బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇంకా కొంప ‘కొల్లేరు’ చేయకండి

1 గంట క్రితం

cpm team -kolleru.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 06:34 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

కొల్లేరు! కృష్ణా-గోదావరి నదుల మధ్య బేసిన్‌గా ఏర్పడ్డ సహజ సిద్ధమైన, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మంచినీటి సరస్సు. ఏ సరస్సులోనూ లేని విధంగా కొల్లేరు సరస్సు మధ్యలో 46 గ్రామాలు (బెడ్‌) ఉండడం దీని ప్రత్యేకత. సరస్సు వెంబడి (బెల్టు) 31 గ్రామాలున్నాయి. వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఒరిస్సా నుండి కొల్లేటి కోట రక్షణ నిమిత్తం బలాఢ్యులైన వారిని తీసుకొచ్చారు. వారే కొల్లేరు గ్రామాల్లో అత్యధిక జనాభాగల వడ్డెర (బిసి) సామాజిక తరగతివారు. వీరితో పాటు స్థానిక దళితులు, ఇతర సామాజిక తరగతుల వారు ఈ గ్రామాల్లో తరతరాలుగా నివసిస్తున్నారు. కొల్లేరు ఒకప్పుడు గొప్ప ధాన్యాగారం. భూస్వాములకు, ఇంజన్‌దార్లకు సిరుల పంట పండింది. కాని వరుస తుఫాన్లు, వరదలతో తీవ్రంగా పంట నష్టాలు, మరణాలు సంభవించేవి. సరస్సు మధ్య దిబ్బల్లో, లంకల్లో ప్రజలు నాడు విష సర్పాల మధ్య అత్యంత ప్రమాదకర అనాగరిక గోచీ జీవితం గడిపేవారు. ఆ చీకటి బతుకుల్లో ఆకలి నిత్యం వెన్నంటే వుండేది. రాను రాను ముంపు ఎక్కువై కొల్లేరు భూములు వరి సేద్యానికి పనికిరాకుండా పోయాయి. రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు, గుండేరు లాంటి 60కి పైగా ఏర్లు, చిన్న చిన్న నదులు, కాలువలు, డ్రెయిన్ల ద్వారా వేలాది క్యూసెక్కుల నీరు వచ్చి చేరేది. ముంపు నీరు (1,25,000 క్యూసెక్కులు) బయటకుపోయే అతి చిన్నమార్గం ఉప్పుటేరు (7-10 వేల క్యూసెక్కులు) ఒక్కటి మాత్రమే. ముంపు సమయంలో వారాలు, నెలల తరబడి జల దిగ్బంధంలో ఉండేది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. కొల్లేరు జన జీవితం అత్యంత దయనీయంగా, ప్రమాద భరితంగా ఉండేది.

తవ్వించిందీ వారే... కొట్టేసిందీ వారే...

జలగం వెంగళరావు 1976లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు విడతలుగా స్కీమ్‌ల కింద 126 సొసైటీలు ఏర్పాటు చేశారు (బిసి-65, ఎస్సీ-73, ఇతర పేదలు-8). 5,500 పైగా ఎకరాల్లో చేపల చెరువులు తవ్వించారు. సరస్సులో సహజసిద్ధ చేపల వేటతో పాటు చేపల చెరువుల కుటుంబ వాటాల ఆదాయం తోడైంది. కొల్లేటి వాసులు జీవితాల్లో కొద్దిగా మార్పు వచ్చింది. రాను రాను తుఫాన్లు, ముంపుతో సొసైటీలు వరుస నష్టాలపాలై అప్పుల ఊబిలోకి వెళ్ళాయి. చేపల సాగు పెట్టుబడి ఖర్చులు లక్షల్లో పెరగడంతో పేదలు సాగు చేయలేని స్థితికి నెట్టబడ్డారు. సొసైటీలు అప్పులపాలయ్యాయి.

సొసైటీల అప్పులు తీర్చేలా ప్రభుత్వమే లీజుదారులను ప్రవేశపెట్టింది. ప్రోత్సహించింది. వచ్చిన లీజు ఆదాయం గ్రామం అంతా వాటాలుగా పంచుకునేవారు. పనులకు వెళ్ళి కొంత ఆదాయం సమకూర్చుకునే వారు. కుటుంబ జీవన స్థితిగతులు కొంత మెరుగుపడ్డాయి. వెలుగును చూశారు. దీంతో సామాజిక, రాజకీయ వివక్ష పడగ విప్పింది. 2006 సంవత్సరంలో ''కొల్లేరు ఆపరేషన్‌'' పేరుతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించి, అరెస్టులు చేసి, చెరువులు ధ్వంసం చేసింది. కొల్లేరు వాసుల జీవితం నాశనం చేసింది.1999లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొల్లేరు వాసులకు ఉరితాడు, మెడ మీద కత్తి లాంటి 120 జివో తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో ధ్వంసం చేయబడ్డ చెరువుల్లో ప్రభుత్వమే ఇచ్చిన సొసైటీలు, జిరాయితీ పట్టా భూములు, గ్రామం సమిష్టిగా అనుభవిస్తున్న గ్రామ కంఠ భూములువున్నాయి. కొల్లేరు ఆపరేషన్‌లో కొల్లేరు పేదలు, సొసైటీలు, జిరాయితీ రైతులు, వృత్తిదారులు, ఆక్వా అనుబంధ పరిశ్రమల వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు. వేలాది మంది వలసబాట పట్టారు. వాస్తవం ఇది కాగా నాటి ప్రభుత్వం కొల్లేటి వాసులను దొంగలుగా చిత్రించడం దుర్మార్గం. తన్ని, జైల్లో పెట్టి చెరువులు తవ్వించిన ప్రభుత్వమే తిరిగి తన్ని, జైల్లో పెట్టి చెరువులు ధ్వంసం చేసింది.

పెనం మీద నుండి పొయ్యిలోకి

ఇంతటితో ఆగలేదు. 1999లో 120 జివోలో సరస్సు 5వ కాంటూరు (సముద్ర మట్టానికి 5 అడుగులు) వరకు 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా చూపించారు. (ఇందులో 15 వేల ప్రైవేటు జిరాయితీ, 5,500 సైసైటీలు) 9 మండలాలు, 77 గ్రామాలు. పాత కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2002లో చిత్తడి నేలగా కేంద్రం ప్రకటించింది (చిత్తడి నేలల పరిధి 122 గ్రామాలు). అంటే 10వ కాంటూరు వరకు పశ్చిమాన కలపర్రు, తూర్పున గణపవరం, దక్షిణాన కోరుకొల్లు (కలిదిండి), ఉత్తరాన నారాయణపురం 2.26 లక్షల ఎకరాలు చిత్తడి నేలలు, పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించారు. ఇందులో జిరాయితీ పట్టా, ప్రయివేటు భూములు 1.63 లక్షల ఎకరాల వరకు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో (5 మండలాలు) పెంటపాడు, గణపవరం, ఉండి, కాళ్ళ, ఆకివీడు మండలాల్లోని 31 గ్రామాలు, ఏలూరు జిల్లాలో కలిదిండి, కైకలూరు, మండవల్లి, ఏలూరు, పెదవేగి, పెదపాడు, దెందులూరు, భీమడోలు, ద్వారకా తిరుమల, ఉంగుటూరు, నిడమర్రు (11 మండలాలు), కృష్ణా జిల్లాల్లో (2 మండలాలు) గుడివాడ, నందివాడ. మొత్తం 18 మండలాల్లో 206 పైగా గ్రామాల్లో 22 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆంక్షల పరిధిలోకి నెట్టివేయబడతారు. కడగండ్ల పాలవుతారు. 10వ కాంటూరు వరకు సరిహద్దులు 2 నెలల్లో గుర్తింపు పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆఘమేఘాల మీద ఇచ్చిన ఉత్తర్వులు కొల్లేరు వాసుల్లో, పేదల్లో, జిరాయితీ రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

సున్నిత ప్రాంతంలో ఇవీ ఆంక్షలు

పర్యావరణ సున్నిత ప్రాంతమంటే ఇళ్ళు, భవనాలు, రోడ్లు, మంచినీటి ట్యాంకులు, ఆసుపత్రులు, స్కూలు భవనాలు లాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. రిపేర్లకు సైతం అనుమతులుండాలి. కొత్త పరిశ్రమల స్థాపన, పాతవాటి విస్తరణకు అనుమతి లేదు. భూవినియోగ మార్పిడి, బోర్లు నిషేధం. వ్యర్థ చెరువుల నీరు, గ్రామాల ఆవాసాల నీరు, చెత్త శుద్ధి చేసి మాత్రమే వదలాలి. విద్యుత్‌ తీగల ఏర్పాటు, హోటళ్ళు, రిసార్టులు, రాత్రి సమయాల్లో వాహనాల రాకపోకలు నియంత్రణ ఉంటుంది. విమానాలు, హాట్‌ బెలూన్‌లు నిషేధం. ఈ నిషేధాల వల్ల భూముల విలువ తగ్గిపోతుంది. వేల కోట్ల ఆదాయం వస్తున్న ఆక్వా సాగుకు ఆర్థిక, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు, జన జీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. 120 జివో ప్రకారం ఆ ప్రాంతంలో అగ్గిపెట్టె, వంట చెరకు సైతం నిషేధం. వ్యవసాయంలో ఎరువులు, రసాయనాలు వాడకూడదు. పలు రకాల ఆంక్షలు అమల్లోకి వస్తాయి.

కొల్లేరు ఆపరేషన్‌ సందర్భంగా, తరువాత కొల్లేరు వాసులు, కొల్లేరు సంఘాలు, సిపియం, ప్రజాసంఘాలు కాంటూరును 5 నుండి 3కు కుదించమని పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కొల్లేరు వాసులను కష్టాల్లోకి నెట్టిన కాంగ్రెస్‌, తెలుగుదేశం గత్యంతరం లేక అసెంబ్లీలో రెండు సార్లు... కాంటూరును 3కు కుదిస్తూ ... తీర్మానాలు సైతం చేశాయి. కొల్లేరు సమస్యను పరిష్కరిస్తామని, కాంటూరు 3కు కుదిస్తామని 2014లో భీమవరంలో జరిగిన ఎన్నికల సభలో మోడీ, చంద్రబాబు‌ నాయుడు, పవన్‌ కల్యాణ్‌ గట్టి హామీ ఇచ్చారు. కానీ నేడు పర్యావరణ సున్నిత ప్రాంతమంటూ పాలకులు, ప్రభుత్వాలు, కోర్టులు కొల్లేరును పెనం మీద నుండి పొయ్యిలోకి నెడుతున్నాయి. పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. కొల్లేరు గ్రామాల ప్రజలు, జిరాయితీ రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఇది అన్యాయం. కొల్లేరు అంటే సరస్సే కాదు, ప్రజల కోణంలో కూడా ఆలోచించాలి. కొల్లేరు సరస్సును కూడా కార్పొరేట్లకు, బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నమా అని అనుమానం వస్తోంది. పైగా ఈ సరస్సు క్రమంగా ఒండ్రు మట్టి ఇతరాల వల్ల పూడిపోతోంది. ఇంపీరియల్‌ గెజిట్‌లో క్రమంగా అదృశ్యమయ్యే సరస్సు అని పేర్కొన్నారు.

ఏమిటి పరిష్కారం?

సరస్సు, చిత్తడి నేలలు, పర్యావరణ సున్నిత ప్రాంత పరిధి 3వ కాంటూరుకు (33 వేల ఎకరాలకు) కుదించాలి. 46 బెడ్‌ గ్రామాలను మినహాయించాలి. సొసైటీలు, జిరాయితీ రైతులు, గ్రామాల ప్రజలను కాపాడాలి. ఉరితాడు లాంటి 120 జివో రద్దు చేయాలి. l శ్రీరామకృష్ణయ్య, మిత్రా కమిటీ (1964), అసెంబ్లీ కమిటీలు సిఫార్సు చేసిన విధంగా ముంపు పోయేలా ఛానలైజేషన్‌ అమలు చేయాలి. ఉప్పుటేరు అభివృద్ధి, రెగ్యులేటర్‌ నిర్మాణం (ఉప్పునీరు ఎగతన్నకుండా) చేయాలి. l కొల్లేరు అభయారణ్య పరిధి నుండి 20 వేల ఎకరాల జిరాయితీ, సొసైటీ భూములను హామీ ఇచ్చిన విధంగా తొలగించాలి. రైతులకు రక్షణ కల్పించాలి. కొల్లేరు ఆపరేషన్‌లో నష్టపోయిన సొసైటీలు, జిరాయితీ రైతులకు, ప్రజలకు నష్ట పరిహారం చెల్లించాలి. వాటిని పునరుద్ధరించాలి. l పరిశ్రమలు, మున్సిపాలిటీల వ్యర్ధాలు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసి మాత్రమే వదలాలి. కొల్లేరు గ్రామాల ప్రజలకు రోడ్లు, తాగునీరు, మౌలిక సౌకర్యాలు, విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలి. l పాలక పార్టీలు కొల్లేరు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం కాకుండా ప్రజల్లా చూసి, వారి సమస్యలు చిత్తశుద్ధితో పట్టించుకుని పరిష్కరించాలి. l సరస్సు, పక్షులు, పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరం. ప్రజల జీవనం, మనుగడ, జీవించే ప్రాథమిక హక్కుకు కూడా కోర్టులు, ప్రభుత్వాలు, పాలకులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. పర్యావరణం ప్రజలకోసమే. ప్రజలే లేకుండా వారి భాగస్వామ్యం లేకుండా పర్యావరణ పరిరక్షణ చేస్తామనడం హాస్యాస్పదం.

కొల్లేరు ప్రజలు, నాయకులు భ్రమలు వీడి రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాడితేనే సమస్యకు పరిష్కారం. మనుగడకు రక్షణ. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కొల్లేరు వాసులకు, జిరాయితీ రైతులు, సొసైటీలు, డిఫారం పట్టాదారులకు అండగా నిలవడం మనందరి బాధ్యత.

balaram.jpg

వ్యాసకర్త - సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్