ఇంటా బయటా మొట్టికాయలు పడుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మారకపోవడం 'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్న సామెతను గుర్తు చేస్తోంది. న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా, దేశ ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నా- ఆయన తీరు మారడం లేదు. సుంకాలు పెంచడం, చర్చల పేరుతో తగ్గించడం, మళ్లీ పెంచుతామని బెదిరించడం అమెరికా వాణిజ్య విధానంలో పరిపాటిగా మారింది. అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద అధ్యక్షుడు విధించిన విస్తృత సుంకాలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేసినా, ట్రంప్ తన పద్ధతిని మార్చుకోలేదు. చట్టంలోని లొసుగును ఉపయోగించుకుని, భారత్ సహా 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై తాజాగా సుంకాల పెంపును ప్రతిపాదించారు. తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే సుంకాన్ని 17 శాతానికి పరిమితం చేస్తామని, లేకుంటే 25 శాతం వరకు అదనపు సుంకాలు విధిస్తామని భారత్‌ను బెదిరించారు. షరతుల మధ్య ఇరికించి లొంగదీసుకోవాలన్న ట్రంప్ వ్యూహం అమెరికా ఆధిపత్య ధోరణికి నిదర్శనం.
ఈ బెదిరింపుల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కుదిరిన అవగాహన చర్చనీయాంశం అవుతోంది. ఈ ఒప్పందం కుదిరితే అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు పశువుల దాణా, ఎర్ర జొన్న, పండ్లు, సోయాబీన్ నూనె, ఇతర వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు భారత మార్కెట్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. ఎలాగైనా ఒత్తిడి తెచ్చి, అంగీకరింపజేసేందుకు అమెరికా ఇప్పుడు సుంకాల పెంపు పేరుతో హూంకరిస్తోంది. అమెరికా వ్యవసాయ రంగానికి భారీ ప్రభుత్వ రాయితీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విస్తారమైన ఉత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. అక్కడి నుంచి తక్కువ ధరలకు ఉత్పత్తులు దిగుమతి అయితే భారత రైతులు వాటితో పోటీపడటం కష్టమవుతుంది. ఇప్పటికే సాగు పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఇది గోరుచుట్టు మీద రోకటిపోటు అవుతుంది. ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ వాణిజ్య ఒప్పందం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసి కూడా వ్యవసాయ మార్కెట్‌ను తెరవడం ప్రమాదకరం. అమెరికా హామీలపై ఆధారపడి దేశ వ్యవసాయ ప్రయోజనాలను పణంగా పెట్టడం ఆత్మహత్యాసదృశం అవుతుంది. మోడీ ప్రభుత్వం లొంగుబాటు వైఖరి ప్రదర్శించడం వల్లనే ఈ ఒప్పందం ఇంతవరకూ వచ్చింది. మన దేశ రైతాంగ ప్రయోజనాలపై స్పష్టంగా, సూటిగా, నికరంగా నిలబడి ఉంటే వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదు.
అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, ద్రవ్య సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ బడ్జెట్ లోటు, పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం, ధరల పెరుగుదల, ప్రజలపై జీవన వ్యయ భారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అంతర్జాతీయంగా తన పెత్తందారీతనాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధాలు, ఇతర దేశాల మార్కెట్లపై ఆధిపత్య ప్రయత్నాలు, వాణిజ్య ఆంక్షలు వంటి విధానాలను ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తోంది. తన ఆర్థిక సంక్షోభ భారాలను ఇతర దేశాలపైకి నెట్టేయడానికి సుంకాలను ఆయుధంగా ప్రయోగిస్తోంది. అయితే ఈ విధానాల వల్ల అమెరికా కార్పొరేట్లకు తప్ప ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. దిగుమతి సుంకాల భారం సరుకుల ధరల పెరుగుదల రూపంలో వినియోగదారులపై పడుతోంది. యుద్ధాలు, అంతర్జాతీయ ఘర్షణలు ఆర్థిక భారాలను మరింత పెంచుతున్నాయి. ఈ విధానాలపై అమెరికా ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం, డెమొక్రాట్లు, సోషలిస్టులు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిక్యం సాధించడం ఈ అసంతృప్తికి అద్దం పడుతోంది. అయినా ట్రంప్ బుద్ధి మారకపోవటం అనేది తన వ్యక్తిగత వైఖరి మాత్రమే కాదు; అమెరికా ఆధిపత్య ధోరణికి, కార్పొరేట్ల వ్యాపార దాహానికి కూడా ఆనవాలు.
అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగించడం వేరు, ఆ దేశ ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా మన విధానాలను మార్చుకోవడం వేరు. మోడీ ప్రభుత్వం అమెరికా నిర్ణయాలకు తరచూ తలూపడం దేశ ప్రయోజనాలకు ప్రమాదకరంగా పరిణమించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలోనూ, పత్తి దిగుమతిపై సుంకాల తగ్గింపు విషయంలోనూ, అమెరికా దురాక్రమణ దాడులకు, యుద్ధోన్మాదానికి వంత పాడడం ద్వారానూ మోడీ ప్రభుత్వం మన స్వతంత్రతకు, సార్వభౌమత్వానికి తలవంపులు తెచ్చింది. అమెరికా మన దేశంపై ఎడాపెడా సుంకాలు విధించడంలోనూ, భారతీయుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టడంలోనూ తన అహంకార, ఏకపక్ష వైఖరిని కొనసాగిస్తూనే వచ్చింది. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే సుంకాలు పెంచుతామని బెదిరించడం దాని కొనసాగింపే. వాణిజ్య ఒప్పందాల పేరిట ఆంక్షలతో ఇతర దేశాలను లొంగదీసుకోవాలని చూడటం అహంకారపూరిత, ఆధిపత్య ధోరణికి నిదర్శనం. అమెరికా ఒత్తిడికి తలొగ్గి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల విషయంలో మోడీ ప్రభుత్వం ఇప్పటికే లొంగుబాటు వైఖరి ప్రదర్శించింది. దాని తాజా షరతులను అంగీకరిస్తే దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుంది. అమెరికా సంతృప్తి కోసం భారత రైతాంగ ప్రయోజనాలను, దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టడం తగదు.







కామెంట్లు (0)