గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెదవేగి పామాయిల్ కొత్త ఫ్యాక్టరీ కోసం...

1 గంట క్రితం

oil palm.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 05:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

దేశంలో జరుగుతున్న పామాయిల్‌ సాగులో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన వున్నది. మన రాష్ట్రంలో 5 లక్షల 66 వేల ఎకరాలలో సాగవుతున్నది. దాదాపు లక్ష 80 వేల మంది పామాయిల్‌ రైతులు ఉన్నారు. దాదాపు 20 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి జరుగుతున్నది. వీటి నుంచి 3.31 లక్షల టన్నుల ముడి పామోలిన్ ఉత్పత్తి అవుతున్నది.

మన రాష్ట్రంలో అత్యధిక ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు ఏలూరు జిల్లాలో అవుతున్నది. మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగిన విధంగా ఆయిల్ ఫెడ్ కర్మాగారాల నిర్మాణం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో వున్న ఎ.పి ఆయిల్ ఫెడ్ కర్మాగార నిర్మాణం 1992లో జరిగింది. ఇక్కడి యంత్రాలు కాలం చెల్లినవి కావడంతో...ఈ ఫ్యాక్టరీ సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల గెలలు క్రషింగ్ చేయాల్సి వుండగా... సగటున లక్ష టన్నుల గెలలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నారు. మిగిలిన వాటిని ఇతర ప్రైవేట్ ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారు. దీంతో ప్రైవేటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు రైతులను నిలువునా దోచుకుంటున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఎ.పి. ఆయిల్ ఫెడ్ పెదవేగి కర్మగారాన్ని పిపిపిపి పేరుతో ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేసింది. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తే, ప్రైవేటు కంపెనీలు చెప్పిన ధరే రైతులకు దక్కుతుంది. రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ప్రస్తుతానికి ప్రైవేటీకరణ నుండి వెనక్కి వెళ్ళింది.

పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి సంబంధించిన రూ.150 కోట్ల లాభాలను ప్రభుత్వాలు తమ అవసరాలకు దారి మళ్ళించాయి. పెదవేగిలో పాత కర్మాగారం స్థానంలో కొత్త ఆయిల్ పామ్ కర్మాగారం నిర్మాణం చేయాలంటే రూ. 200 కోట్ల నిధులు అవసరమౌతాయి. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్’ లో వేల కోట్ల రూపాయలు నిధులున్నాయి. వాటిలో ఆయిల్ ఫెడ్ కొత్త యూనిట్ నిర్మాణానికి రూ.200 కోట్ల ఆర్థిక సాయం అందించమని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఇవ్వకుండా ఉంటుందా? అందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరం. ​

మన రాష్ట్రంలో ఎప్పుడో 36 ఏళ్ల క్రితం నిర్మించిన పాత కర్మాగారం స్థానంలో కొత్త కర్మాగారాన్ని నెలకొల్పి రైతులకు న్యాయం చేయాలి. తెలంగాణ ఒ.ఇ.ఆర్ (నూనె వెలికితీత రేటు) ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయం జరగడాన్ని ప్రభుత్వాలు ఏమ్రాతం చిన్నతనంగా భావించడం లేదు. రైతులకు 20.01 శాతం ఒ.ఇ.ఆర్ ప్రకారం టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.23,770 వస్తోంది. మన ఒ.ఇ.ఆర్ ప్రకారం ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయం జరగాలంటే ఎ.పి.ఆయిల్ ఫెడ్ పెదవేగి ఫ్యాక్టరీ స్థానంలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం జరగాలి. ప్రభుత్వాలు నిధులు కేటాయించి నూతన టెక్నాలజీతో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. ఎ.పి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనను విరమించుకోవాలి. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు దిగుమతులకు ప్రాధాన్యత ఇచ్చి వంటనూనె పంటల సాగు చేస్తున్న రైతులను నిర్లక్ష్యం చేయడం తగదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలి. ఆయిల్ పామ్ కంపెనీలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఒ.ఇ.ఆర్ కు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసు ఉపసహరించుకోవాలి.


srinivas.jpg

వ్యాసకర్త : కె. శ్రీనివాస్
ఎ.పి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏలూరు.

సెల్ :94900 98574

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్