ఏ వాన చుక్క నేల దప్పి తీర్చిందని
కుండపోతగా కుమ్మరించినా
అదునుకు ఒదగని తడి ఎందుకని
ఎల్ నినో విరుచుకుపడుతుంటే
లొట్టబోయిన కన్ను
చిన్న చూపు చూస్తూ కూర్చుంది.
గాలికెగిరిన గూడు జాడ
మరమ్మతు చేయని చేతుల్లో వుంది
విత్తు లేని చేను సెలకల గోల
గాలి విసురుకు కొట్టుకుపోయింది
ఏ అభయ హస్తం ఆదుకుందని
ఏ మాట కోట అడ్డుకోబోయిందని
ఉన్నకాడికే ఉండనీ అనే ధోరణి
శిఖరాగ్రాన సింహాసనం వేసుకుంది.
నెర్రులిడిచిన నేల ఒడిలో
ఏ విత్తనం సేద తీరుతుందని
ఏ మొలక పురుడోసుకుంటుందని
పల్చటి మేఘాల ఆకాశంలో
చినుకు కరువైన కారు మబ్బులెన్నో
కార్తిని మరచి కురుస్తున్న
వృథా వర్షపు తీరుతెన్నులెన్నో.
రైతు దిక్కులు మరచి కూర్చుని
ఏ దిక్కూ లేని అనాథై మిగిలాడు
ఎటూ చాలని తుంపర్ల తాకిడితో
ఏరువాక ఏకరువు దుఃఖపు రాగంతో
విలపించే గేయానికి గాయాలెన్నో
నెర్రులిడిచిన నేలపైనే రైతు
సొలసిపోతూ కూలబడే కాలంలో
ఇంకెన్ని విపత్తులు చూడాలో .
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్ : 9666016636







కామెంట్‌లు (0)