శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition మావటీయం!

1 గంట క్రితం

satire - cartoon -maavateeyam(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:09 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అనగనగా ఓ రాజ్యం...

రాజు గారి అమ్మాయి ఎవర్నో ప్రేమించింది. ఆమె చెలికత్తెల్లో ఓ అమ్మాయి రాజు గారి గూఢచారిణి. అందిన సమాచారంతో, లోలోపల రగిలిపోయాడు రాజు. కారణం, సదరు ప్రేమికుడు కడు పేద కళాకారుడు. పైగా, సొంత పాటలు కాకుండా ఊరు పాటలు పాడతాడు. ఒక్కోసారి రాజ్యాన్ని పాటలతో ప్రశ్నిస్తాడు. అలాంటి వాడిని అల్లుడిగా అంతఃపురానికి తెచ్చుకుంటే, ఇంకేమైనా ఉందా? వాడు నిద్రపోడూ .. తనను నిద్రపోనివ్వడు! కొద్దిరోజుల తర్వాత యువరాణి, తన తల్లికి మనసులో మాట చెప్పింది. తల్లిగా ఆమె తన బాధ్యత నెరవేర్చింది. రాజావారికి సున్నితంగా మనవి చేసింది. అతనిలో కలవరం, కల్లోలమయింది.

పరిపాలన గాలికొదిలేసి, అంతఃపురంలోనే అన్య మనస్కంగా తిరుగాడుతున్న మహారాజు, పాశ్చాత్య పాత ద్రాక్ష రసం కూడా చప్పరించలేని పరిస్థితి.

మహామంత్రి గమనించాడు ఈ దుస్థితి. చనువుతో, చొరవ తీసుకుని ఒకానొక రాత్రి.. నిర్ణీత మద్యపాన క్షణాల్లో ఉపాయాన్ని రాజుగారి చెవిలోకి ప్రవేశపెట్టాడు. ఖాళీగా ఉన్న ఖజానాలో అజ్ఞాత భక్తుడు సమర్పించిన బంగారు ఇటుకులను చూసినట్టు, రాజావారి ముఖంలో ఆనందం వికటట్టహాసం చేసింది.

మరునాడు--

"తల్లీ! మనోరంజనీ!"-అనునయం, అనురాగం, అభిమానం ఇత్యాది దయ, ప్రేమ రసాల కలబోతలతో కుమార్తెను పిలిచి, ఆమె మనసు తెలుసుకున్నట్టు ముఖాభినయంతో.. నీ మనసుకు తగినట్టే మసలుకుంటాననే చూపులతో సందేశం ఇచ్చి పంపించాడు. ఆమె నమ్మింది. సిగ్గుల మొగ్గయి తండ్రికి చేరువుగా వచ్చింది.

" తధాస్తు తల్లీ! కానీ ' రాజూ -పేదా ' ఘట్టం ఇటువంటి సందర్భంలో రక్తి కట్టదు. రాచ సంప్రదాయానికి రాణింపు కాదు. మహా మంత్రి వారు మన వైభవానికి తగినట్టు మహా ఉపాయాన్ని సెలవిచ్చారు.. అదే స్వయంవరం! చిందించవలసిన చిరునవ్వులు చిన్నపాటి వరదలా ప్రవహించాయి అతని మోములో! ఎంతైనా తండ్రి ..నమ్మింది పిచ్చి తల్లి. మరికొన్ని అదనపు సిగ్గులు ముఖాన్ని ఆక్రమించగా, అరచేతుల్లో దాచుకుంటూ అక్కడ నుంచి పరుగు వంటి నడకతో నిష్క్రమించింది.

వారం రోజుల తర్వాత స్వయంవర ప్రణాళిక, విధి విధానాలను, వివిధ రాజ్యాలకు వినిపించే విధంగా మహామంత్రి దండోరా వేయించారు.

అది నిండు పున్నమి వెన్నెల.. రాజా వారి క్రీడా మైదానంలో ఏర్పాట్లు.. యువరాజులు, సంపన్నులు, శారీరక బల మదాంధులతో పాటు సదరు ప్రేమ పేద కళాకారుడు కూడా విచ్చేశాడు.. ఉన్నంతలో మంచి వస్త్రములతోనే!

మహామంత్రి లేచి-

" నూతన వరుని హోదా కోసం విచ్చేసిన అర్హులకు స్వాగతం.. సుస్వాగతం. కొద్ది క్షణాల్లో మా రాజ్య సంప్రదాయం ప్రకారం, మా రాచగజం.. వరమాలతో వచ్చి.. తమతమ ముఖారవిందములను, అంద చందములను పరిశీలించి.. నచ్చిన వారి కంఠ సీమకు వరమాల వేసి, ఎంపిక చేయిను"-ప్రకటించారు.

ఒకడు లేచి-"పెద్దలు మన్నించాలి. మనోరంజని మానవ రూపిణి.. ఆమెకు నిజము తెలియును గానీ, ఈ గజమునకు ఏమి తెలియును?"-అభ్యంతరం తెలిపాడు.

" మాకు రాచరికం కన్నా, సంప్రదాయమే శిరోధార్యం"అని చెబుతూ- "గజ వరమాలను ప్రవేశపెట్టండి"ఆదేశించారు. ఎంతైనా యువరాణి మానవ మాత్రిణి! ఎంతైనా మహారాణి..మాతృమూర్తి! కలవర పడుతున్నాయి మనసులు.

గజ వరమాల ప్రవేశించింది. తొండంతో మాలను ఎత్తి పట్టుకొని, నిశితంగా అభ్యర్థులను పరిశీలిస్తూ, కళాకారుని దగ్గర ఆగింది. ఇంతలో చిన్నపాటి కలకలం.. యువరాణి హృదయం ఝల్లుమంది. ఆ క్షణాలలో మావటివాడు, మహామంత్రి కనుసైగను స్వీకరించి, చిన్నగా ఏనుగు నెత్తిన అంకుశంతో పొడవటం ఎవరూ గమనించలేదు. కళాకారుడు గమనించినట్టు మాత్రం ఎవరికీ తెలియదు. ఏనుగు ముందు కదిలింది. ఒక సంపన్నుడి మెడలో మాల వేసింది.

కళాకారుడు దిగ్గున లేచి --

" అక్రమం.. ఏనుగును మావటివాడు నియంత్రించడం నేను కళ్లారా చూశాను ..ఇది బలవంతపు ఎంపిక" అంటూ, ఓ ధిక్కార గీతం ఆలపించబోయాడు.

డప్పును వెంట తీసుకొని రాకపోవడం వల్ల, ఆ ఉద్వేగాన్ని ..వేగంగా గానంగా.. మల్చలేకపోయాడు.

మహామంత్రి వెంటనే స్పందిస్తూ-" మా సంప్రదాయం ప్రకారం, మా గజరాజం ఎంపిక చేసిన వారే వరుడు.. మావటి కేవలం నిమిత్తమాత్రుడు. మా గజరాజము సామాన్యమైనది కాదు.. విజ్ఞాన ప్రాణి"అన్నారు.

" ఎంతటి విజ్ఞాన ప్రాణి ఐనా, మావటి వానికి లోకువే గదా! ఆ మావటికి జీతభత్యాలు ఇచ్చేది మీరే కదా!"-కళాకారుడిని ఇంకా నటరాజు ఆవహించలేదు.

" ఆపండి మీ వాచాలత్వం! ఇంద్రుని ఐరావతానికి మా రాజావారి గజరాజు సరిజోడు. దాని నామధేయం ప్రజాస్వామ్యం! "అన్నారు ఆగ్రహంతో.

జరిగిన మతలబు తెలియక జనం చప్పట్లు కొట్టారు. ఉక్రోషంతో వర అభ్యర్థులు చెల్లా చెదురయ్యారు. యువరాణి.. అశ్రు నయని! మహారాణి.. దీనవదన! మహారాజు మీసం మెలివేస్తూ మావటిని చూసి సగర్వంగా నవ్వాడు. మహామంత్రి కళ్ళల్లో ఆనందం తుళ్లింది.

" మహారాజు పేరు చంద్రుడే! మావటి పేరూ చంద్రుడే!! ఇద్దరు చంద్రులు.. ఒకటే మనసు!"-పకపకా నవ్వాడు.

గగనమున పున్నమి చంద్రున్ని ఓ అకాల మేఘం ఆవరించింది. క్రీడా మైదానంలో చీకటి చివురించింది.

- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్