విశాఖపట్నం తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడం తీవ్ర బాధాకరం. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు, మెరైన్ పోలీసులు రోజుల తరబడి గాలింపు చర్యలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. దీంతో బాధిత కుటుంబాల ఆశలు అడియాసలయ్యాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో వేటకు వెళ్లిన ఏడుగురిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 72 గంటల పాటు గాలింపు జరిపినా మిగిలిన వారి ఆచూకీకి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియకపోవడంతో నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కూడా ప్రకటించేసింది! ఈ ఘటన రాష్ట్రంలో మత్స్యకారుల భద్రత ఎంత నిర్లక్ష్యానికి గురవుతోందో మరోసారి గుర్తు చేసింది. గుజరాత్ తరువాత విశాలమైన సముద్ర తీరం కలిగి, దేశంలోనే సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతులకు, ఆహార భద్రతకు ఈ రంగం విశేషంగా దోహదపడుతున్నప్పటికీ, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుడి ప్రాణాల భద్రతకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థ ఇంకా ఏర్పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా సముద్రంలో మత్స్యకారులు గల్లంతవడం, తుఫానులకు బలికావడం, పడవలు ప్రమాదాలకు గురికావడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. 2018లో 'ఫెథాయ్' తుఫాను సమయంలో విశాఖ తీరంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. 2023లో విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 43 పడవలు పూర్తిగా దగ్ధమై వందలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. ప్రతి ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టడం తప్ప, ప్రమాదాలను నివారించే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
సముద్రంలో చేపల లభ్యత క్రమంగా తగ్గుతోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ) గణాంకాల ప్రకారం 2025లో ఆంధ్రప్రదేశ్ సముద్ర చేపల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే సుమారు 13 శాతం తగ్గింది. వాతావరణ మార్పులు, సముద్ర కాలుష్యం, అధిక వేట, సముద్ర జీవవైవిధ్య క్షీణత ఇందుకు ప్రధాన కారణాలు. తీర ప్రాంతాల్లో చేపలు తగ్గిపోవడంతో చిన్న మత్స్యకారులు వందల కిలోమీటర్ల దూరం లోతట్టు సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం ఎంత పెరుగుతుందో, ప్రమాదం కూడా అంతే పెరుగుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో భారీ మెకనైజ్డ్ ట్రాలర్లు, ఆధునిక వేట నౌకలు సంప్రదాయ మత్స్యకారుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో చిన్న పడవలకు దొరికే చేపలను కూడా పెద్ద నౌకలే కొల్లగొడుతున్నాయి. దీంతో చిన్న మత్స్యకారులు మరింత లోతట్టు సముద్రంలోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది వారి ఆదాయాన్ని మాత్రమే కాదు, ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీర ప్రాంతాలను పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాజెక్టులు, కార్పొరేట్ పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున కేటాయిస్తోంది. అయితే, అంతే శ్రద్ధను మత్స్యకారుల భద్రత విషయంలో చూపడం లేదు. ఫలితంగా తీరంలో తరతరాలుగా జీవిస్తున్న మత్స్యకారుల భద్రత, జీవనోపాధి, సంప్రదాయ వేట హక్కులు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన జిపిఎస్ పరికరాల నాణ్యతపై వస్తున్న విమర్శలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ పరికరాలకు సిగ్నల్ సరిగా అందడంలేదని, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడం లేదని మత్య్సకారులు చెబుతున్నారు. తాజా సంఘటనలోనూ జిపిఎస్ సరిగా పనిచేసి ఉంటే ప్రమాదం నుండి మత్స్యకారులు సకాలంలో బయటపడి ఉండేవారని అంటున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలి. భద్రతా పరికరాలు పంపిణీ చేశామని చెప్పుకోవడంతోనే సరిపోదు. అవి సముద్రంలో సమర్థంగా పనిచేస్తున్నాయా లేదా అన్నదే అసలు ప్రశ్న.
వాతావరణ మార్పుల ప్రభావం సముద్ర జలాలపై తీవ్రంగా పడుతోంది. తక్కువ సమయంలోనే చోటుచేసుకుంటున్న ఉత్పాతాలు పెనుప్రమాదాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం జిపిఎస్ ఒక్కటే సరిపోదు. ప్రతి పడవలో శాటిలైట్ ఆధారిత వెసెల్ మానిటరింగ్ సిస్టమ్ (విఎంఎస్) అత్యవసర సంకేత పరికరాలు, నమ్మకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆటోమేటిక్ గుర్తింపు వ్యవస్థ, రియల్‌టైమ్ వాతావరణ హెచ్చరికలు వంటి ఆధునిక వ్యవస్థలు తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటి ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చేయాలి. సముద్రంలోకి వెళ్లిన ప్రతి పడవను నిరంతరం పర్యవేక్షించేందుకు తీరంలో కంట్రోల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనికోసం కోస్ట్‌గార్డు, నౌకాదళం, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖల మధ్య 24 గంటలు సమన్వయం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మత్య్సకారులకు క్రమం తప్పకుండా భద్రతా శిక్షణ ఇవ్వాలి. అనేక దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ తరహా చర్యలను మన దేశంలోనూ వర్తింపచేయడానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రమాద పరిస్థితుల్లో గాలింపు చర్యలను మరింత ముమ్మరంగా చేపట్టాలి. మరిన్ని నౌకలు, హెలికాప్టర్లు, శాటిలైట్ డేటా, సముద్ర ప్రవాహాల నమూనాలను వినియోగించాలి. చైనా వంటి దేశాలు దీర్ఘ శ్రేణి విమానాలను కూడా తమ దేశ మత్స్యకారుల ఆచూకీ కనుగొనడానికి వినియోగిస్తున్నాయి. రక్షణ చర్యల్లో ప్రతి గంటా విలువైనదే కాబట్టి ఎటువంటి అలసత్వానికి తావులేకుండా ఆ చర్యలు ఉండాలి. తాజా ఘటనలోనూ గల్లంతైన వారు ఏమయ్యారో తేల్చేంతవరకు గాలింపు చర్యలను కొనసాగించాలి. రాష్ర్టానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపదను అందిస్తున్న మత్య్సకారుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత! ఆ విషయాన్ని పాలకులు గుర్తించాలి.







కామెంట్‌లు (0)