కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయ సాధనలు, పిల్లల పెంపకం, కెరీర్ బాధ్యతలతో సతమతం అవుతున్న మహిళలకు తమ వ్యక్తిగత ఆరోగ్యం, ఫిట్‌నెస్, శ్రేయస్సు పట్ల ఆలోచించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుల పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఏట సెప్టెంబర్ చివరి బుధవారం రోజున (సెప్టెంబర్ 30న) “జాతీయ మహిళా ఆరోగ్యం - ఫిట్‌నెస్ దినోత్సవం ” పాటించడం ఆనవాయితీగా మారింది. మహిళా ఆరోగ్యం చాలా సంక్లిష్టతతో, పలు సవాళ్ల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. మహిళలకు కౌమార దశ నుంచి వృద్ధాప్యం వరకు గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం, రుతు స్రావ సమస్యలు, మెనోపాజ్ సమస్యలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. దీనికి తోడుగా ఆందోళన, నిరాశ, ఒత్తిడులు, పని ఆధార ఒత్తిడులు, సామాజిక కట్టుబాట్లకు లోనవుతూనే ఉంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మహిళలకు అనారోగ్యం, శారీరక సమస్యలు, మానసిక ఉద్రేకాలు, భావోద్వేగ సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి తగు సమాధానాలను నిరంతరం ప్రచారం చేయాలి. మహిళలు తమ పని ఒత్తిడిలో తగు పోషకాహారాన్ని తీసుకోవడంలో విఫలమవుతుంటారు. అందరూ తిన్న తర్వాత మింగిన దానిని తిని తమ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారు. సమతుల పోషకాహారం తీసుకోవడం, పోషకాహార లోపాలను గమనించి ఆహార అలవాట్లు మార్చుకోవడం, ప్రతి రోజు తగు నీటిని తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పోషకాహారాన్ని మాత్రమే తయారు చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్ వాడకాన్ని తగ్గించడం, శరీర స్వభావాన్ని బట్టి ఆహారం ఎంపిక చేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మహిళలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మానసిక వికాసానికి అవసరమైన వ్యాయామాలు, ఒత్తిడి నియంత్రణ, మానసిక స్పష్టత, నిద్రలేమి సమస్యను దూరం చేయడం, ఆశావహ సామాజిక సంబంధాలను నెలకొల్పడం, నిలకడను పెంచుకోవడం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో పాటుగా , ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి.
- డా. బి. మధుసూదన్ రెడ్డి,
సెల్: 9949700037.







కామెంట్‌లు (0)