గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ముప్పు ముంగిట....!

1 గంట క్రితం

nepal2-1788012097942-2451.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 05:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలను కేవలం ఒక దేశంలో జరిగిన ప్రకృతి విపత్తుగా చూడటం ఇక ఏ మాత్రం సాధ్యం కాదు. ఇది హిమాలయ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే వరద ముప్పు, నదీ ప్రవాహాల ద్వారా మైదాన ప్రాంతాలకు చేరి చివరకు తీర ప్రాంతాల వరకు ప్రభావం చూపే విస్తృత వాతావరణ సంక్షోభానికో నిదర్శనం. ఈ సమయంలోనే సముద్ర మట్టాల పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ముప్పు ముంగిట నిలిచిన మానవాళికి మరో హెచ్చరిక! 2014–2023 మధ్య ప్రపంచ సగటు సముద్ర మట్టం పెరుగుదల సంవత్సరానికి 4.7 మి.మీ. ఉండగా, 2024లో అది 5.9 మి.మీ.కు చేరిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికలోని అంశాలు మన దేశానికి ఎంతో కీలకమైనవి. ఈ నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని తక్కువ ఎత్తులో ఉన్న డెల్టా ప్రాంతాల్లో నివసిస్తున్న 1.4 కోట్ల మందికి పైగా ప్రజలు ముంపు ముప్పును ఎదుర్కుంటున్నారు. ముంబై, కోల్‌కతా వంటి మహా నగరాలకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఎదురుకానుంది. సముద్ర మట్టం పెరగడం అంటే కేవలం జనావాసాల్లోకి నీరు రావడం మాత్రమే కాదు. ఇళ్లను కోల్పోవడం, ప్రజలు స్థానభ్రంశం చెందడం, తాగునీటి వనరుల్లోకి ఉప్పునీరు చొరబడటం, వ్యవసాయ భూములు దెబ్బతినడం, పారిశుధ్యం–ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరగడం, కొన్ని సమయాల్లో ప్రాణనష్టం సంభవించడం వంటి అనేక సంక్షోభాలకు దారితీస్తుంది. ముందస్తు హెచ్చరికల వ్యవస్థకు అందకుండా విరుచుకుపడే రాకాసి అలలు సృష్టించే భయోత్పాతం ఇంతా అంతా కాదు!

సుదీర్ఘ తీరప్రాంతంగల మన రాష్ట్రానికి ఈ హెచ్చరికల ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని 1,028 కిలోమీటర్ల తీరరేఖలో సుమారు 32 శాతం తీరం కోతకు గురవుతోందని ఇప్పటికే వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలో కోత తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలను కేంద్రం అత్యంత సున్నిత తీర జిల్లాలుగా గుర్తించింది. కృష్ణా జిల్లాలోని 23 తీర గ్రామాలు ముంపు ప్రమాదంలో ఉన్నాయి. అంతర్వేది వద్ద గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో తీర కోత తీవ్రంగా ఉంది. విశాఖపట్నం జిల్లాలో యారాడ, భీమునిపట్నం , శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు వద్ద కోత ముప్పు, సముద్ర మట్టాల పెరుగుదల ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం చెన్నై- విశాఖపట్నం మధ్య 1995-2020 సంవత్సరాల్లో సముద్ర మట్టం సంవత్సరానికి 4.5 మి.మీ. మేర పెరిగింది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ.

వాస్తవానికి హిమాలయాల నుంచి సముద్ర తీరం వరకు వాతావరణ ముప్పులు పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. సముద్ర మట్టం పెరుగుదల, తీర కోత, ఆకస్మిక వరదలు వేర్వేరు సమస్యలు కావు. మారుతున్న వాతావరణ వ్యవస్థలో ఒకదానితో మరొకటి ముడిపడిన సంక్షోభాలే! పెను ముప్పులు విరుచుకుపడుతున్న ప్రస్తుత సమయంలోనూ తీర ప్రాంతాన్ని, ఓడరేవులను కార్పొరేట్లకు కట్టబెట్టడమంటే ప్రమాదాన్ని మరింతగా పెంచడమే! ఆ తరహా చర్యలను ప్రభుత్వాలు తక్షణం మానుకోవాలి. అదే సమయంలో విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికే పరిమితమైతే సరిపోదు. శాస్త్రీయ మ్యాపింగ్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వరద ప్రవాహాల నిరంతర పర్యవేక్షణ, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణ, తీర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి చర్యలను తక్షణం చేపట్టాలి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిపాదించిన గ్రీన్ వాల్ వంటి కార్యక్రమాలను మాటలకే పరిమితం చేయకుండా అమలులోకి తీసుకురావాలి. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది తీర ప్రాంతాల్లోనూ, తక్కువ ఎత్తులోనూ నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముప్పు భవిష్యత్‌‌ తరాలకు సంబంధించిన సమస్య ఎంత మాత్రం కాదు. ఇది ఇప్పటికే మన ముందుకు వచ్చిన ప్రమాదం’ అని తాజా నివేదికలో ఐక్యరాజ్యసమితి చేసిన హెచ్చరిక పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వాలు కూడా ఆ స్ఫూర్తితోనే స్పందించాలి.​​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్