జులై 10 అంగన్వాడీ కోర్కెల దినం
పిల్లల సమగ్రాభివృద్ధికి అన్ని రకాల పునాది వేసేది ఐసిడిఎస్. దేశవ్యాప్తంగా నేడు 7,076 ప్రాజెక్టులతో 13 లక్షల 42 వేల 146 అంగన్వాడీ సెంటర్లను గ్రామ, పట్టణ నివాస ప్రాంతాల్లో విస్తరించింది. ఈ కేంద్రాల ద్వారా 8.48 కోట్ల మంది పిల్లలకు, 1.95 కోట్ల మంది గర్భిణీలు, బాలింతలకు (మన రాష్ట్రంలో సుమారు 32 లక్షల మందికి) ఐసిడిఎస్ ద్వారా సేవలందిస్తున్నారు. లక్ష్యాలు, అభివృద్ధి ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదు. ఈ పథకంలో పని చేస్తున్న 27 లక్షల మంది అంగన్వాడీలను, హెల్పర్లను కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు.
కేంద్రం నిధుల కోత - ప్రైవేటీకరణ వాత
ఐసిడిఎస్ పథకం ప్రారంభించిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల మాతృ మరణాలు 86 , శిశు మరణాలు 71 శాతం తగ్గాయి. మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ కి 100 శాతం నిధులు కేటాయించింది. 2006 తర్వాత కేంద్రం రాష్ట్రాల వాటాలు 90:10 కేటాయించారు. 2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 60:40గా మార్పు చేశారు. దీనివలన రాష్ట్రాలపై అదనపు భారం పడింది. తర్వాత సరిపడా బడ్జెట్ కేటాయించడంలేదు. కేంద్ర ప్రభుత్వం 2026-27లో ఐసిడిఎస్ పథకానికి కేవలం రూ. 21,970 కోట్లు కేటాయించింది. ప్రైవేటీకరణ దిశలో వేగంగా పావులు కదుపుతున్నది. వేదాంత, అక్షయ పాత్రకు సెంటర్ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నది. నూతన విద్యా విధానం తీసుకొచ్చి సెంటర్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఆధార్ లింక్ చేయడంతో పాటుగా పోషణ ట్రాకర్ వంటి రకరకాల యాపులు తెచ్చి లబ్ధిదారులను తగ్గిస్తున్నారు. కొన్ని సెంటర్ల పర్యవేక్షణ కార్పొరేట్లకు ఇవ్వాలని నిర్ణయించారు.
వేతనాలపై కోర్టు తీర్పులు బేఖాతరు
ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలైనా నేటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదు. ఎటువంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు కావటం లేదు. అంగన్వాడీల పోరాటాల ఫలితంగా 2022 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా వీరికి గ్రాట్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐసిడిఎస్ అనేది శాశ్వతమైన పథకం. అందులో పని చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంతవరకు వర్కర్లకు రూ.24,800, హెల్పర్లకు రూ.20,300 వేతనం ఇవ్వాలని 2024లో గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పులను మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయకుండా మోసం చేస్తోంది. 2014 నుండి కేంద్ర ప్రభుత్వం, 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు, మినీ వర్కర్లకు గౌరవ వేతనాలు పెంచలేదు.
తిండి, బట్ట, ఇంటి అద్దెలు, రవాణా, కరెంట్ ఖర్చులకు సరిపడా కనీస వేతనం ఉండాలని ఐ.ఎల్.ఒ (1957) తీర్మానించింది. దీనికి అదనంగా కనీస వేతనంలో 25 శాతం చదువులు, ఆరోగ్యాలు, వినోదాలు, పండుగలకు ఉండాలని 1992లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వీటన్నింటిని కలుపుకుంటే నేటి ధరల్లో కనీస స్థాయి కార్మికులకు రూ. 26 వేలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చి, ఉన్న హక్కులను తొలగిస్తున్నారు.
వాగ్దానాల విస్మరణ
కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో అంగన్వాడీలు 42 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించగా 100 శాతం కార్మికులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి...మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కారం చేస్తామని...నేటి సి.ఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా నేటికీ అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. అంగన్వాడీలకు 1972 గ్రాట్యూటీ చట్టం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పుంది. కానీ మన రాష్ట్రంలో గ్రాట్యూటీ చట్టానికి విరుద్ధంగా 2025 మార్చి 7న జీవో నెం.8 ఇచ్చారు. కేవలం రిటైర్ అయిన వారికి, చనిపోయిన వారికి మాత్రమే గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేస్తామని తెలియజేశారు. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయి మధ్యలో మానుకున్న వారికి కూడా గ్రాట్యూటీ చట్టం అమలు కావడం లేదు. రాజకీయ జోక్యం వలన కొంత మంది హెల్పర్లు ప్రమోషన్ కోల్పోతున్నారు. అనేక పోరాటాల ఫలితంగా 4,867 మినీలు మెయిన్ వర్కర్లుగా అప్డేట్ కావడం సంతోషకరం. ఇంకా 18 సెంటర్లు పెండింగ్‌లో వున్నాయి. కొన్ని మినీ సెంటర్లను విలీనం చేస్తున్నారు. పిల్లలు లేరనే సాకుతో గుంటూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను తగ్గించేందుకు గ్రామాల్లో సెంటర్లను మూసేసి వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది అంగన్వాడీ లక్ష్యానికి విరుద్ధం.
పెరుగుతున్న పనిభారం - సౌకర్యాలు ఘోరం
యుద్ధం వల్ల అంగన్వాడీ సెంటర్ కి గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంది. ఎఎస్ఆర్ జిల్లాలో బ్లాక్ లో రూ.3 వేలకి గ్యాస్ కొని పిల్లలకు వండి పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఒక్కో చిన్నారికి గ్యాస్ ఖర్చు నిమిత్తం 50 పైసలు ఇస్తుంది. ఇది ఏమాత్రం సరిపోవట్లేదు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లకు రేషన్ షాప్ ద్వారా వచ్చే సరుకులు నేరుగా సెంటర్లకు వేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్ని ఆపేశారు. అంగన్వాడీ వర్కర్లే పెట్టుబడి పెట్టి రేషన్ షాపుల నుండి సరుకులు తెచ్చుకుంటున్నారు. రవాణా ఖర్చులు ఇస్తామన్నారేగాని నేటికీ అమలు చేయలేదు. ఒక్కో సెంటర్ సరుకులు తెచ్చుకోవడానికి రూ.200 నుండి రూ. 500 వరకు ఖర్చు అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాలకు ఇంకా ఎక్కువగానే ఖర్చవుతుంది. ప్రతి నెలా అంగన్వాడీలు రిపోర్టులు ఇవ్వడానికి సెక్టార్ మీటింగ్ కి వెళ్లాలి. 2017 నుండి డి.ఎ బిల్లులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. 2023లో 42 రోజుల సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి కనీసం నెలకి ఒక టి.ఎ ఇస్తామని జీవో ఇచ్చినా అమలు లేదు. 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు, హెల్త్ కు సంబంధించిన వివరాలన్నింటినీ మరో యాప్ లో చెయ్యాలని, రాష్ట్రమంతటా ట్రైనింగ్ ఇచ్చారు. ఇది అంగన్వాడీ టీచర్లకు అసాధ్యమైన పని. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ చేయాల్సినది. దీనిని కూడా అంగన్వాడీలకు అప్పగించాలని ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది. యూనిఫామ్ లు ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ లో అందరూ మహిళలే. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ అమలు గురించి పట్టించుకోవడం లేదు. 2023 సంవత్సరానికి సంబంధించిన కాన్వెంట్ బిల్లు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. నేడు వాటిని ఇవ్వలేమని చెబుతున్నారు. రకరకాల యాప్‌ల వల్ల అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ దినదిన గండంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం జులై 10 అంగన్వాడీ కోర్కెల దినం సందర్భంగా పై డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర దేశవ్యాప్తంగా బ్లాక్ డే జరుగుతుంది. నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.
వ్యాసకర్త : కె.సుబ్బరావమ్మ,
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి








కామెంట్‌లు (0)