mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాఠాలు - పరమార్థాలు

1 గంట క్రితం

ncrert
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

"విద్య లక్ష్యం ఏమి ఆలోచించాలో చెప్పడం కాదు; ఎలా ఆలోచించాలో నేర్పడం" అంటారు ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి దేశం తన పిల్లలకు ఏ చరిత్రను, ఏ విలువలను, ఏ భవిష్యత్తును అందించాలనుకుంటుందో పాఠ్యపుస్తకాలు దానికి అద్దం పడతాయి. విద్యాబోధనలో కాలానుగుణంగా కొత్త అంశాలు రావడం సహజమే! అయితే జరిగిన మార్పు మరింత మెరుగుదలకు దోహదపడాలి. అంతేగానీ, విశాల దృష్టికి అడ్డుతెరలు తగిలించి, సంకుచిత స్వభావాన్ని ఎక్కించేదిగా ఉండకూడదు. ఇటీవల 9వ తరగతి ఎన్ సి ఇ ఆర్ టి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో చేసిన మార్పులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 1975 నాటి ఎమర్జెన్సీపై ప్రత్యేక పాఠాన్ని చేర్చారు. దేశంలో వివాదాస్పదంగా మారిన ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) అంశాన్ని పాఠాల్లో భాగం చేశారు. అదే సమయంలో ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ ప్రవేశిక విశిష్టత గురించి వివరించే పాఠాలను తొలగించారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? రాజ్యాంగం ఏ విలువలపై నిలిచింది? పౌరుడి హక్కులు, స్వేచ్ఛ ఎందుకు అంత ముఖ్యమైనవి? అనే అవగాహన లేకుండా ఎమర్జెన్సీ వంటి అధ్యాయాలను విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకోగలరు?

ఎమర్జెన్సీ ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదు. ప్రజల హక్కులను ఎంత దారుణంగా హరించివేశారో తెలిపే చారిత్రక చీకటి అధ్యాయం. వెలుగు గురించి తెలిస్తేనే కదా, చీకటి ఎంతటి క్రూరమైనదో అవగతమవుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయ పరిరక్షణ వంటి విలువలు ముందుగా తెలియకపోతే, అవి కోల్పోవడంలోని తీవ్రత కూడా అర్థం కాదు. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోకుండా ఎమర్జెన్సీని చదవడం అంటే ఆరోగ్యవంతమైన శరీరం ఎలా పనిచేస్తుందో తెలియకుండా వ్యాధి గురించి మాత్రమే చదివినట్టే! స్వీయ జ్ఞాన సముపార్జనకు గంతలు కట్టి, తాము చూపాలనుకున్నదే పాఠాల్లోకి ఎక్కించడం పాలకుల సంకుచిత దృష్టికి నిదర్శనం. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచీ ఈ నీతిమాలిన పని చేస్తూనే ఉంది. భగత్‌సింగ్‌ వంటి స్వాతంత్ర్య యోధుల త్యాగాలను, పెరియార్‌, అంబేద్కర్‌ వంటి సామాజిక చింతనాపరుల ఆలోచనలను వివరించే పాఠాలను గతంలో తొలగించి, విమర్శలను ఎదుర్కొంది.

భారత రాజ్యాంగ ప్రవేశికలోని లౌకికతత్వం, సామ్యవాదం అన్న పదాలు వింటే కాషాయ పరివారానికి బెరుకు. ఎందుకంటే అవి వారు నమ్మే మనువాదానికి పూర్తిగా చుక్కెదురు. ఆ పదాలకు ఉన్న విలువైన, విస్తృతమైన అర్థాలు మోడీ పాలనలోని రాజ్యాంగ వ్యతిరేక నడకను వేలెత్తి చూపిస్తాయి. గొంతెత్తి ప్రశ్నిస్తాయి. అందుకే పాఠాల మార్పు పేరిట వాటిని తొలగించే కుట్రకు బరితెగించింది బిజెపి ప్రభుత్వం. లౌకికవాదం అనేది పదం కాదు, భారత రాజ్యాంగం యొక్క సారాంశం. వందల భాషలు, అనేక మతాలు, విభిన్న సంస్కృతులు కలిగిన దేశంలో ప్రతి పౌరుడిని సమానంగా చూడాలనే రాజ్యాంగ దృక్పథం. ప్రభుత్వం ఎవరి విశ్వాసానికీ శత్రువు కాకూడదు; ఎవరి విశ్వాసానికీ ప్రత్యేక సంరక్షకురాలు కాకూడదు. అదే లౌకికత సారం. ఈ విలువను పెంపొందిస్తే దేశంలో మత రాజకీయాలకు ఆయువు మూడుతుంది. మతం పేరిట ఉన్మాదం ప్రబోధించే పాలకుల పీఠం కదులుతుంది. అందుకని పాఠాలను, పదాలను మాయం చేయాలనుకుంటోంది మోడీ-షా ప్రభుత్వం. "దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్." అన్న మహాకవి గురజాడ మాటను అర్థం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది.


తరగతి గది ప్రజాస్వామ్యానికి తొలి పాఠశాల. అక్కడ పిల్లవాడు ప్రశ్న అడగడం నేర్చుకోవాలి. తన అభిప్రాయాన్ని చెప్పడం నేర్చుకోవాలి. ఎదుటివాడి అభిప్రాయాన్ని వినడం నేర్చుకోవాలి. భిన్నంగా ఆలోచించే సహచరుడిని శత్రువుగా కాకుండా సహపాఠిగా చూడడం నేర్చుకోవాలి. ఇవి పాఠ్యపుస్తకాల బయట నేర్చుకునే విలువలు కావు; బోధనా ప్రక్రియలోనే పెంపొందాల్సిన సంస్కారం. విద్య లక్ష్యం పరీక్షలో సరైన జవాబు రాయించడం కాదు. సరైన ప్రశ్న వేయడం నేర్పించడం. "ఏమి జరిగింది?" అని గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు; "ఎందుకు జరిగింది?", "దాని నుంచి ఏమి నేర్చుకోవాలి?", "మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా సమాజం ఏ విలువలను కాపాడుకోవాలి?" అనే ఆలోచనలను రేకెత్తించడం. అదే విద్య విజయానికి అసలు కొలమానం. ఎన్ సి ఇ ఆర్ టి పాఠ్యపుస్తకాల్లో చేసే మార్పులు, పాఠాల తొలగింపులు ఈ విద్యా ప్రమాణాలకు గండి కొడుతున్నాయి. "సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదు" అన్నారు డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్‌. ఈ మాట ఎన్నికల గురించే కాదు; విద్యాబోధనకూ వర్తిస్తుంది. సమానత్వాన్ని గౌరవించని తరగతి గదిలో బాధ్యతగల పౌరుడు తయారు కాడు. భిన్నత్వాన్ని అంగీకరించని విద్యా వ్యవస్థ లౌకిక సమాజాన్ని నిర్మించలేదు. ప్రశ్నించే స్వేచ్ఛను ప్రోత్సహించని బోధన విమర్శనాత్మక ఆలోచనను పెంచలేదు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తనదైన సంకుచిత దృష్టిని పిల్లలకు ఎక్కించటానికి పాఠాలను మార్చడం పనిగా పెట్టుకుంది. ఇది నవీన నాగరిక దేశ నిర్మాణానికి చాలా హానికరం!

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్