బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళకు భద్రత కరువు

56 నిమిషాల క్రితం

rape
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:53 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వరుస సంఘటనలు, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న దారుణాలూ మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బేటీ బచావో-బేటీ పడావో అన్న మోడీ నినాదం మాటలకే పరిమితమై, ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట బాలికల, మహిళల గౌరవానికి భంగం కలిగించే దుష్కృత్యాలు సాగుతూనే ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసానికి, సౌభ్రాతృత్వ భావనకూ నిలయాలుగా వర్ధిల్లాల్సిన విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో సైతం అమ్మాయిలపై అఘాయిత్యాలూ, ఆత్మగౌరవానికి భంగం కలిగించే దూషణలూ చోటు చేసుకోవటం ఆందోళనకరం. సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు గంభీర ఉపన్యాసాలకే నాయకులు పరిమితం కావటం, ఆనక ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం ఈ ఘోరాలు మళ్లీ మళ్లీ జరగటానికి కారణం. ఇలాంటి అకృత్యాలు దేశ గౌరవానికి సిగ్గుచేటు.

​దేశ రాజధాని ఢిల్లీలో ఈ సెప్టెంబరు నెలలోనే పదికిపైగా అత్యాచార సంఘటనలు వెలుగులోకి రావటం పేట్రేగిపోతున్న దుర్మార్గానికి నిదర్శనం. కదులుతున్న బస్సుల్లో అమ్మాయిల పట్ల వేధింపులూ, లైంగిక దాడులూ జరిగినా ఇంతవరకూ తగు నియంత్రణా చర్యలు చేపట్టకపోవటం దారుణం. దేశ రక్షణకు, భద్రతకు చట్టాలూ, విధానాలూ రూపుదిద్దుకునే ఢిల్లీలోనే ఇలాంటి దుష్కృత్యాలు పునరావృతం కావటం ఆక్షేపణీయం, అవమానకరం. సెప్టెంబరు పదో తేదీన ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. తరువాత ప్రతి రెండు, మూడు రోజులకు ఒక్కో దారుణం జరుగుతూనే ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు దీనిపై స్పందించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వీధి దీపాలు సరిగ్గా లేకపోవటం, నిఘా కెమెరాలు చాలా చోట్ల లేకపోవటం, ఉన్న ప్రధాన కూడళ్లలో సైతం నెలల తరబడి పనిచేయకపోవటం, పర్యవేక్షణ కొరవడటం వంటి తీవ్ర భద్రతా లోపాలు ఈ సందర్భంగా చర్చలోకి వచ్చాయి. నిర్భయ సంఘటన మొదలు అనేక సందర్భాల్లో తీవ్ర ఆందోళనలు జరిగిన ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే- దేశంలోని మిగతా నగరాల్లో, పట్టణాల్లో పరిస్థితి ఏమిటి?

ఈ నెల 27వ తేదీన పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగించాయి. హాస్టల్‌ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న సమాచారం బయటికి వచ్చినా యాజమాన్యం స్పందించకపోవటం, సోషల్‌ మీడియాలో అది దావానలంలా పాకి విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు చోటుచేసుకోవటంతో వరస పరిణామాలు సంభవించాయి. యాజమాన్యం తన ధోరణిని సమర్థించుకోవటానికే ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యార్థులు రోడ్డెక్కి 15 గంటల పాటు హైవేను దిగ్బంధనం చేశారు. ఆ తరువాత యాజమాన్యం ఇద్దరు విద్యార్థినుల చేత బలవంతంగా క్యాంపస్‌లో ఎలాంటి అకృత్యం జరగలేదని వీడియో చేయించి, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటం అనుమానాలను మరింత పెంచింది. రక్షణ, భద్రత కల్పించాల్సిన విద్యాలయాలు, ప్రభుత్వాలూ నమ్మకం కోల్పోయినప్పుడు పౌరుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆందోళన తరువాత ప్లంబరుని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఇతర ఆధారాలు ఏవీ తమ ప్రాథమిక దర్యాప్తులో లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తమ సంస్థల పరువు, వ్యాపార విలువ పడిపోతుందనే భయానికి కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రాధాన్యం ఇస్తాయన్న విమర్శకు లవ్లీ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహార తీరు బలం చేకూర్చింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఏం జరిగిందో నిజానిజాలు వెలికితీయాలి.

బీహార్‌లో కొద్దిరోజుల వ్యవధిలోనే ఒకే రకమైన నాలుగైదు సంఘటనలు వెలుగు చూశాయి. కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికెళ్తున్న విద్యార్థినిని చుట్టుముట్టిన గ్యాంగ్‌ అసభ్యంగా ప్రవర్తించటం, ఆ బాలికను ఎత్తుకొని పోవటానికి ప్రయత్నించటం వీడియోలో రికార్డయింది. ఆ తరువాత కూడా బాలికల పట్ల ఇలాగే వ్యవహరించిన మరికొన్ని సంఘటనలు జరిగాయి. ఇవన్నీ పోకిరీ ముఠాలే రికార్డు చేసి, పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించటం భయం లేని తనానికి రుజువు. వీడియోల కారణంగానే ఈ సంఘటనలు బయటికి తెలిశాయి. బయటికి రాని దుర్మార్గాలు ఇంకెన్నో! కంచె చేను మేసిన సంఘటన సెప్టెంబరు 23న ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కొంతమంది సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులు కలిసి ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. బాధిత మహిళ వాళ్లను తప్పించుకొని గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పోలీసులకు తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది.

మహిళల భద్రత పైనా, ఆత్మగౌరవం పైనా కనీస భరోసా లేకపోవటం, వారిని మనుషులుగా చూడాల్సిన, ప్రవర్తించాల్సిన నాగరిక లక్షణం లోపించటం... ఇలాంటి దారుణాలకు బీజం వేస్తున్నాయి. మార్కెట్‌ వ్యవస్థ మహిళలను సరుకుగా చిత్రీకరించటం, మతోన్మాద సంస్థలు పితృస్వామిక భావజాలంతో విలువలను ప్రవచించటం కూడా ఈ పెడధోరణికి ఆజ్యం పోస్తున్నాయి. తమను తాము సంస్కృతీ పరిరక్షకులుగా చెప్పుకునే మతతత్వ ముఠాలు సోషల్‌ మీడియాలో విద్వేషాన్ని రగిలించటం, మహిళల ఆధునిక ఆలోచనలపై తీవ్రంగా దూషణలకు పాల్పడడం పనిగా పెట్టుకున్నాయి. మహిళలను తోటి మనుషులుగా, స్వీయాలోచనాపరులుగా చూడలేని మనువాద, మార్కెట్‌ భావజాలాల సమూల నిర్మూలనే ఈ దుర్మార్గాలకు పరిష్కారం. ఈలోగా పాలకులు మహిళలకు తగు భద్రత, రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలి. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించి, దుర్మార్గులకు శిక్ష, బాధితులకు ఓదార్పూ దక్కుతుందన్న భరోసా కల్పించాలి. ఆ దిశగా పాలనా వ్యవస్థలు కదిలేలా పౌర సమాజం ఉమ్మడి స్వరంతో ఉద్యమించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్