దేశంలో నిత్యం విద్వేషాన్ని పారించే పరివార గణానికి మూల విరాట్టు ఆర్ఎస్ఎస్ 101వ వార్షికోత్సవ వేళ ఆ సంస్థకు సారథ్యం వహిస్తున్న మోహన్ భగవత్ - విజయదశమి సందర్భంగా వల్లించిన సుభాషితాలు గురివింద సామ్యాన్ని గుర్తు చేశాయి. ఒకపక్క దేశ సౌభ్రాతృత్వం, సామరస్యం గురించి ఘనంగా కబుర్లు చెబుతూనే - సమైక్య భావనకు, సహోదర సంస్కృతికి చిల్లులు పెట్టే మతతత్వాన్ని బోధించటం ఆ సంస్థ సహజ నైజాన్ని బయటపెట్టింది. బిజెపి పాలన మీద ప్రజల అసంతృప్తి నిరసనల రూపం దాలుస్తున్న తరుణంలో మోహన్ భగవత్ తన మాటల ద్వారా మోడీకి కాపు కాయటానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అందులో భాగంగానే దేశ సమస్యల మీద గొంతెత్తుతున్న యువతరం మీద ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విషం కక్కారు. ఏ విద్వేషాన్ని రగిలించటం ద్వారా, ఏ వాస్తవ విరుద్ధ ప్రచారాలు సాగించడం ద్వారా సంఘ పరివారం అనుదినం దేశాన్ని దిగజార్చుతుందో- దానికి భిన్నమైన హితోక్తులతో ఉద్బోధ చేయటం ఓ నయవంచన. యువత నిరసనల గురించి సౌమ్యంగా మాట్లాడుతూనే దానిని దేశ వ్యతిరేక శక్తులకు ముడిపెట్టడం ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు ధోరణికి ఆనవాలు.
తన గురించి తాను గొప్పగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న పాత్ర సున్నా. ఆవిర్భావం నుంచి మతతత్వ భావనలతో సమైక్యతను విచ్ఛిన్నం చేసే విషబీజాలను నాటడమే పనిగా పెట్టుకొంది. సౌభ్రాతృత్వానికి, సామరస్యానికి కృషి చేసిన మహాత్మ గాంధీని గాడ్సే అనే ఉన్మాది దారుణంగా పొట్టన పెట్టుకోవటానికి కారణమైంది. ప్రపంచం ఆధునాతనంగా ముందుకెళుతున్నా ఇంకా మతోన్మాద పీఠం మీదనే అధికార కుర్చీ నిర్మించి, తన రాజకీయ శాఖ బిజెపిని అధిష్టించే పనిని చేస్తోంది. స్వదేశీ, స్వావలంబన గురించి మాటలు చెప్పే ఈ పరివారం మోడీ షా ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదం ముందు అనేక మోకరిల్లినా ఈ పన్నెండేళ్లలో ఒక్కసారి కూడా కిమ్మనలేదు. దేశ ఆత్మగౌరవానికి, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లినా పెదవి విప్పలేదు. మన వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే ఒప్పందాలకు తలవొంచినా, స్వతంత్రతను దెబ్బ తీసేలా విదేశాంగ విధానాన్ని పలుచన చేసినా ఆర్ఎస్ఎస్ నుంచి ఏనాడూ ఒక్క మాటా లేదు. తాము ఆచరణలో పాటించని ఈ అంశాలనే మోహన్ భగవత్ గొప్పగా వల్లించారు. మహిళల గౌరవం గురించి మాట్లాడడం మరీ విడ్డూరం. అత్యాచార కేసుల్లో శిక్షలు పడ్డ అనుయాయులకు పూలదండలతో ఘన స్వాగతాలు పలకటం, నిందితులకు మద్దతుగా మంత్రులు సైతం ప్రదర్శనల్లో పాల్గొనటం, మోడీని విమర్శించే మహిళలపై నానా రకాల బూతులతో విరుచుకుపడడం ... కాషాయ మూకలు ఒక పవిత్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్న వైనాలను చూసి దేశం నివ్వెరపోతూ ఉంది. ఐఐటీల్లోనూ ఈ సంస్థ అనుయాయులే చతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తూ పోస్టర్లు ప్రదర్శించటం, ఆవు మలమూత్రాల్లో అద్భుత ఔషధశక్తులు ఉన్నాయంటూ ఉపన్యాసాలు దంచటం వంటి దశలోనే దేశాన్ని ఉంచదలిస్తే- విశ్వగురువులం ఎలా అవుతాం? ఈ తరహా మూకలకు, వెనుకపట్టు విన్యాసాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని ఈ సంస్థ ఏనాడైనా చేసిందా అంటే సమాధానం శూన్యం. అలాంటిది పండగ పూట పనిగట్టుకొని ప్రవచనాలు వినిపించటం ఎవరి చెవుల్లో కమలాలు పెట్టటానికి?
ప్రజలు ఆనంద సందళ్లతో జరుపుకునే పర్వదినాలను కూడా సంకుచిత మతవాదులు దిగజార్చుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. హిందువులు జరుపుకునే పండగల వద్ద ఇతర మతాల వారి ఉనికిని సహించలేని వికృత చేష్టలు సామరస్యానికి, సౌభ్రాతృత్వ భావనకు గండి కొడుతున్నాయి. ఈ దసరాకు ఢిల్లీలోని రాంలీలా మైదానం మొత్తాన్ని బిజెపి జెండాలతో, మోడీ ఘనతలతో నింపేయడం, బొద్దింక దిష్టిబొమ్మను దహించి, నిరసనలను ఎద్దేవా చేయడం నిర్వాహకుల బుద్ధిమాంద్యానికి నిదర్శనం. ఇది అక్కసు ప్రదర్శనే తప్ప అందరి మధ్య ఐక్యతను పెంచే ప్రయత్నం కానేకాదు. నిరసనలు ప్రజాస్వామ్యంలో సహజమేనని పేర్కొంటూనే - అవి దేశ వ్యతిరేక కుట్రలంటూ మోహన్ భగవత్ వాక్రూచ్చటం ఆర్ఎస్ఎస్ నిజరూపాన్ని బట్టబయలు చేసింది. చాలా పరిణతితో శాంతియుతంగా త్రివర్ణపతాకాలను చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను, యువజనులను విధ్వంసకులుగా, విద్రోహులుగా చూడడం సంకుచిత దృష్టికి సంకేతం. తన దేశ యువతను తానే అవమానిస్తున్న ఉదంతాలు బిజెపి పాలనలో కోకొల్లలుగా ఉన్నాయి. ఏ ఆధారమూ లేకుండానే విదేశీ నిధులు, విదేశీ క్రుటలు అంటూ యువతపై ఆరోపణలు చేయటం పన్నెండేళ్ల పాలన చేతగానితనానికి చిహ్నం.
నీట్ పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగం, ఓటుహక్కును ధ్వంసం చేస్తున్న చట్టవిరుద్ధ వ్యవహారాలు ఒకపక్క కనిపిస్తున్నాయి. నిరసనలపై తీవ్ర నిర్బంధం, ప్రజాస్వామ్య స్వరాలను వినలేని నిరంకుశ ధోరణి మోడీ–షా ప్రభుత్వంలో తిష్ట వేసుకొని ఉంది. ఆర్ఎస్ఎస్కు చేతనైతే ఈ దేశపు నిజమైన సమస్యలను పరిష్కరించేలా తన రాజకీయ శాఖకు దిశానిర్దేశం చేయాలి. లేదంటే గురివింద భాష్యాలు చెప్పటం మానుకోవాలి. ఎవరేం చేస్తున్నారో దేశం గమనిస్తూనే ఉంది. విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి, బతకలేనంతగా భారాలు పెరుగుతున్న సామాన్యుల ఆర్థిక దుస్థితి ఆగ్రహంగా మారుతోంది. ఉద్వేగాలు, ఉన్మాదాల వ్యాప్తితో ప్రజలను మభ్యపెట్టే నక్కజిత్తులు, పాత జిమ్మిక్కులు ఇక చెల్లవు.







కామెంట్లు (0)