డిసెంబరు 1వ తేదీ ఉదయం లక్ష మంది కార్మికులు ఎర్రజెండాలతో ఢిల్లీలో సమీకృతం కానున్నారు. తమ బాధలు, కష్టాలు, డిమాండ్లను పాలకులకు వినిపించేందుకు పార్లమెంటు వైపు కదం తొక్కనున్నారు. భారత కార్మిక వర్గం ఇంత భారీ స్థాయిలో సమీకృతమవడం ఒక అపూర్వ ఘట్టం కానుంది. సామాజిక, రాజకీయ జీవితంలో తమకు దక్కాల్సిన హక్కులను, గౌరవప్రదమైన స్థానాన్ని తిరిగి సాధించుకోవడమే ఈ పార్లమెంట్ మార్చ్ లక్ష్యం. ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు దేశ రాజధానికి తరలివచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
నాగరిక సమాజం, మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, జీవనోపాధి హక్కు కార్మికులు కోరుతున్నారు. రోజురోజుకూ కార్మికుల జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కూడా 2024లో ఎన్.సి.ఆర్.బి గణాంకాల ప్రకారం 52,910 మంది దినసరి కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే ప్రతి పది నిమిషాలకు ఒకరు బలవన్మరణాలకు బలవుతున్నారు. మరోవైపు ప్రమాదకర పని ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలు, వడదెబ్బలు, నిర్మాణాలు కూలిపోవడం వంటి ఘటనల్లో వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ప్రజలు పోషకాహార లోపం, దుర్భర పరిస్థితులతో బతుకులీడుస్తున్నారు.
ఇదే సమయంలో ‘సర్’ ప్రక్రియ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కుకు దూరమయ్యారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. సామాజిక భద్రతకు దూరమవుతున్నారు. అంటే వారి ప్రజాస్వామిక గొంతుకతో పాటు సామాజిక భద్రత కూడా హరించబడుతోంది.
న్యాయమైన వేతనాలు, జీవనోపాధి కోసం కార్మికులు పోరాడుతుంటే వారిని అరెస్టు చేస్తున్నారు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు, సుదీర్ఘకాలం జైళ్లలో నిర్బంధిస్తున్నారు. అందువల్ల జీవనోపాధి హక్కు కోసం జరుగుతున్న పోరాటం, ప్రాథమిక ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంగా మారుతోంది. సంఘటితమయ్యే హక్కు, నిరసన తెలిపే హక్కు, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు, న్యాయం కోరే హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు ఉద్యమిస్తున్నారు. అందుకే వీటితోపాటుగా జీవించే హక్కు, జీవనోపాధి హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు ఢిల్లీకి తరలివస్తున్నారు! దేశ పాలనలో పాతుకుపోయిన కార్పొరేట్-మతతత్వ కూటమికి వ్యతిరేకంగా ఈ పోరాటం బలమైన నిరసనగా నిలవనుంది. కార్మిక వర్గం తమ ఐక్యతను, ధైర్యాన్ని, రాజీ లేని పోరాట పటిమను చాటేందుకు సిద్ధమవుతోంది.
ఈ పోరాటం ఒక చారిత్రాత్మక సందర్భంలో జరగబోతోంది. భారత్తో సహా ప్రపంచమంతా ఆగ్రహావేశాలతో, ప్రతిఘటనలతో అట్టుడుకుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, బ్రిటన్లలో యువతరం నిరసనలు; ఇటలీ, అర్జెంటీనా, కొలంబియాలలో కార్మిక సమ్మెలు, నిరాహార దీక్షలు; వివక్షకు, ప్రజాస్వామిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు పాలక వర్గాలను సవాలు చేస్తున్నాయి. బ్రెజిల్లో ఎన్నికల విజయం, అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు కూడా ఈ పెరుగుతున్న ప్రతిఘటనకు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. వీధుల నుంచి బ్యాలెట్ పెట్టెల వరకు ప్రజలు ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాల కోసం కదులుతున్నారు. దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు.
నయా ఉదారవాద సంక్షోభం వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్గత వైరుధ్యాలు మరింత తీవ్రం అవుతున్నాయనడానికి ప్రతిబింబం. దీర్ఘకాలిక మాంద్యం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల మార్కెట్లో వస్తువుల డిమాండ్ పడిపోవడం, అదే సమయంలో ఉత్పత్తి అధికమవడం ఈ వ్యవస్థ పరిమితులను స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ కార్మికుల కొనుగోలు శక్తి మాత్రం తగ్గిపోతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం లేదా సంపన్నులపై పన్నులు విధించడం వంటి చర్యలకు అంతర్జాతీయ ఆర్థిక మూలధనం అడ్డంకులు సృష్టిస్తోంది.
ఈ అమానవీయ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం, ఆకస్మిక నిరసనలు, సంఘటిత ఉద్యమాలు పెట్టుబడిదారీ వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రజాగ్రహాన్ని అణచివేసేందుకు పాలక వర్గాలు సహజంగానే విభజన రాజకీయాలు, నిరంకుశ పాలనను ఆశ్రయిస్తున్నాయి. మితవాద జాతీయవాదం, మతతత్వం, మైనారిటీలపై ద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అమెరికా సామ్రాజ్యవాదం తన సంక్షోభ భారాన్ని గ్లోబల్ సౌత్ దేశాలపై మోపాలని చూస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోతున్న మోడీ ప్రభుత్వం ఆ భారాన్ని భారత కార్మికులు, రైతులు, చిన్న ఉత్పత్తిదారులపై మోపుతోంది.
దీనికి తోడు కార్పొరేట్లకు భారీ రాయితీలు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల వాణిజ్యీకరణ, సబ్సిడీల కోత, వాణిజ్య విధానాలు...ప్రజా సేవలు, వ్యవసాయం, చిన్న పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం, కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లను తీసుకురావడం ప్రజల్లో అభద్రతను పెంచుతున్నాయి. వేతనాలను తగ్గిస్తున్నాయి. జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తున్నాయి. అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్న శ్రామిక ప్రజలపై సంక్షోభ భారాన్ని మోపుతున్నాయి.
రైతులు, ఆదివాసీలు కూడా ఇలాంటి దాడులనే ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, సాగు ఖర్చులు, విద్యుత్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన విధానాలు రైతుల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తున్నాయి. భూసేకరణ, సహజ వనరుల విధ్వంసం పెద్ద సంఖ్యలో ప్రజలను వారి నివాస ప్రాంతాల నుంచి తరిమేస్తున్నాయి. నీరు, భూమి, అడవుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం నేటి కార్మిక వర్గ పోరాటానికి భిన్నమైనది కాదు. ఈ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందనే విషయం ఇటీవల ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ద్వారానూ స్పష్టమైంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే – దేశ వనరులపై ఆధిపత్యం ఎవరిది? ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది?
గ్రామీణ కార్మికులు, రైతులు, ప్రాజెక్టు కార్మికులు, ఆదివాసీలు, విద్యార్థులు, సమాజంలోని ఇతర వర్గాల పోరాటాలను ఇప్పుడు కార్మిక వర్గం తమ పని ప్రదేశాల్లో జరుగుతున్న పోరాటాలతో అనుసంధానం చేయాలి. వారి డిమాండ్లను జాతీయ రాజకీయ చర్చలో ప్రధాన అంశాలుగా ముందుకు తీసుకురావాలి. కార్మికుల పార్లమెంటు భవన్ మార్చ్ ప్రాధాన్యత ఇదే!
డిసెంబరు 1 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల కార్మికులు ఢిల్లీలో సమీకృతమై పార్లమెంటు వైపు కదం తొక్కనున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు దేశంలోని వాస్తవ ప్రజాజీవితాన్ని తమతో పాటుగా తీసుకొస్తారు. దేశం కోసం శ్రమిస్తున్న లక్షలాది మంది టీ తోటల కార్మికులు, బీడీ కార్మికులు, నిర్మాణ కార్మికులు, విద్యుత్ కార్మికులు, బొగ్గు గని కార్మికులు, తయారీ రంగ కార్మికులు, రవాణా కార్మికులు, గిగ్ కార్మికులు, ప్రాజెక్టు కార్మికులు – ఢిల్లీకి తరలి వస్తున్నారు. అయినప్పటికీ పాలకులు వారి ఆవేదనను ఆలకించేందుకు సిద్ధపడటం లేదు. ఢిల్లీ ఈసారి కార్మిక వర్గ గొంతుకను వినాల్సిందే!
కార్మికుల డిమాండ్లు ఇవీ...
మొదటిది: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధిని వాస్తవ రూపంలో పునరుద్ధరించాలి. చట్టబద్ధమైన హక్కులు కల్పించి, రేగాను తిరిగి అమలు చేయాలి. ఇందుకు తగిన నిధులు కేటాయించాలి. కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు, శాశ్వతమైన, సురక్షితమైన ఉపాధి, సమిష్టి బేరసారాల హక్కు, ఎనిమిది గంటల పని దినం, సామాజిక భద్రత కల్పించాలి. అన్యాయమైన తొలగింపులు, దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి.
రెండవది: వివిధ ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి. 45వ, 46వ భారత కార్మిక సదస్సుల సిఫార్సులను అమలు చేయాలి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు దేశ ఆరోగ్య, పోషకాహార, విద్యా వ్యవస్థలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారిని గౌరవ వేతనం పొందే స్వచ్ఛంద కార్యకర్తలుగా పేర్కొంటూ నెలకు కేవలం రూ.1,000 నుంచి రూ.4,500 మాత్రమే చెల్లిస్తున్నారు. వారికి న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, పూర్తి కార్మిక హక్కులు కల్పించాలి.
మూడవది: నెలకు రూ.42,000 చట్టబద్ధమైన కనీస వేతనం కల్పించాలి. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా కనీస ఆదాయం రూ.42,000 హామీ ఇవ్వాలి. నెలకు రూ.21,000 సార్వత్రిక పెన్షన్ అందించాలి. ప్రతి ఒక్కరికీ జీవనానికి సరిపడే కనీస ఆదాయం లభించేలా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది సాధ్యం కాని చోట ప్రత్యక్ష ఆర్థిక సాయం ద్వారా కుటుంబ ఆదాయాన్ని ఈ స్థాయికి తీసుకురావాలి.
నాలుగవది: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలి. శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.
ఐదవది: పని ప్రదేశాల్లో భద్రతా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టాలి. వృత్తిపరమైన భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి. తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయాలి. కార్మికుల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనలకు, పారిశ్రామిక ప్రమాదాలకు, నివారించగల మరణాలకు యజమానులను బాధ్యులను చేయాలి. సంఘటితమయ్యే హక్కు, సమ్మె చేసే హక్కులను కాపాడాలి. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులను నేరస్థులుగా చిత్రీకరించకూడదు.
ఆరవది: ఆదివాసీలు, ఇతర సమాజాల జీవనోపాధికి ఆధారమైన నీరు, భూమి, అడవులు, సహజ వనరులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, ధ్వంసం చేయడం ఆపాలి. నీరు, భూమి, అటవీ హక్కులను, జాతీయ ఆస్తులను పరిరక్షించాలి. నిర్వాసితులకు పునరావాసం, పునఃస్థాపన, ఉపాధి హామీ కల్పించాలి. అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను, హక్కులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించకూడదు.
ఈ డిమాండ్లతో పాటు ‘సర్’ను ఉపసంహరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజల హక్కులను కుదిస్తూ, వారి కష్టాలను పెంచుతూ, కార్పొరేట్ల సంపదను పెంచి, తాము దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నామని చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆహారం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, సార్వత్రిక పెన్షన్ హక్కులను ప్రభుత్వం హామీ ఇవ్వాలి.
నేడు కార్మిక వర్గం ఈ పోరాటానికి నాయకత్వం వహించేందుకు ముందుకొచ్చింది. కార్పొరేట్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న విస్తృత ప్రజాస్వామిక పోరాటంతో ఆర్థిక డిమాండ్ల కోసం జరుగుతున్న పోరాటాన్ని అనుసంధానిస్తోంది. శాశ్వత, కాంట్రాక్టు కార్మికులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల మధ్య ఐక్యతను నిర్మిస్తోంది. రైతులు, ఆదివాసీలు, విద్యార్థులు, సమాజంలోని ఇతర వర్గాలను కూడా ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల ఆగ్రహాన్ని సంఘటిత శక్తిగా, ప్రతిఘటనను నిరంతర ఎదురుదాడిగా మార్చడం నేటి లక్ష్యం.
సంక్షోభ భారాన్ని సామాన్య ప్రజలపై మోపుతూ కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడుతున్న వ్యవస్థను సవాలు చేసేందుకు - దేశాన్ని నిర్మించే, సంపదను సృష్టించే, పారిశ్రామిక, సేవా రంగాలను నడిపించే కార్మిక వర్గం ముందుకు రానుంది.
దేశ రాజధాని నుంచి కార్మిక వర్గం గర్జించాలి! కార్మిక హక్కులు, జీవనోపాధి భద్రత, సామాజిక న్యాయం, దోపిడీ లేని భవిష్యత్తు కోసం సాగుతున్న పార్లమెంట్ మార్చ్ మరింత బలమైన, విస్తృతమైన, పట్టుదలతో కూడిన ఉద్యమానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి!

వ్యాసకర్త : సిఐటియు అఖిల భారత అధ్యక్షుడు సుదీప్ దత్తా
/‘గణశక్తి’ సౌజన్యంతో/







కామెంట్లు (0)