గత వారంలో మూడు రోజుల పాటు చైనా అధినేత సీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన జరిపారు. అసాధారణ రీతిలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయం వెళ్లి మరీ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకటంతో అమెరికా, యావత్ ప్రపంచ మీడియా కూడా దానికి ఎంతో ప్రాచుర్యం కల్పించింది. దీర్ఘకాలం తరువాత చైనా అధినేత అమెరికా పర్యటన జరిపాడు. అప్పటికీ ఇప్పటికీ రెండు దేశాలలో ఎన్నో మార్పులు జరిగాయి. అనేక రంగాలలో అమెరికా బలహీనపడగా చైనా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఉభయ నేతలు భిన్నమైన తమ ప్రాధాన్యతలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణమిది. అయితే అది ఎక్కడా బహిరంగ ప్రకటనల్లో కనిపించదు.
సీ జిన్‌పింగ్ పర్యటనలో ఎనిమిది అంశాలపై ఏకీభావం కుదిరిందని శనివారం నాడు చైనా ప్రకటించింది. పరస్పర గౌరవం, అరమరికలు లేకుండా ఉభయ దేశాల సంబంధాలను నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. ఒక పక్షం గెలిచింది, ఒక పక్షం ఓడింది అన్నట్లుగాక ఉభయులు లబ్ధి పొందేందుకు అంగీకరించారు. అయితే గత చరిత్ర, అనుభవాన్ని బట్టి అమెరికా దీనికి కట్టుబడి ఉంటుందా అన్న ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అమెరికాకు అగ్రస్థానం అన్న ట్రంప్ లక్ష్యం నెరవేరాలంటే ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నించకుండా సాధ్యం కాదు. దానిలో భాగంగా అన్ని దేశాల మీద పన్నుల కొరడా ఝళిపిస్తానంటూ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరిచ్చే మర్యాదకు ప్రతిగా మేము కూడా చేస్తామని చైనా హెచ్చరించటంతో అమెరికా వెనకడుగు వేయాల్సి వచ్చింది. అది వ్యూహాత్మకమా, దానికి శక్తి లేకనా అన్నది ముందు ముందు తెలుస్తుంది. అణ్వాయుధాలను సమకూర్చుకోబోమన్న అంగీకారాన్ని ఇరాన్ అమలు చేయాలని ఇద్దరు నేతలూ ఆకాంక్షించారు. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో ఏ దేశమూ లేదా సంస్థ కూడా నౌకల రాకపోకల పన్ను వసూలు చేయకూడదని కూడా ఏకీభావంతో వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా, అమెరికా రెండూ మిత్రదేశాలుగా విజయం కోసం పోరాడిన అంశాన్ని గుర్తు చేసుకొని '' టోక్యో విచారణ'' కు ఎనభై సంవత్సరాలు నిండుతున్నాయని, భద్రతా మండలి శాశ్వత సభ్య రాజ్యాలుగా ఉన్న చైనా, అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నెలకొన్న ప్రపంచ వ్యవస్ధకు ఇరు దేశాలూ కట్టుబడి ఉండాలని, మరోసారి సైనికవాదం తలెత్తకుండా చూడాలని అభిప్రాయపడ్డారు (జపాన్ రాజ్యాంగాన్ని మార్చుకొని ఆత్మరక్షణ దళాల స్థానంలో పూర్తి స్థాయి మిలిటరీని సమకూర్చుకోవాలని చూడడాన్ని, అది అమెరికా మిత్ర దేశంగా ఉన్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం). వాణిజ్య విషయానికి వస్తే ఉభయ దేశాల బృందాల చర్చలలో ముందుకు వచ్చిన వాణిజ్య మండలి, 30 బిలియన్ డాలర్ల వంతున ఇరు దేశాలూ పన్నుల తగ్గింపు అమలుకు పూనుకోవాలని కూడా ట్రంప్- జిన్‌పింగ్ అంగీకరించారు. కృత్రిమ మేథ (ఏఐ) సంబంధిత ముప్పు-లాభాల గురించి అభిప్రాయ మార్పిడికి ఒక యంత్రాంగాన్ని నవంబరు నాటికి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
ఇరు దేశాల నేతల మధ్య వాషింగ్టన్‌లో జరిగిన చర్చలలో ఇరాన్-అమెరికా చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని జిన్‌పింగ్ ఆకాంక్షించారు. ఇరాన్ మీద వత్తిడి తేవాలని కోరిన ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. ప్రస్తుత వివాదం మరింత విస్తరించకుండా ఉండాలని ఈజిప్టుతో సహా మధ్య ప్రాచ్యదేశాలే కాదు, ఐరోపా కూడా కోరుకుంటున్నది. సీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన పర్యవసానాలు ఐరోపా మీద కూడా పడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం కావటంలో ఐరోపా ఇస్తున్న ప్రాధాన్యత చైనా-అమెరికాలకు లేదు. మధ్యంతర ఎన్నికలకు ముందు వాణిజ్య వ్యవహారాల్లో చైనా మనస్సు కరగాలని అమెరికా కోరుకుంటున్నది. మరోవైపు ఐరోపా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రోజుకు ఒక బిలియన్ యూరోల వాణిజ్య లోటు చైనాతో పెరుగుతున్నదని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ చెప్పిన అంశం తెలిసిందే.
తైవాన్ సమస్యపై వాషింగ్టన్ నిరంతరం బీజింగ్‌ను ఒకవైపు రెచ్చగొడుతూనే మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నది. అయితే సీ జిన్‌పింగ్ ఎన్నడూ తైవాన్ విషయంలో రాజీ వైఖరిని ప్రదర్శించలేదు. చైనాతో ఎలా వ్యవహరించాలన్న అంశంలో అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినపుడు బీజింగ్ తమకు వ్యూహాత్మక పోటీదారు అని ప్రకటించాడు. అది జనాలకు అంతుబట్టని ఒక బ్రహ్మ పదార్ధంగా ఉంది. ఇటీవలి వైఖరిని చూస్తే ఉభయ దేశాల సంబంధాలు జి 2 ( రెండు దేశాల బృందం)గా ఉండేందుకు సిద్ధం అన్న సంకేతాలు ఉన్నాయి.
ప్రచ్చన్న యుద్ధ సమయంలో అమెరికా-ఐరోపాల మధ్య ఉన్న సంబంధాల కారణంగా సోవియట్‌కు వ్యతిరేకంగా పోరాడాలనే వైఖరిని జనంలో కలిగించటంలో అమెరికా సఫలమైంది. కానీ చైనా విషయంలో అది సాధ్యం కావటం లేదు. గత నాలుగున్నర దశాబ్దాలుగా చైనా వస్తువులు ప్రవేశించని ఐరోపా మార్కెట్ లేదు, అమెరికా సరేసరి. చైనా తమ సైద్ధాంతిక శత్రువుగా ఆ దేశాల వారు చూడటం లేదు. సోవియట్ ప్రభావాన్ని అదుపు చేయాలన్నట్లు చైనా విషయంలో ఏ నాయకుడు కూడా సిద్ధాంతాలను ముందుకు తేలేదు. ఒక స్నేహితుడిగా ఉండటం ఒక గౌరవంగా పరిగణిస్తానని ట్రంప్ చెప్పాడు. అమెరికా ప్రారంభించిన వాణిజ్య పోరులో మొత్తం మీద విజేత చైనా, నష్టపోయింది అమెరికా. గతేడాది ఫిబ్రవరి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య అమెరికన్లు ఏ అంశం మీద స్పందిస్తున్నారో తెలుసుకొనేందుకు పరిశోధనా సంస్థ ‘పూ’ చేసిన సర్వేలో పన్నెండు నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు తట్టుకోలేకపోతున్నామని చెప్పిన వారు 67 నుంచి 73 శాతానికి, ద్రవ్యోల్బణంపై 63 నుంచి 66కు, ఫెడరల్ బడ్జెట్ లోటుపై 57 నుంచి 64, నిరుద్యోగంపై 25 నుంచి 36 శాతానికి పెరిగారు. ఈ నేపథ్యంలో చైనా మీద జబ్బ చరిచేందుకు... దెబ్బ తీస్తానని, విజయం సాధిస్తామని చెప్పేందుకు ఏ నేత అయినా సాహసించగలడా ! పెట్టుబడిదారీ విధానాన్ని ఎలాగైనా నిలబెట్టాలని చూస్తున్నది అమెరికా పాలకవర్గం. సోషలిజాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకున్నది చైనా కమ్యూనిస్టు పార్టీ. రెండు విరుద్ధ శక్తులు ఘర్షణ పడాలి కదా, ఎందుకు అలా జరగటం లేదన్నది కొందరి ప్రశ్న. పెట్టుబడిదారీ వర్గం వందల సంవత్సరాల అనుభవంతో మౌలిక స్వభావాన్ని అట్టేపెట్టుకొని అనేక ఎత్తుగడలను అనుసరిస్తున్నది. ఆ వర్గం స్థానంలో దోపిడీ లేని శ్రామికవర్గ వ్యవస్థ కోసం పోరాడుతున్న శక్తులు కూడా అదే విధంగా వ్యవహరించకూడదు ?

ఎం. కోటేశ్వరరావు







కామెంట్‌లు (0)