శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెగనమ్మడమే లక్ష్యమా?

2 గంటల క్రితం

psu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

స్వాతంత్ర్యానంతరం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ) మరోసారి కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ విధానానికి బలికావడం ఆందోళన కలిగిస్తోంది. లాభాల్లో కొనసాగుతున్న, దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో సుమారు రూ.10 వేల కోట్ల విలువైన వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇదొక్కటే కాదు, హిందుస్తాన్ జింక్, ఐడిబిఐ బ్యాంక్, ఎన్‌హెచ్‌పీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాటాల విక్రయ ప్రక్రియ వేగవంతమవుతుండటం, ప్రభుత్వ ఆర్థిక విధానాల అసలు దిశ ఏమిటన్న చర్చకు దారితీస్తోంది. దేశ నిర్మాణంలో ప్రభుత్వరంగ సంస్థలు పోషించిన పాత్ర గొప్పది. ఉక్కు కర్మాగారాల నుంచి చమురు కంపెనీలు, విద్యుత్ ఉత్పత్తి నుంచి రైల్వేలు, బ్యాంకింగ్ నుంచి బీమా వరకు దేశ పారిశ్రామిక ఆర్థిక పునాదులను నిర్మించింది, నిలబెట్టిందీ ప్రభుత్వ రంగమే. ప్రైవేట్ పెట్టుబడిదారులు ముందుకు రాని రంగాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి బాటలు వేసింది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలకు, లక్ష‍లాదిమంది యువతకు స్థిరమైన ఉపాధిని కల్పించింది. లాభం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యంగా నిలిచింది.

ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం తాజాగా మరిన్ని సంస్థల్లో వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను కారుచౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో మొత్తం ఎనిమిది కీలక ప్రభుత్వ సంస్థలను తాజాగా గుర్తించింది. ఎల్‌ఐసి వాటాల విక్రయం ద్వారానే సుమారు రూ.10 వేల కోట్లు, హిందుస్థాన్ జింక్ ద్వారా మరో రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐడిబిఐ బ్యాంకులో మెజారిటీ వాటాల విక్రయానికి కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రభుత్వ వాటాలను క్రమంగా తగ్గించడం కేవలం ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు; అది ప్రభుత్వ పాత్రను కూడా మార్చే ప్రక్రియ. ప్రభుత్వానికి చెందిన వాటాలను విక్రయించడం ద్వారా తక్షణ ఆదాయం లభించవచ్చు. కానీ ఏటా డివిడెండ్లు, పన్నులు, ఉద్యోగాలు, వ్యూహాత్మక నియంత్రణ రూపంలో వచ్చే దీర్ఘకాలిక ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఎల్‌ఐసీ దేశంలో కోట్లాది కుటుంబాలకు భద్రత కల్పించిన సంస్థ ఇది. క్లెయిమ్‌ల పరిష్కారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రికార్డు వున్న సంస్థగా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల డివిడెండ్లు చెల్లించే ఈ సంస్థను తాత్కాలిక ఆదాయం కోసం వాటాల రూపంలో విక్రయించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఒకప్పుడు పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచిన ఐడిబిఐ, తర్వాత వాణిజ్య బ్యాంకుగా మారింది. ఇప్పుడు దానిలో ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటాలను విక్రయించేందుకు వరుస ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థిరమైన ఆదాయాన్నిచ్చే లాభదాయక సంస్థల్లో వాటాలను వదులుకోవడం దీర్ఘకాలంలో ప్రభుత్వ ఆదాయానికి నష్టదాయకమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హిందుస్తాన్ జింక్, ఎన్‌హెచ్‌పీసీ, కోల్ ఇండియా వంటి సంస్థలు, విద్యుత్, బొగ్గు, ఖనిజాలు వంటి రంగాలు దేశ ఆర్థిక స్వావలంబనకు పునాదులు. ఈ రంగాల్లో ప్రభుత్వ నియంత్రణ బలహీనపడితే దీర్ఘకాలంలో ధరల నియంత్రణ, వనరుల వినియోగం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రపంచ అనుభవం కూడా ఇదే చెబుతోంది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, సింగపూర్, నార్వే వంటి దేశాలు వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ యాజమాన్య సంస్థలను బలోపేతం చేస్తున్నాయి. చైనా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రపంచస్థాయి దిగ్గజాలుగా తీర్చిదిద్దింది. కానీ భారతదేశంలో మాత్రం లాభాల్లో ఉన్న సంస్థలనే క్రమంగా విక్రయించే దిశగా అడుగులు వేయడం శోచనీయం. ప్రభుత్వ రంగ సంస్థలు కేవలం ఆర్థిక ఆస్తులు కావు; అవి దేశ సామాజిక భద్రత, ప్రాంతీయ సమతుల్యత, ఉపాధి, ప్రజా సంక్షేమానికి పునాదులు. వాటిని బలోపేతం చేయడం, ఆధునీకరించడం, పారదర్శకత పెంచడం, సమర్థతను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత. బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం కంటే, వాటి సామర్థ్యాన్ని పెంచి మరింత ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అన్వేషించడం సముచితం. ప్రభుత్వ సంస్థలు దేశ ఖజానాకు ఏటా లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, వాటి పరిమాణాన్ని కుదించడం, వాటాలను అమ్మడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. దేశ ఆర్థిక స్వావలంబన, వ్యూహాత్మక భద్రత, సామాజిక బాధ్యత, ప్రజల విశ్వాసం అనే ఈ నాలుగు స్తంభాల మీదే ప్రభుత్వ రంగ వ్యవస్థ నిలిచి ఉంది. వీటిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత కూడా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్