర్గం నన్ను మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రతిఘటనను కలవరపరిచింది. ఎవరినీ చంపాలనేది తమ ఉద్దేశం కాదని, ‘చెవిటివారైన బ్రిటిష్ పాలకులకు వినపడటం కోసమే ఈ శబ్దం’ అని అసెంబ్లీ వేదికగా ప్రకటించి సరికొత్త పోరాట శైలిని ప్రపంచానికి చూపించాడు.
భగత్ సింగ్‌ను కేవలం ఆయుధాలు పట్టిన విప్లవకారుడిగానే చూస్తే ఆయన ఆలోచనా పటిమను తక్కువ అంచనా వేసినట్లే. ఆయన గొప్ప అధ్యయనశీలి, సమాజ శ్రేయస్సును కోరే ప్రజాస్వామ్యవాది. స్వాతంత్ర్యం అంటే కేవలం తెల్లవారి పాలన ముగిసి తెల్ల చొక్కాలు వేసుకున్న నల్లవారి పాలన రావడం కాదు. రాజకీయ స్వేచ్ఛతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం సాధ్యమైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని ఆయన బలంగా నమ్మారు. ‘మానవుడిచే మానవుడి దోపిడీ అంతమొందడమే విప్లవం’ అని స్పష్టం చేశారు. పేదరికం, ఆకలి, అజ్ఞానం, కులమతాల వివక్ష లేని సమాజమే ప్రజాస్వామ్యానికి పునాది అని చాటారు. సామ్రాజ్యవాదాన్ని ఎంతగా నిరసించారో, నాటి సామాజిక రుగ్మతలైన మూఢనమ్మకాలను, మతమౌఢ్యాన్ని అంతే తీవ్రంగా ఖండించారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి, శ్రామిక వర్గానికి ప్రాధాన్యత లభించే సోషలిస్ట్ ప్రజాస్వామ్యాన్ని ఆయన ఆకాంక్షించారు. భగత్ సింగ్ ఆలోచనలు నేటికీ ఎంతో ప్రాసంగికమైనవి. దేశంలో ప్రస్తుతమున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భగత్‌సింగ్ ఆదర్శాలను పునఃపరిశీలించుకోవడానికి సరైన సందర్భం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 28. యుఎన్‌ఎఫ్‌పిఎ అంచనా ప్రకారం... దేశంలో 15–24 ఏళ్ల యువత 25.7 కోట్ల మంది వున్నారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అత్యధికంగా నష్టపోయింది యువతే. విద్యావంతులైన యువతలో నిరుద్యోగం గతం కంటే మూడింతలు పెరిగింది. భగత్ సింగ్ కోరుకున్నట్లుగానే, నేటి యువత తమ సమస్యలకు గల మూల కారణాలను విశ్లేషించడం ప్రారంభించారు. సోషల్ మీడియాకే పరిమితం కాకుండా... ప్రత్యక్ష పోరాటాల వైపు, క్రియాశీలక ఉద్యమాల వైపు అడుగులు వేస్తున్నారు. సమస్యలపై గొంతుక విప్పే ధోరణి యువతలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈసారి భగత్‌సింగ్ జయంతిని కేవలం సంస్మరణ కార్యక్రమంగా కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు యువతను కదిలించే దిశగా వామపక్ష పార్టీలు సెప్టెంబర్ 28న ‘యూత్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. సిఇసి జ్ఞానేశ్ కుమార్ వైఖరి, ఓటర్ల జాబితాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వామపక్షాలు శ్రీకారం చుట్టాయి. ఫారం-6 నిబంధనలను కఠినతరం చేసి, జెన్-జీ ఓటర్లను అడ్డుకుంటున్న సిఇసి నిర్ణయం నేపథ్యంలో ‘యూత్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమం చేపట్టడం సముచిత నిర్ణయం. ప్రజాస్వామ్యంపై యువతలో నిరంతర చర్చ, ఎన్నికల ప్రక్రియపై అవగాహన, ఓటు హక్కు విలువ, రాజ్యాంగ హక్కులపై చైతన్యం, అధికార వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం, భిన్నాభిప్రాయాలను గౌరవించే సంస్కృతి... ఇవన్నీ బలపడినప్పుడే ఈ పిలుపు విస్తృతార్థాన్ని సంతరించుకుంటుంది. భగత్‌సింగ్ జయంతి మనకు ఇచ్చే అసలు సందేశం ఇదే. ప్రశ్నించే యువతే ప్రజాస్వామ్యానికి జీవం. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండని యువతే మార్పునకు పునాది. భగత్‌సింగ్‌ను స్మరించుకోవడం అంటే ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదు; ఆయన మాదిరిగా సమాజాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవడం. భగత్‌సింగ్ పేరును కేవలం ఒక్కరోజు స్మరణకే పరిమితం చేయకుండా, ఆయన ఆచరించిన ప్రశ్నించే తత్వాన్ని, యువత రాజకీయ చైతన్యాన్ని సమకాలీన ప్రజాస్వామ్య సమస్యలతో అనుసంధానించాలన్నదే ఈ పిలుపు ఉద్దేశం. భగత్ సింగ్ అన్నట్లు- ‘ఏ త్యాగమూ ఈ గొప్ప లక్ష్యం కంటే పెద్దది కాదు.’ ఆయన ఆశయాల స్ఫూర్తితో దేశ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించడమే నేటి యువత ఆయనకిచ్చే నిజమైన నివాళి.








కామెంట్‌లు (0)