- ఎల్‌నినో నేపథ్యంలో తెర మీదికి అల్మట్టి ఎత్తు పెంపు
- లిఫ్టులతో దిగువకు నీరు రాకుండా కర్ణాటక అడ్డుగోడ
- రాజకీయ చదరంగంలో ఎపి హక్కులు గాలికి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా నదీ పరీవాహ ప్రాంతంలో వర్షాల్లేక, జలాశయాల్లో నీరు అడుగంటి, సాగు, తాగునీరు, చివరికి పశుగ్రాసానికి సైతం తీవ్ర ఇబ్బందులెదురైన వేళ మరొకసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు తెరమీదికొచ్చింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, కృష్ణా జలాల వివాద ట్రిబ్యునళ్లను, న్యాయ స్థానాలను, అంతర్రాష్ట్ర ఒప్పందాలను పక్కకునెట్టి ఎగువనున్న కర్ణాటక నీటి దారి మళ్లింపునకు పాల్పడుతుండటంతో దిగువకు నీరు రావడం గగనమవుతోంది. వరదలొస్తేనే కిందికి నీరు. లేకుంటే పై నీళ్లు పైకేనన్నట్లుంది. మామూలు రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఆల్మట్టి ఎత్తు ఇంకా పెంచితే, కరువు, కాటకాలొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితేంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు కనుక పెంచితే వరద జలాల మాటేమో, నికర జలాలకే ఎసరు వస్తుందన్న భయాలు అలముకుంటున్నాయి. వర్షాభావం నేపథ్యంలో ప్రాజెక్టులు నిండితేనే పంటల సాగు అన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలతో రైతులు, ప్రజలు భవిష్యత్తుపై మరింత వేదన చెందుతున్నారు.
వడి వడిగా...
కృష్ణా జలాల వివాదాలపై ఏర్పడిన బ్రిజెష్ కుమార్ ట్రిబునల్ ఎదుట ఉమ్మడి ఎపి మన హక్కుల పరిరక్షణకు సరైన వాదనలు వినిపించనందున నీటి లభ్యతను 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించి లెక్కలుకట్టడంతో ఎపికి నికర జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న అభ్రిపాయం ఆనాడే బలంగా ఏర్పడింది. నికర జలాలను మహారాష్ట్రకు 500 టిఎంసిల నుంచి 666 టిఎంసిలకు, కర్ణాటక 700 టిఎంసిల నుంచి 907 టిఎంసి, ఎపి 800 టిఎంసి నుంచి 1001 టిఎంసిలకు పెంచింది. వరద జలాలను మొదటి ట్రిబ్యునల్ బచావత్ దిగువ రాష్ట్రమైన ఎపికి వదిలిపెట్టింది. బ్రిజెష్ కుమార్ వరద జలాలనూ మహారాష్ట్రకు 81 టిఎంసి, కర్ణాటక 173 టిఎంసి, ఎపికి 194 టిఎంసి వంతున పంచారు. కోర్టులలో కేసుల వలన బ్రిజెష్ తీర్పు అమలు ప్రస్తుతానికి నిలిచిపోయినప్పటికీ భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేం. తనకు అనుకూలంగా బ్రిజెష్ తీర్పు రావడంతో ఆ ఊపులో కర్ణాటక తనకు అదనంగా కేటాయించిన వరద జలాలు 173 టిఎంసిలలో 130 టిఎంసిలను ఆల్మట్టి ఎత్తును పెంచడం ద్వారా వాడుకోవాలని నిశ్చయించింది. అప్పర్ కృష్ణా స్టేజి-3 పేరిట ఆల్మట్టి ఎత్తును ప్రస్తుతం ఉన్న 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు గతేడాది అన్ని పరిపాలనా అనుమతులూ ఇచ్చింది. సుమారు 1.38 లక్షల ఎకరాలను ఒకే దశలో సేకరించాలని, అందుకయ్యే రూ.70 వేల కోట్లను మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. నిర్వాసిత 22 గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తోంది. ఇప్పటికే రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని వార్తలొస్తున్నాయి. ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచితే ఇప్పుడు 123 టిఎంసిలు కాస్తా దాదాపు 300 టిఎంసిల నిల్వకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ఇప్పటికే కర్ణాటక సుమారు పది వరకు లిఫ్టు పథకాల ద్వారా తాగునీటి, సాగునీటి పేరుతో అదనంగా 30-40 టిఎంసిలు పైనే తోడేస్తోంది. ఆల్మట్టిలోకి చేరే ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు తోడేస్తోంది. దాంతో వరదలొచ్చి ప్రాజెక్టు గేట్లు ఎత్తితేనే కిందికి నీరు వస్తుంది. ఎల్‌నినో సంవత్సరంలోనూ వచ్చిన కొద్దిపాటి ఇన్‌ఫ్లోను ఆ విధంగానే తోడినట్లు సమాచారం.
పరస్పర నెపాలతో ఎపి, తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఎపి మధ్య పునర్‌పంపిణీ చేయడం న్యాయం. కానీ కేంద్రం అందుకు సుతరం ఇష్టపడట్లేదు. దాంతో ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టిఎంసిలను 2015లో ఆనాడున్న అవగాహన మేరకు 66, 34 నిష్పత్తిలో ఎపికి 512 టిఎంసి, తెలంగాణాకు 299 టిఎంసిల చొప్పున తాత్కాలిక ఒడంబడిక కుదిరింది. తొలుత తమకు 50 శాతం వాటా కావాలన్న తెలంగాణ, ఇప్పుడు రాష్ట్రంలో నది ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నందున తమకు 70 శాతం వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక జల మళ్లింపులను, ప్రమాదకర ఆల్మట్టి ఎత్తు పెంపును, మధ్యలో తమాషా చూస్తున్న కేంద్రాన్ని వదిలిపెట్టి రెండు తెలుగు రాష్ట్రాలు తమలో తాము కీచులాడుకోవడం వలన తెలుగు ప్రజలకు తీరని నష్టమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పొలిటికల్ గేమ్
ఆల్మట్టి ఎత్తు సహా కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై మోడీ ప్రభుత్వం రాజకీయమే చేస్తోంది. నాటి కర్ణాటక బిజెపి ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టును చేపడితే తమకు నష్టం వాటిల్లుతుందని రాయలసీమ రైతాంగం, ప్రజలు ఆందోళనలు చేశారు. అదే సమయంలో 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ అప్పర్ భద్రకు రూ.5,300 కోట్లకు హామీ ఇవ్వడంతోపాటు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తామమన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు ఉద్దేశించిన అప్పర్ కృష్ణా స్టేజ్-3 కి సైతం రూ.5 వేల కోట్లు ప్రకటించారు. కర్ణాటకలో బిజెపి గెలుపు కోసం ఎపి, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు ఒడిగట్టారు. ఆల్మట్టి పెంపు, అక్రమంగా లిఫ్టులతో నీటి తోడకంపై తెలంగాణ ప్రభుత్వం అంటిముట్టనుంది. అందుక్కారణం కర్ణాటక, తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉండటమే. అధికారంలో ఉన్నప్పుడు బిఆర్‌ఎస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. నెల క్రితం తుంగభద్ర గేట్ల రీప్లేస్ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డికె శివకుమార్, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఒకే వేదికను పంచుకున్నా ఆల్మట్టి ఎత్తుపెంపుపై చర్చించలేదు. రెండేళ్లల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలున్నాయి. బిజెపి గెలుపునకు ప్రధాని మోడీ మరొకసారి కర్ణాటకకు వరాలు ప్రసాదించే అవకాశం ఉంది. కూటమిలోనే ఉన్న చంద్రబాబు, అక్కడ కాంగ్రెస్‌కు దెబ్బ తగలకుండా ఉండేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటకలో బిజెపి గెలుపు కోసం ఎపి, తెలంగాణాలోని బిజెపి, జనసేన మూగనోము పడతాయని పూర్వ అనుభవం నుంచి తెలుస్తుంది. ఏతావాతా ఎపి, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే నష్టమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.






కామెంట్‌లు (0)