ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒక వీధికుక్క ఆత్మకథ

41 నిమిషాల క్రితం

VEDHIKUKKA KATHA BOMMA.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:43 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

నా పేరు 'టైగర్'. పేరుకు టైగరే కానీ, నేను గాంధీనగర్ సెంటర్లోని ఓల్డ్ ఎంపీ ఆఫీస్ పక్క సందులో తిరిగే సగటు వీధికుక్కను. ఉదయాన్నే పేపర్ బాయ్ విసిరే పత్రికల నుంచి, అర్ధరాత్రి డిబేట్లు ముగించుకుని టీ కొట్టు దగ్గర గొడవపడే రాజకీయ కార్యకర్తల వరకు. ఈ ఊరి డిజిటల్, ఫిజికల్ రాజకీయాల్ని అత్యంత దగ్గరగా చూసే ‘ప్రత్యక్ష‍ సాక్షిని' నేను.

మనుషులు నన్ను చూసి "పాపం వీధికుక్క" అని చులకనగా చూస్తారు. కానీ నాకు తెలిసిన రాజకీయ విశ్లేషణ, పొలిటికల్ స్ట్రాటజీలు ఈ టీవీ ఛానెళ్లలోని ఏ మైక్ పట్టుకున్న ఏ 'అనలిస్ట్' కూ తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఆఫీసుల్లో కూర్చుని స్క్రిప్టులు చదువుతారు; నేను మాత్రం నాయకుల నిజస్వరూపాలను, వాళ్ళ స్వేద వాసనలను స్వయంగా పసిగడతాను.

మా వీధిలో రాజు అనే జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఆయన ఇంట్లోనే నా ప్రపంచం వికసించింది. రాజు ఏవేవో పుస్తకాలు, పత్రికలు చదివేవాడు. ఆయన సావాసంతో నాకూ ఆ పత్రికలు, పుస్తకాలు చదివే వ్యసనం పట్టుకుంది. చెబితే నమ్మరు కానీ, మా వీధి చివర తిరిగే ఒక అందమైన పెంపుడు కుక్క 'టామీ'తో నాకు ఒకప్పుడు గాఢమైన లవ్ ఉండేది! కానీ ఈ పుస్తకాలు, పత్రికలు చదివే మత్తులో పడి ఆ లవ్‌ని కూడా పూర్తిగా మర్చిపోయేవాడిని. రాజు అర్ధరాత్రి దాకా కథలు, కవితలు రాస్తుంటే నేను పక్కనే కూర్చుని చదివేవాడిని.

రోజూ సాయంత్రం చిన్నాగాడి టీ కొట్టు దగ్గర రెండు మూడు న్యూస్ పేపర్లు స్టాండ్‌కు తగిలించి, పాత పత్రికలు ఆ పక్కనే పడేసి ఉంటాయి. వాటిమీద కూర్చోవడం నా అలవాటు. నా కింద నలిగిపోయే పత్రికల్లో పెద్ద పెద్ద నాయకుల రంగుల బొమ్మలు, ఒకరిపై ఒకరు చేసుకునే తీవ్రమైన ఆరోపణలు ఉంటాయి. మనుషులు ఆ వార్తలను చూసి బిపి పెంచుకుని, సర్కార్లను తిట్టుకుంటూ, రక్తం మరిగించుకుంటారు; నేను మాత్రం ఆ బొమ్మల మీద ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కునుకు తీస్తాను. అక్కడ మొదలవుతుంది మనిషి అజ్ఞానానికి, నా అనుభవ జ్ఞానానికి ఉన్న అసలు తేడా!


ఈ మధ్య మా నియోజకవర్గంలో ఉపఎన్నికల హడావుడి మొదలైంది. ఊరంతా ఫ్లెక్సీల మయమై పోయింది. ఎక్కడ చూసినా భారీ కటౌట్లు.

ఈసారి డిజిటల్ యుగం కదా! నాయకులు కేవలం కటౌట్లతో ఆగలేదు. వాళ్ళ 'ఐటీ సెల్' కుర్రాళ్ళు మా సందులో విపరీతంగా తిరగడం మొదలుపెట్టారు. ఏఐ డిజిటల్ టెక్నాలజీతో నాయకుడి ముఖాన్ని దేవుళ్ళ పటాలకు, బాహుబలి మాదిరి ఫొటోలకు అతికించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. మొన్నటికి మొన్న మా వీధిలో పెద్ద గుంతపడితే దాన్ని పూడ్చలేదు కానీ, సోషల్ మీడియా లైవ్‌లో మాత్రం ఆ రోడ్డు ఏదో సింగపూర్ గ్రీన్ వే లాగా, అమరావతి గ్రాఫిక్స్ లాగా ఏఐలో చూపించారు. ఆ వీడియో చూసి ఊళ్ళో జనం సంబరపడిపోయారు. రోడ్డుపై ఉన్న గుంతలో పడి కాలు బెణికిన నాకు మాత్రం అర్థమైంది. మనిషి కళ్ళతో చూసే నిజం కంటే, ఫోన్ స్క్రీన్ మీద కనిపించే ‘వర్చువల్ రియాలిటీ’నే ఎక్కువగా నమ్ముతున్నాడని!

ఎన్నికల ప్రచారం పరాకాష్టకు చేరింది. అభ్యర్థి ‘ధర్మారావు’ సాధారణంగా ఏసీ కారు దిగడు. కానీ ఎలక్షన్లు రాగానే ఆయన కాళ్ళకి ఉన్నట్టుండి భూమిపై నడిచే అద్భుతమడినశక్తి వచ్చేస్తుంది! తెల్లటి ఖద్దరు చొక్కా, కళ్ళజోడుతో మా వీధిలోకి వచ్చాడు. వెనకాల వంద మంది కుర్రాళ్ళు, చేతుల్లో లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలు, ఫోన్లు పట్టుకుని, ‘అన్నా.. నువ్వే మా నియోజకవర్గ భవిష్యత్తు!’ అని ఆర్టిఫిషియల్ హడావుడి చేస్తున్నారు.నేను చిన్నాగాడి టీ కొట్టు ముందర ఎండ కాగుతూ ముడుచుకుని పడుకున్నా. ధర్మారావు నేనున్న వైపు వచ్చాడు. పక్కనే ఉన్న ఆయన మేనేజర్ గట్టిగా అరిచాడు, ‘సార్! జంతు ప్రేమికుడిగా ఒక పిక్ తీస్తే రీల్స్ విపరీతంగా వైరల్ అవుతుంది! జనాల్లో మంచి పాపులారిటీ వస్తుంది!’.ధర్మారావు లేని నవ్వు ముఖం నిండా పులుముకుని, నా దగ్గరకు వంగి, నా తలపై నిమురుతూ, ఒక చౌకబారు బిస్కెట్ నా నోటికి అందించబోయాడు. కెమెరా ఫ్లాష్ లైట్లు, స్మార్ట్ ఫోన్ల లైట్లు మిరుమిట్లు గొలిపాయి. ఆయన నా వైపుచూస్తూ పళ్ళు ఇకిలించి ఫోజు ఇచ్చాడు. నేను ఆ బిస్కెట్ వైపు చూశాను. నాకు ఆకలిగానే ఉంది, కానీ నా ముక్కుకు ఆ బిస్కెట్ మీద ఉన్న ప్లాస్టిక్ వాసనతో పాటు, ఆయన చేతికి ఉన్న లంచాల ఘాటైన వాసన స్పష్టంగా తెలిసింది. నా అనుభవంలో నాకు ఒక విషయం అర్థమైంది.ఎన్నికలప్పుడు ఉచితంగా ఇచ్చే హామీలైనా, ఈ బిస్కెట్లైనా.. వాటి వెనుక మనల్ని బానిసలుగా మార్చే పెద్ద ఎర ఉంటుంది. ‘ఏ మాటల వెనుక ఏ అంతరార్థం దాగుందో తెలుసుకోలేనంత కాలం మోసపోతూనే వుంటారు’అని నా ఫ్రెండ్‌ లైబ్రరీలో చదివింది గుర్తొచ్చింది.

‘‘అది మనుషులకు వర్తించేది మనకు కాదులే’’ అనిపించినా... ఆ బిస్కెట్‌ను ముట్టుకోలేదు. వాసన చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాను.

కానీ సోషల్ మీడియా కింగ్స్ ఊరుకుంటారా? మరుసటి రోజుకి నా ఫోటోను ఏఐతో ఎడిట్ చేసి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ద్రతగా వుండే మ్యూజిక్ పెట్టి రీల్స్ వదిలారు:

‘సామాన్య జీవుల పట్ల కూడా అపారమైన ప్రేమ! మన నాయకుడి హృదయం స్వర్ణమయం! ముక్కుమొహం తెలియని వీధికుక్కను కూడా ఆప్యాయంగా పలకరించిన మన ప్రజా నాయకుడు!’ అని క్యాప్షన్ రాశారు. ఆ రీల్‌కు లక్షల్లో లైకులు, వేలల్లో షేర్లు, కామెంట్లు! జనం కామెంట్లలో ‘ఆయనే మా దేవుడు’ అని రాస్తున్నారు.

ఆ రీల్ చూసి నా లవర్‌ ‘టామీ’ హడావుడిగా వచ్చి, ‘ఏరా టైగర్, నువ్వు రాత్రికి రాత్రే స్టార్ అయిపోయావ్! ఆయన నిజంగానే జంతు ప్రేమికుడేమోరా?’ అంది అమాయకంగా.

నేను బిగ్గరగా అరిచి, ‘ఒయ్ పిచ్చి నా టామీ! మనుషుల మాటలు, సోషల్ మీడియా రీళ్ళు నమ్మడం అంటే, ఎండిపోయిన ప్లాస్టిక్ ఎముకను నమలడం లాంటిది! ఆగాగు, కొద్దిరోజులు పోతే అసలు రంగు బయటపడుతుంది’ అని చెప్పాను.

ఆ రోజు రాత్రి నా ఫ్రెండ్‌ కూడా అదే అన్నాడు. ‘చూశావా టైగర్.. ఈ రాజకీయాన్ని? నీ నిరసనను కూడా వాళ్ళ ప్రచారంగా మార్చేసుకున్నారు!’ అన్నాడు నవ్వుతూ... నా ఫ్రెండ్‌ వైపు చూసి, బిగ్గరగా ఒకసారి మొరిగాను. అది ‘వీళ్ళ బుద్ధి మారదురా సామీ!’ అని చెప్తున్నట్టే ఉంది.


వారం రోజులు గడిచాయి. ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. ధర్మారావు గారే గెలిచారు. టపాకాయల మోతలు, బిర్యానీ ప్యాకెట్ల పంపిణీలు, మందు సీసాల గొడవలతో గాంధీనగర్ సెంటర్ అట్టుడికిపోయింది. ఆ రాత్రి వేసిన చెత్తంతా రోడ్డు మీదే పడి ఉంది.మరుసటి వారం అనూహ్యంగా కుండపోత వర్షం పడింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక, రోడ్డంతా మోకాళ్ళ లోతు మురికినీటితో నిండిపోయింది. ఆ మురికినీటిలో ఈదుకుంటూ, నా శరీరం తడిసి ముద్దయిపోతే, ఏదైనా పొడి ప్రదేశం కోసం చిన్నాగాడి టీ కొట్టు కప్పు కిందకు వెళ్ళాను. సరిగ్గా అదే సమయంలో, ధర్మారావు కొత్త హంగుల ప్రొటోకాల్ కారు సైరన్ మోగిస్తూ... అదే మురికి రోడ్డు గుండా వేగంగా వెళ్ళింది. కారు వేగానికి రోడ్డుపై ఉన్న గుంతల్లోని మురికినీరు, బురద సరిగ్గా నా ముఖం మీద, అక్కడ నిలబడిన జనం మీద చిమ్మాయి.

ధర్మారావు దృష్టి నాపై పడింది. ఈసారి అక్కడ కెమెరాలు లేవు, పిఆర్ టీమ్ లేదు, ఐటీ సెల్ రీల్స్ లేవు. కారు అద్దం కొద్దిగా కిందకు దిగింది. లోపల ఏసీ గాలిలో కూర్చున్న ఆయన నా వైపు, అక్కడున్న ప్రజల వైపు చూసీచూడనట్టుగా చూసి ముఖం ముడుచుకుని, "ఛీ.. చెత్త నా కొడుకులు, రోడ్డంతా ఈ కుక్కల గోలేంటి! డ్రైవర్.. త్వరగా పోనియ్!" అన్నాడు. నేను నా శరీరాన్ని ఒకసారి గట్టిగా ఊపి, నా మీద పడ్డ మురికినీటి చుక్కలను విసిరికొట్టాను. అక్కడ ఉన్న ప్రజలు తమ బట్టలకు అంటిన బురదను తుడుచుకుంటూ నాయకుడిని తిట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్లను చూసి నా మనసులోనే నవ్వుకున్నాను—

"మమ్మల్ని మీరు 'విశ్వాసానికి ప్రతిరూపం' అని పొగుడుతారు, అవసరం తీరాక 'వీధికుక్కలు' అని ఈసడించుకుంటారు. కానీ మీకంటే మేమే ఎంతో నయం. మేము ఆకలేస్తేనే అరుస్తాం. మా పరిధిలోకి వేరే కుక్క వచ్చి మా తిండిని లాక్కుంటేనే పోట్లాడతాం. ఎలాంటి ముసుగులు లేకుండా, ఏఐ ఫిల్టర్లు లేకుండా ఉన్నది ఉన్నట్లు జీవిస్తాం."

"కానీ మీరు? ఐదేళ్ళకోసారి ఓట్ల కోసం నాటకాలాడుతారు. మీ స్వార్థం కోసం పొత్తులు మారుస్తారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రేమలు ఒలకబోస్తారు. గెలిచాక మిమ్మల్ని గెలిపించిన ప్రజల ముఖం మీదే మురికినీళ్ళు చిమ్మి వెళ్తారు. మనుషులు మమ్మల్ని చూసి 'కుక్క చావు', 'కుక్క బతుకు' అని తిడతారు. కానీ నిలకడ లేని, నిజాయితీ లేని ఈ రాజకీయ రంగుల బతుకు కంటే మా వీధికుక్క బతుకే సో బెటర్‌!"

సాయంత్రానికి వర్షం తగ్గింది. చిన్నాగాడి టీ కొట్టు మళ్ళీ తెరుచుకుంది. టీస్టాల్‌ ముందున్న స్టాండ్‌కి వేలాడుతున్న పేపర్‌లో ధర్మారావు విజయోత్సవ భారీ ప్రకటన ఉంది. నేను మెల్లగా ఆ పేపర్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఉన్న నాయకుడి రంగుల బొమ్మపై నా వెనుక కాలు కాస్త పైకి లేపి... ఒక సగౌరవమైన వీధికుక్కగా నా ప్రజాస్వామ్య నిరసనను వ్యక్తం చేశాను.


ఆ తర్వాతి వారం... మా వీధిలో ఉన్న పేదల గుడిసెల స్థలాన్ని రాత్రికి రాత్రే ఖాళీ చేయించడానికి ఆయన అనుచరులు బుల్డోజర్లతో వచ్చారు. ఆ స్థలంలో పెద్ద షాపింగ్ మాల్‌ కడతారట!

అక్కడ ఉన్న మహిళలు, పిల్లలు రోడ్డుపై పడి ఏడుస్తుంటే, నేను తట్టుకోలేకపోయాను. నా ఫ్రెండ్‌ కూడా తన కెమెరాతో ఆ దారుణాన్ని షూట్ చేయడానికి పరుగెత్తాడు. నేను కూడా ఆయన వెనకాలే వెళ్ళాను.

అధికార దర్పం వెలగబెడుతూ అక్కడే వున్న ధర్మారావును చూసి.…

"ఎన్నికల ముందు మహిళల రక్షణ, పేదల సంక్షేమం అని చెప్పారు కదా సార్? ఇప్పుడేంటి ఈ దౌర్జన్యం?" అని నా ఫ్రెండ్‌ గట్టిగా అడిగాడు.

ధర్మారావు నవ్వి, "ఏయ్ జర్నలిస్ట్! ఎన్నికల ముందు చెప్పేవి మాటలు... గెలిచాక చేసేది రాజకీయం! ఎక్కువ మాట్లాడితే నీ మీద ఏదోక కేసు పెట్టించి లోపలేయించేస్తా…’’ అని బెదిరించాడు. ఆ మాట వినగానే నా రక్తం ఉడికిపోయింది. మనుషులు ఎంత నీచంగా మారగలరో అర్థమైంది. ఈ మనుషులు నన్ను 'కుక్క' అని తిడతారు కానీ, ఏ కుక్కా తన తోటి కుక్కకు నివాసం లేకుండా చేయదు. ఏ కుక్కా మాట ఇచ్చి మోసం చేయదు. తన జాతి ఆడకుక్కలపై దౌర్జన్యాలు చేయదు.

మెల్లగా ధర్మారావు వైపు అడుగులు వేశాను. ఆయన వేసుకున్న ఖరీదైన షూస్ పక్కన నిలబడ్డాను. నన్ను చూసి "ఛీ.. వెళ్ళు అవతలికి, వీధికుక్క!" అని కాలితో తన్నబోయాడు.

ఈసారి బిస్కెట్ తిరస్కరించినంత అమాయకంగా ఊరుకోలేదు.

నా వెనుక కాలు పైకి లేపి, ఆయన బ్రాండెడ్ కారు చక్రం మీదా, ఆయన లగ్జరీ షూస్ మీదా... ఒక సగౌరవమైన నిరసనను వ్యక్తం చేశాను!

"అయ్యో! ఛీ పాడు కుక్క" అని అరుస్తూ వెనక్కి తగ్గాడు.

ఆయన అనుచరులు నా వైపు కర్రలతో వచ్చారు.

నేను సమాజంలోని అసలు రంగులను, రాజకీయంలోని మురికిని అర్థం చేసుకున్న 'చదువుకున్న వీధికుక్కను'! వాళ్ళు నన్ను పట్టుకునే లోపే తోక ఎత్తి, నా ఫ్రెండ్‌ లైబ్రరీ వైపు పరుగెత్తాను.

నా ఫ్రెండ్‌… తన స్టడీ రూమ్‌లో కూర్చొని కిషన్‌ చందర్‌ రాసిన "ఒకానొక గాడిద ఆత్మకథ" పుస్తకం చదువుతున్నాడు. ఆయన్ని డిస్ట్రబ్‌ చేయకుండా, ఆయన పక్కనే రెండుకాళ్లపై కూర్చొని నేను కూడా చదవడం మొదలెట్టాను.

ఆ పుస్తకం చదువుతున్న కొద్దీ నాక్కూడా దేశమంతా తిరిగిరావాలనే కోరిక కలిగింది. కానీ, ‘‘ఎలా వెళ్లడం’’ అని ఆలోచిస్తూ.... హాయిగా నిద్రలోకి జారుకున్నాను.​

రాజాబాబు కంచర్ల

9490099231


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్