గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని ప్రభుత్వం గొప్పగా చెబుతున్న నేపథ్యంలో అద్దంకి పరిధిలో పోలీసుల కారులో గంజాయి దొరికిందన్న విషయం ప్రజలను విస్మయానికి గురిచేసింది. మాదకద్రవ్యాలను సీజ్ చేసి, వాటి రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం కనిపించడం తీవ్రమైన విషయం. ఈ ఘటన మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విశ్వసనీయతపై పలు సందేహాలకు తావిస్తోంది. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ పోలీసులు మద్యం మత్తులో ఉన్నారా లేదా అన్నది బ్రీత్ ఎనలైజర్, ఇతర శాస్రీయ పరీక్షలతో నిర్ధారించాలి, వివరాలను బహిరంగపర్చాలి. మరోవైపు, నీలి రంగు బ్యాగు చుట్టూ వినిపిస్తున్న కథనాలు ఈ ఘటనను మరింత మిస్టరీగా మార్చాయి. ఆ బ్యాగు నిజంగా ఉందా? ఉంటే దానిలో ఏముంది? నగదు ఉన్నదన్న ప్రచారం నిజమా? స్వాధీనం పంచనామాలో దాని వివరాలు నమోదయ్యాయా? బ్యాగు, నగదు లేదా ఇతర వస్తువులపై వేలిముద్రలు, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారా? ఇలాంటి సందేహాలు నివృత్తి చేయాల్సింది ఉన్నతాధికారులే.
మాదకద్రవ్యాలు లేకుండా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతన కుదరడం లేదు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా పెరగడంలో పోలీసుల పాత్రతో పాటు, పాలకవర్గ పార్టీల్లో పెద్దల పాత్ర కూడా పదేపదే వెలుగులోకి వస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఒక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు హైదరాబాద్‌లో గంజాయి వినియోగిస్తూ పోలీసులకు చిక్కడం, అంతకుముందు కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో ఒక ఐఎఎస్ అధికారి కుమారుడు హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఘటన కూడా వెలుగుచూసింది. మాజీ ఐఎఎస్ అధికారి, ఎమ్మెల్సీగా మారిన ఒకరి కుమారుడిపైనా గంజాయి, హాష్ ఆయిల్ వినియోగం కేసు నమోదైంది. అధికార పార్టీ ఎంపి ఒక ఫాంహౌస్‌లో పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మాజీ మంత్రి బంధువు ఒకరు హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌లో అరెస్టు మరో సంఘటన. పాలకవర్గ పార్టీల పెద్దలు, తాజా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికార్లు కుమ్మక్కుతోనే గంజాయి, డ్రగ్స్ మాఫియాలు అక్రమాలు సాగిస్తున్నాయనడానికి పై ఉదాహరణలు మచ్చుమాత్రమే. పలుకుబడి కలిగిన కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇలాంటి కేసుల్లో చిక్కినప్పుడు తరచూ డి-అడిక్షన్ కేంద్రాలకు తరలించి, తేలికపాటి చర్యలతో సరిపెట్టడం పరిపాటిగా మారింది. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధమున్నవారిని పార్టీలు రక్షించకూడదు. నిందితుడి రాజకీయ స్థాయి, కుటుంబ నేపథ్యం, పదవి, ఆర్థిక ప్రభావం ఏదైనా కావచ్చు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు పార్టీలు దూరం పెట్టాలి; నేరం నిర్ధారితమైతే బహిష్కరించాలి. గంజాయి బ్యాచ్‌లకు, వ్యాపారులకు రాజకీయ అండదండలు ఉండవన్న సంకేతాన్ని అన్ని పార్టీలూ బలంగా పంపాలి.
విశాఖ కేంద్ర కారాగారంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారనేది విశ్లేషకుల మాట. నిర్దోషులు జైళ్లలో మగ్గకుండా, నేరస్థులు పలుకుబడితో తప్పించుకోకుండా చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి. మాదకద్రవ్యాల నియంత్రణ పేరుతో అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడం సులభం. కానీ అసలు సరఫరా గొలుసును ఛేదించడం ప్రభుత్వానికి నిజమైన పరీక్ష. చిన్న మొత్తంలో గంజాయి ఉన్నదన్న ఆరోపణతో పట్టుబడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటూ, సరఫరా వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను వదిలేయడం సరికాదు. నెల్లూరులో పెంచలయ్య అనే సిపిఎం కార్యకర్తను గంజాయి బ్యాచ్ హత్య చేసిన ఉదంతం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు రవాణా చేస్తున్నారు, ఎవరికి చేరుతోంది, ఆర్థిక లావాదేవీలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సరఫరా వ్యవస్థను కూల్చేస్తే గంజాయి పడగనీడ నుండి యువతను కాపాడొచ్చు.
ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాలు లేకుండా చేస్తామని ప్రకటించడం మాత్రమే సరిపోదు. ఆ దిశగా రాజకీయ జోక్యం లేని దర్యాప్తు వ్యవస్థ, పోలీసులపై పర్యవేక్షణ, పారదర్శక విధానం, వేగవంతమైన న్యాయ ప్రక్రియ, యువతకు పునరావాస కార్యక్రమాలు అవసరం. మాదకద్రవ్యాల నియంత్రణకు మాటలకంటే దృఢ సంకల్పం ముఖ్యం. ప్రభుత్వం ఆ దిశగా నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని అపహాస్యం చేస్తే, ‘గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్’ అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోతుంది.







కామెంట్‌లు (0)