భూమి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో పారిశ్రామిక అవసరాల నిమిత్తం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రత్యేక విధానం తీసుకొచ్చేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం లంకించుకున్న ప్రయత్నాలు ఇప్పటికే కునారిల్లుతున్న ఆహార ధాన్యాల సేద్యానికి ఉరి తాడు పేనడమే! తిండి గింజలకు వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. బియ్యం అవసరాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. దేశ ఆహార భద్రతకు తూట్లు పొడుస్తుంది. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మూడు ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న తరుణంలో, వాటి ప్రగతిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో భూమి లభ్యత తక్కువగా ఉండటం మూలంగా పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని తెగ బాధ పడ్డారు. సిఎం పేర్కొన్న జిల్లాలు తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టిఆర్, కృష్ణా. ఇంకా పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని సమాచారం. ఈ జిల్లాలన్నీ వరి విస్తారంగా పండే ప్రాంతాలు. గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలో సాగునీటికి గ్యారంటీ ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పేరు గాంచింది అందుకే. ఎల్నినో సంవత్సరాల్లోనూ ఒక మేరకైనా వరి సాగైంది. అలాంటి చోట్ల కార్పొరేట్ల కోసం భూములు దొరకట్లేదని సిఎం మధన పడటం చూస్తుంటే వ్యవసాయం దండగ అనే ప్రచారాన్ని ఆచరణలో నిజం చేస్తున్నట్లు కనిపిస్తుంది. సాగును సమాధి చేసైనా కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేయాలన్న తాపత్రయం గోచరిస్తుంది.
కార్పొరేట్లకు భూముల పందేరంలో ప్రభుత్వానికి రాజ్యాంగమన్నా, చట్టాలన్నా, రైతుల, కూలీల, ప్రజల జీవనోపాధి అన్నా లెక్క లేదని ఇప్పటికే పలు సందార్భాల్లో నిరూపితమైంది. 2013- భూసేకరణ చట్టం ప్రకారం ఆహార ధాన్యాలు, బహుళ పంటలు పండే సారవంతమైన భూములను పారిశ్రామిక అవసరాలకు తీసుకోకూడదు. అమరావతి సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఆ నిబంధనను ఉల్లంఘించించింది. గిరిజన ప్రాంతాల్లో భూమికి భూమి ఇవ్వాలన్న రాజ్యాంగ నిర్దేశం, పీసా సహా పలు చట్టాలను ధిక్కరించి భూములను బలవంతంగా లాక్కొంటోంది. వరి విస్తారంగా పండే పచ్చని డెల్టాలను సైతం కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సై అంటోంది. ఇప్పటికే ప్రభుత్వ విధానాల వలన వరి సాగు తగ్గుతోంది. ఆక్వా వచ్చి 18 లక్షల ఎకరాల్లో వరి సాగు లేకుండా చేసింది. అది చాలదన్నట్లు వరి నేలలను కార్పొరేట్లకు ఇచ్చేందుకు సర్కారు విధాన రూపకల్పన చేస్తోంది. విభజిత ఎపిలో 2013-14లో 65 లక్షల ఎకరాల నికర సాగు భూమి ఉండగా ప్రస్తుతం 48 లక్షల ఎకరాలకు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ కాలంలో లక్ష ఎకరాల కంటే ఎక్కువ సాగు భూములు వ్యవసాయేతరాలకు మారాయి. ఈ ధోరణి ఇంకా ఊపందుకుంది. ఇది భవిష్యత్తులో తిండి గింజల కొరత సృష్టిస్తుంది. ఎల్నినో వలన ఈ ఏడాది వరి సాగు తగ్గిందని మార్కెట్లో బియ్యం ధరలను పెంచేశారు. మొత్తానికే విస్తీర్ణం లేకపోతే అన్ని రోజుల్లోనూ ధరల మంట ఎదుర్కోవాలి.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘వికసిత భారత్ 2047’కు కొనసాగింపుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ యావత్తూ ప్రభుత్వ, ప్రైవేటు భూములను కార్పొరేట్లకు దోచిపెట్టాలన్న వ్యూహం కనిపిస్తుంది. కార్పొరేట్ల ప్రాపకం కోసం ప్రభుత్వం ఎక్కడిదాకా వెళ్లిందంటే... ఎవరైనా పెట్టుబడిదారు వాట్సాప్లో జస్ట్ మెసేజ్ పెడితే చాలు, క్షణాల్లో ప్రభుత్వం అన్నీ చూసుకుంటుంది అని ఇటీవల విశాఖ వేదికగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ల రక్షణకు ప్రత్యేక చట్టమే తెస్తామన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు, ప్రభావితులవుతున్న వ్యవసాయ కార్మికులకు, స్థానిక ప్రజలకు, పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వాలు పూచీ పడాలి. అందుకు విరుద్ధంగా కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తామనడం కార్పొరేట్ల సేవలో ప్రభుత్వ బరితెగింపు. ఎకరా 99 పైసలకే ఇవ్వడం దగ్గర నుంచి, 5 లక్షల ఎకరాలు కార్పొరేట్లకు దోచి పెట్టేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా భూములు సేకరిస్తే సమీప భవిష్యత్తులో వ్యవసాయం, రైతు చరిత్రలోనే కనిపిస్తారు!!








కామెంట్లు (0)