గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసుభాష్‌ చంద్ర నిలువు దోపిడి

2 గంటల క్రితం

Subash4.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 05:48 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

జి గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ అయిన సుభాష్‌ చంద్రకు సంబంధించిన రూ. 22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు గాను, కేవలం రూ.6.5 కోట్లు (0.03 శాతం) చెల్లించమని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తీర్పును ఇచ్చింది. ఇది నేరుగా ప్రజాధనాన్ని లూటీ చేయడమే. లూటీకి పాల్పడిన వ్యక్తి బిజెపి మాజీ ఎంపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సన్నిహితుడు. లూటీకి గురైంది చిన్న, మధ్య తరగతి ప్రజలు దాచుకున్న ఎల్‌ఐసి, బ్యాంకుల సొమ్ము. ఇది అతి పెద్ద కుంభకోణం. పాలకులకు అనుకూలమైన కార్పొరేట్లకు ప్రజా సంపదను నిస్సిగ్గుగా అప్పగించడం. దేశంలోని 15.89 కోట్ల మంది రైతు, కూలీలకు ఒక్కపూట కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి నిధులు కోత కోసిన కేంద్రం, ఒక్క వ్యక్తికి రూ.20 వేల కోట్లను దోచిపెడుతున్న ఎన్‌సిఎల్‌టి తీర్పునకు వంత పాడుతున్నది. ఈ సంవత్సరం వి.బి గ్రామ్‌ జి (ఉపాధి హామీ పథకం)కి కేటాయించిన బడ్జెట్‌ ప్రకారం ఒక్కో వ్యవసాయ కూలీకి కేవలం రూ. 1,660 మాత్రమే దక్కుతుంటే, ఒక్క సుభాష్‌ చంద్రకు మాత్రం రూ.22 వేల కోట్లు అప్పగించడం ద్వారా ఈ ప్రభుత్వం ఎవరి పక్షమో తేట తెల్లమవుతుంది. ఎన్‌సిఎల్‌టి ఇచ్చిన తీర్పుపై అనేక విమర్శలు రావడంతో ప్రస్తుతం స్టే విధించారు. ఇలా ప్రజాధనాన్ని లూటీ చేసిన సంఘటన ఇదొక్కటే కాదు, ఈ 12 ఏళ్ళలో అనేకం జరిగాయి. వందమందికి పైగా వున్న కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు 2014-2024 మధ్య కేంద్ర ప్రభుత్వం రూ.16 లక్షల 35 వేల కోట్ల అప్పులను రైటాఫ్‌ (రద్దు) చేసింది. ఇది కాకుండా మరో రూ.3.4 లక్షల కోట్లు తిరిగిరాని (ఎన్‌పిఎ) అప్పుగా ప్రకటించింది. ఈ లూటీని ప్రశ్నించినవారు దేశద్రోహులు! తర్కించినవారు దిమాగీ నక్సల్స్‌.

సుభాష్‌ చంద్ర కేసు

ఈ దివాళా కేసు 2022 నాటిది. వివేక్‌ ఇన్‌ఫ్రాకాన్‌కు చెందిన ఎస్సెల్‌ గ్రూప్‌, జి నెట్‌వర్క్‌కు చెందిన వివిధ కంపెనీలు బ్యాంకుల నుండి తీసుకున్న వందల కోట్ల అప్పులకు సుభాష్‌ చంద్ర వ్యక్తిగత హామీ ఇచ్చాడు. అప్పు తీసుకున్న కంపెనీలు తిరిగి చెల్లించకుండా దివాళా తీశాయి. దీంతో పూచీదారుగా (జామీన్‌దార్‌) వున్న సుభాష్‌ చంద్ర ఈ అప్పులు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. దీంతో వివాదం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) కి చేరింది. బ్యాంకులు, ఎల్‌ఐసి, ఇతర ఆర్థిక సంస్థల నుండి అప్పు తీసుకున్న కంపెనీలు, వాటిని తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తివేస్తే ఈ అప్పులు ఇచ్చిన సంస్థలను కూర్చోబెట్టి పంచాయితీ చేయడం కోసం ఈ ట్రిబ్యునల్‌ ను మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణకు వచ్చే లోపు రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చిన సుభాష్‌ చంద్ర తన ఆస్తుల విలువలను తారుమారు చేశాడు. బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు వ్యక్తిగత హామీ ఇచ్చే ముందు సంపన్నుడుగా వున్న సుభాష్‌, చెల్లించాల్సి వచ్చే సరికి దివాళా తీశాడట. 2017లో సుభాష్‌ చంద్ర ఆస్తి రూ.45,800 కోట్లు, 2018లో రూ.40 వేల కోట్లు. ప్రస్తుతం రూ.36 కోట్లకు దిగజారిందంటున్నాడు. కేంద్ర పాలకుల అండదండలు వున్న కంపెనీల యజమానులంతా భారీ సంపన్నులు అవుతుంటే సుభాష్‌ చంద్ర మాత్రం ఇలా దివాళా తీయడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. 'మరక కూడా మంచిదే' అన్నట్లు దివాళా కూడా లాభమే అని ఈయన రుజువు చేశాడు. తన వ్యక్తిగత ఆస్తులు తగ్గాయి కాబట్టి రూ.6.5 కోట్లు మాత్రం చెల్లించగలనని ట్రిబ్యునల్‌ కు చెప్పుకున్నాడు. ఈ కేసును విచారించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు రావడంతో మూడో జ్యుడిషియల్‌ మెంబర్‌ నీలేష్‌ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబిసి) సెక్షన్‌ 114 కింద తీర్పు చెబుతూ రూ.22,006.57 కోట్ల అప్పుకు గాను, రూ. 6.5 కోట్లు ఇచ్చినా అదే 'మహాభాగ్యం' అని రుణ దాతల్లో 80.81 శాతం మంది అంగీకరించారని ప్రకటించి, తీసుకున్న అప్పులో 99.97 శాతం రద్దు చేశారు. వడ్డీ తగ్గినా అసలు తగ్గడానికి ఏ రుణదాతా అంగీకరించడు. అలాంటిది అసలులో 99 శాతం పైగా కోత కోసినా అంగీకరించిన ఆ దానకర్ణులు ఎవరు?

సుభాష్‌ చంద్ర ప్రతిపాదనకు అంగీకరించిన కంపెనీల్లో మూడు పెద్ద కంపెనీలు తన సొంత వదిన (అన్న భార్య) అయిన సుశీల గోయల్‌ కు చెందినవి. మరో రెండు కంపెనీలు సమీప బంధువులు, మిత్రులవి. వీటి పెట్టుబడుల విలువను బట్టి వీటికి ఓటింగ్‌ హక్కు విలువ ఉంటుంది. ఈ కంపెనీలన్నీ కుమ్మక్కయి రూ.6.5 కోట్ల ప్రతిపాదనకు అంగీకరించాయి. 6 శాతం ఓటింగ్‌ వున్న ఎల్‌ఐసి, 3 శాతం వున్న హెచ్‌డిఎఫ్‌సి, 1.6 శాతం వున్న కెనరా బ్యాంకు, ఇతర బ్యాంకులు వ్యతిరేకించినా వినే నాథుడు కరువయ్యాడు. రూ.13023.39 కోట్లు అప్పు ఇచ్చిన ఎల్‌ఐసికి ఈ తీర్పు వల్ల దక్కేది కేవలం రూ.38,09,294. రూ.775 కోట్లు ఇచ్చిన హెచ్‌డిఎఫ్‌సి, రూ.348 కోట్లు ఇచ్చిన కెనరా బ్యాంకు, రూ.164 కోట్లు ఇచ్చిన యూనియన్‌ బ్యాంకు నిండా మునిగిపోనున్నాయి.

కార్పొరేట్లకు దోచిపెడుతున్న తీరు

దివాళా తీసిన లేదా నష్టాల్లో ఉన్న కంపెనీలను ఇన్సాలెన్వీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబిసి) కింద పరిష్కారం చేయడం కోసం 2016లో మోడీ ప్రభుత్వం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా చేసిన పంచాయితీ ముద్దు పేరు 'హెయిర్‌ కట్‌' విధానం. ఐబిసి నివేదకను పరిశీలిస్తే ఎవరి తలను ఎవరు గొరిగారో స్పష్టంగా అర్థమవుతుంది. గత పది సంవత్సరాల్లో ఈ ట్రిబ్యునల్‌ ద్వారా రూ.14.14 లక్షల కోట్ల రుణాలు ఇచ్చిన రుణదాతలకు వెనక్కి వచ్చింది కేవలం రూ.4.32 లక్షల కోట్లు మాత్రమేనని ఐబిసి లెక్కలు చెబుతున్నాయి. రామదాసు బతికివుంటే 'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా' అని కాకుండా మరోలా పాడి వుండేవాడు. హెయిర్‌ కట్‌ విధానం ద్వారా లాభపడిన వారి జాబితా చాంతాడంత వుంది. అందులో వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌ దూత్‌ తాను తీసుకున్న అప్పులో 95 శాతం, రిలయెన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ 90 శాతం, అలోక్‌ ఇండిస్ట్రీ యజమాని గౌతమ్‌ థాపర్‌ 83 శాతం, మోన్నెట్‌ ఇస్పాత్‌ సంజీవ్‌ కుమార్‌ 74 శాతం రుణాలను ఎగ్గొట్టేశారు. వీరందరి వల్ల నష్టపోయింది మాత్రం ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు.

కార్పొరేట్‌ మరియు పెద్ద సంస్థలు తీసుకున్న రుణాలను గత 11-12 సంవత్సరాలలో భారతీయ బ్యాంకులు సుమారు రూ.10 లక్షల కోట్లను రైటాఫ్‌ చేశాయని పార్లమెంట్‌ లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ కంపెనీల రుణాల రద్దు కోసం పెట్టుకున్న మరో ముద్దు పేరు 'రైటాఫ్‌'. ఇలా రద్దు చేసిన సొమ్ముతో వి.బి గ్రామ్‌ జి పథకాన్ని పది సంవత్సరాలు, పి.ఎం కిసాన్‌ నిధి 15 సంవత్సరాలు కొనసాగించవచ్చు. ఈ రైటాఫ్‌ కథలో మరో కోణం ఉంది. ఈ విధానం ద్వారా దివాళా కంపెనీలను తక్కువ మొత్తంతో పెద్ద కంపెనీలు స్వాధీనం చేసుకుంటాయి. బ్యాంకు ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం ప్రధానికి అత్యంత ఆప్త మిత్రుడైన గౌతం అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసుకున్న ఇలాంటి 10 కంపెనీల నుండి బ్యాంకులకు రావలసింది రూ. 62,000 కోట్లు. కానీ కేవలం రూ.16,000 కోట్లకు చేజిక్కించుకున్నారు. బ్యాంకులు మాత్రం అసలులో 74 శాతం నష్టపోయాయి. వీటిని చౌకగా కొనుగోలు చేసిన అదానీ మాత్రం సంపన్నుడయ్యాడు. గీతాంజలి జెమ్స్‌, సోయా, రోటోమాక్‌ గ్లోబల్‌, జూమ్‌ డెవలపర్స్‌ వంటి 50 కంపెనీలు ఉద్దేశపూర్వకంగా అప్పులు ఎగ్గొట్టి ఇలా రైటాఫ్‌ ద్వారా లాభపడ్డాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన సమాధానం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2024 సెప్టెంబర్‌ 30 మధ్య భారతీయ బ్యాంకులు రూ.16,61,310 కోట్ల విలువైన రుణాలలో కేవలం 16 శాతం మాత్రమే వసూలు అయ్యాయని తెలిపింది.

రైతులకు మెతుకులే

దేశంలోని కోట్లమంది రైతులకు గత 12 సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా అందిన ఆర్థిక సహాయం రూ.6.28 లక్షల కోట్లు. కార్పొరేట్లు ఎగవేస్తున్న దాంట్లో ఇది అతి స్వలం. ఈ సహాయం రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోలేకపోతుంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, అమలు కాని కనీస మద్దతు ధరలు, రైతులను అప్పుల్లో ముంచుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడి అప్పులు తీర్చలేని కారణంగా వేలాది మంది రుణగ్రస్త రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, రోజువారీ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి పేదలు, అణగారిన వర్గాల వారు తీసుకున్న చిన్న మొత్తాల్లో 74 శాతం తిరిగి వసూలు అవుతుండగా, రూ.100 కోట్లకు పైగా అప్పులు తీసుకున్న 'పెద్దలు' తిరిగి చెల్లిస్తున్నది కేవలం 14.5 శాతం మాత్రమేనని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. పేదల ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ఆటంకమని చెప్పే కొందరు మేధావులు కార్పొరేట్ల నిలువు దోపిడి గురించి మాట్లాడకపోవడం విచారకరం. సుమారు తొమ్మిది కోట్ల మంది యువత ఏ పనీ లేకుండా జీవిస్తున్నారు. కార్పొరేట్ల నుండి చట్టబద్దంగా రావలసిన రుణాలను, పన్నులను వసూలు చేయగలిగితే అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు నిర్మించవచ్చు, తద్వారా కొద్దిమందికైనా ఉపాధి కల్పించవచ్చు. దేశ సంపదను దోచిపెడుతున్న పాలకులకు, దోచుకుంటున్న కార్పొరేట్లకు వున్న బంధాన్ని ప్రశ్నించడం వైపు నేటి తరం దృష్టి పెట్టాలి.

- వి. రాంభూపాల్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్