‘‘ప్రభుత్వం తన విధానాలను ఎలా రూపొందించు కోవాలంటే... ఆర్థిక అసమానతలు, స్థితిగతులలో అసమానతలు, అవకాశాలలో అసమానతలు, సౌకర్యాలలో అసమానతలు - వీటిని తొలగించే విధంగా నడుచుకోవాలి. స్థూలంగా అందరి హక్కులు, సంక్షేమం కాపాడాలి’’ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, క్లాజ్ 2 పేర్కొంది. అయితే ఇవాళ జరుగుతున్నది వేరు. సంక్షేమం అనేది ప్రభుత్వం బాధ్యత నుండి విడిపోయి ప్రజలే తమ సంక్షేమం గురించి ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చింది. "సంక్షేమం అంటే కేవలం కాపాడటం అనే నెగటివ్ సెన్సులో మాత్రమే కాకుండా- సామజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తొలగించడానికి తోడ్పడేటటువంటి అవకాశాలు కల్పించాలి. సదుపాయాలు కల్పించాలి. హక్కులు కల్పించాలి అనే పాజిటివ్ బాధ్యత" కూడా చూడాలి అని పౌర హక్కుల నేత బాలగోపాల్ పేర్కొన్నారు.
1990ల తర్వాత వచ్చిన ఆర్థిక సరళీకరణల అనంతరం సంక్షేమం వదిలేసి ఇప్పుడందరూ అభివృద్ధి అనే నినాదం అందుకున్నారు. ఒకప్పుడు అభివృద్ధి అనే పదానికి అర్ధం వేరు, ఇప్పుడు అర్ధం వేరు. ఒకప్పుడు స్కూలు కట్టించడం, ఫ్యాక్టరీ కట్టడం, రోడ్లు వేయడం, ఆసుపత్రి కట్టించడం లాంటివి అభివృద్ధి పనులైతే...ఇప్పుడు సెజ్, విండ్ మిల్ కోసం వేల వేల ఎకరాలు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడం అభివృద్ధి అనే పదానికి అర్ధంగా మారిపోయింది. అలాంటి ఇంకొక అభివృద్ధి కథే ఈ గూగుల్ డేటా సెంటర్ కథ.
తర్లువాడకు చెందిన రెల్లి రామకృష్ణమ్మకి అది భూమి మాత్రమే కాదు. అది ఆమె ఉనికి, జీవనాధారం. భూసంస్కరణల్లో భాగంగా దళితులకు ఇచ్చిన భూమి అది. రాళ్లు, రప్పలు ఉన్న ఈ భూమిని రెక్క డొక్కా చించుకొని కష్టపడితే, ఈ రోజుకి సాగు చేసే స్థితికి వచ్చింది. ఈ స్థితికి రావడానికి కనీసం 20-25 సంవత్సరాలు పట్టింది. రామకృష్ణమ్మ, ఆమె కుటుంబానికి అలాగే వారి బంధువుల కుటుంబాలకు ఇన్ని సంవత్సరాలు కష్టపడితేగాని భూమి సాగులోకి రాలేదు. అలాంటి బంజరు భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంటుంది.
ఈ డి-పట్టా భూములు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వామపక్షాలు, పౌరహక్కు సంఘాలు, దళిత సంఘాల పోరాటాల ఫలితంగా దక్కిన భూములు. ఈ భూములను దళితులు, ఆదివాసీలు అనుభవించగలరంతే. హక్కుదారులు కాదు, కాలేరు కూడా.
ఈ విషయమై చరిత్రకారిణి రూప విశ్వనాథ్, మద్రాస్ ప్రెసిడెన్సీలో భూ, వ్యవసాయ సంబంధాల గురించి రాస్తూ ఇలా అంటారు. బ్రిటిష్ వారి రాకకి ముందున్న కుల సంబంధాలను, బ్రిటిష్ ప్రభుత్వం చెరిపివేయకపోగా మరింత వాటిని పకడ్బందీగా ధ్రువీకరించింది. అగ్ర కులాలకు, వ్యవసాయ ఆధారిత కులాలకు గ్రామాలలో ఉన్న సాగు భూములపై సర్వాధికారాలను కట్టబెట్టారు. అలాగే అంటరాని కులాలపైన పెత్తనం చేయడానికి కూడా వారు అనుమతించారు.
చాలా సంవత్సరాల తర్వాత, అనేక పోరాటాల అనంతరం పాడుబోయిన, పనికిరాని, ఎక్కడో ఊరవతల, వ్యవసాయానికి అసలు పనికిరాని భూమిని దళితులకు ప్రభుత్వం పంచి పెట్టింది. పంచిందిగాని పట్టాలు ఇవ్వలేదు. ప్రభుత్వమే హక్కుదారుడు, దళితులు కేవలం అనుభవదారులు మాత్రమే. వలసవాదుల పాలనలో మొదలైన ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతుంది.
ఈ విధంగా చాలా కొంతమందికి దళితులకు ఆంధ్ర ప్రాంతంలో భూములు ఇవ్వడం జరిగింది. దళితుల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి ఈ భూములు ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఈ కుల ఆధారిత అసమానతల పునరుత్పత్తి, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా కొనసాగింది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే దళితులు హక్కుదారులు కాకపోవడం, రెండోది దళితుల దగ్గర ఉన్న భూమి, స్థూలంగా పరిశీలిస్తే రెండు శాతం కన్నా తక్కువ. ఇటువంటి పరిస్థితిలో విశాఖపట్నం దగ్గర ఉన్న దళితుల భూమిని లాగేసుకోవటం అప్రజాస్వామికం.
గూగుల్ డేటా సెంటర్ కు కేటాయించిన భూమి విషయంలో ప్రధానంగా మూడు సమస్యలను మనం గుర్తించాలి.
1. దళితుల జీవనోపాధిని లాగేసుకోవటం, 2. అత్యంత సున్నితమైన కంబాలకొండ అభయారణ్యం (ఇకో-సెన్సిటివ్), 3. కనీస అవసరాలైన కరెంటు, నీటి కొరత.
మొదటగా తర్లువాడ, అడివివరం, రాంబిల్లి మూడు ప్రాంతాల్లో కలిపి వెయ్యికి పైగా దళితులు నివసిస్తున్నారు. వీరిలో పది శాతం కన్నా తక్కువ మందికి భూమి ఉంది. మిగతావారు, వ్యవసాయాధారిత పనులపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విశాఖపట్నంలో అయితే 70 శాతం దళితులకు భూమి లేదు. తర్లువాడలో కేటాయించిన 300 ఎకరాల భూమిలో 200 ఎకరాలు దళితులది. ఈ భూమి డి ఫామ్ పట్టా భూమి. ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున ఆ రోజుల్లో ఇచ్చిన భూమి. ఇప్పుడు ఈ భూమిని తీసేసుకోవడం ద్వారా ప్రభుత్వం, దళితుల ఆత్మగౌరవాన్ని లాగేసుకుంటున్నది. ఉత్పత్తి చేసే అవకాశాన్ని కోల్పోయి, రోజువారీ కూలీలుగా తిరిగి మళ్ళీ జీవితం ప్రారంభించవలసిన పరిస్థితి.
ఇక రెండో విషయానికి వస్తే, పర్యావరణ పరంగా ఈ ప్రాంతం అత్యంత సున్నితమైనది. ఆ మాటకొస్తే ఆంధ్ర కోస్తా ప్రాంతం నిరంతరం తుఫానుల దాడి, సముద్రపు మట్టాలు పెరగడం, వాతావరణంలో విపరీతమైన మార్పులు ఒక ఎత్తయితే, ఇంకో వైపు రియల్ ఎస్టేట్ మూలాన చెట్ల నరికివేత, అడవిని క్లియర్ చేయడం కలిపి విశాఖపట్నం అతలాకుతలం అవుతుంది. గత ప్రభుత్వం చేసిన పనులు విమర్శించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, తాను కూడా అటువంటి విధ్వంసకర పనులనే చేస్తున్నది. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా, సభలు లేకుండా, రైతులతో మాట్లాడకుండా, గ్రామసభలు పెట్టకుండా ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇన్ని వందల ఎకరాల భూమిని కేటాయించడం ఈ ప్రభుత్వపు అహంకారపూరిత వైఖరిని సూచిస్తుంది. ఇప్పుడు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ పనులు సామాన్య ప్రజలను అద:పాతాళానికి నెట్టివేస్తాయి. తర్లువాడ, అడవివరం, ముడసర్లోవ, రాంబిల్లి ప్రాంతాలు పర్యావరణ పరంగా, చాలా సున్నితమైనవి. అడవివరమైతే కంబాలకొండను ఆనుకొని ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. కైలాసగిరి కొండ ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో డేటా సెంటర్ కు అనుమతులు ఇవ్వకూడదు.
ఇక ఇప్పటికే పట్టణాలలో భూగర్భ జలాలు, విద్యుత్ కొరత వున్నది. ఈ డేటా సెంటర్లు ప్రారంభమైతే పరిస్థితి ఇంకా విషమం కావచ్చు. 1902లో ప్రారంభించిన ముడసర్లోవ తాగునీటి ప్రాజెక్ట్ రోజుకి 12 లక్షల లీటర్ల నీటిని వైజాగ్ ప్రజలకు అందిస్తుంది. ఇది కాకుండా గోస్తని, తాడిపూడి, మేఘాద్రిగడ్డ నీటి సదుపాయాలు ఉన్న ప్రతి సంవత్సరం వైజాగ్ ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటారు. సగటున ప్రతి మనిషికి 776 లీటర్ల నీరు అవసరమైతే, అదే డేటా సెంటరుకు ఒక్క రోజుకి 12 లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుంది. నీటి అవసరం పక్కన పెడితే నీటి నాణ్యత మీదా ప్రభావితం చూపుతుంది. ఇదే విషయంపైన ఈ మధ్యనే అమెరికన్ పాలసీ మేకర్ అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ల వలన పర్యావరణం ఎలా దెబ్బ తింటుందో, అలాగే నీరు ఎలా కలుషితం అవుతుందో వివరించారు. అయినా కూడా ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది.
అభివృద్ధి సామాజికపరమైనదిగా ఉండాలి గాని, ఆర్థిక పరమైనదిగా కాదు. ప్రభుత్వాల ధ్యాస ఆర్థిక పరంగా ఉంటే సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు పెరుగుతాయి. ఈ డేటా సెంటర్ల వలన ఉద్యోగాలు పదుల సంఖ్యలో తప్ప, వేల సంఖ్యలో రావు. ఇది ఇతర ప్రాంతాల్లో ప్రారంభించిన డేటా సెంటర్లలో రుజువైన విషయం. రూ.వేల కోట్ల రాయితీలు ఇచ్చి, భూములు ఇచ్చి, కనీస అవసరాలైన నీరు, కరెంటును రాయితీల రూపంలో ఇచ్చి, చివరికి 40-50 ఉద్యోగాలు వస్తే రాష్ట్రానికి వచ్చే ఫలితమేంటి? ఇదే ప్రశ్న లక్షల మంది ప్రజలు అడుగుతున్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది.

వ్యాసకర్త - ప్రొ.సతీష్ చెన్నూర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్
సోషల్ సైన్సెస్, కలకత్తా







కామెంట్‌లు (0)