ఎల్నినో హెచ్చరికలతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు పులిమీద పుట్రలా ఆర్నబ్ తుపాను తీరని నష్టం కలిగించడం విషాదకరం. ఈ ఖరీఫ్ పంట చేతికొస్తే కొంతవరకైనా ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన రైతులకు తుపాను తీవ్ర నిరాశ మిగిల్చింది. అప్పులు చేసి, అనేక కష్టాలు ఎదుర్కొని సాగు చేసిన రైతులకు పంట చేతికందే సమయంలో ఊహించని నష్టం ఇది. పొట్ట దశ మొదలు కోతకు సిద్ధమైన స్థితి వరకూ ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. అరటి, కొబ్బరి వంటి ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. సాగు ఖర్చులు పెరిగి, గిట్టుబాటు ధర లభించక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ పరిణామం తేరుకోలేని దెబ్బ.
ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 2,24,489 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 3.45 లక్షల మంది రైతులు నష్టపోయారు. దాదాపు 2,09,460 హెక్టార్లలో వరి దెబ్బతిన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో 76,176 హెక్టార్లు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో 44,232 హెక్టార్లు, కాకినాడలో 42,222 హెక్టార్లు, తూర్పు గోదావరిలో 29,866 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బాపట్ల జిల్లాలోనూ 4,032 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలవడం, ధాన్యం మొలకెత్తడం, చేను కుళ్లిపోవడం వంటి వాటి పట్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,763 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అరటి, కొబ్బరి, కూరగాయలు, బొప్పాయి, పసుపు, పూలు, తమలపాకు వంటి పంటలు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాల్లోని 114 మండలాల పరిధిలో 715 గ్రామాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం. 8,471 హెక్టార్లలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 46,500 కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. క్షేత్రస్థాయి సర్వే పూర్తయ్యే నాటికి పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. తుపాను కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారులు, ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 20 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఆర్నబ్ తుపాను కారణంగా రూ.4,563 కోట్ల నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముందుగా అప్రమత్తం కావడం వల్ల భారీ నష్టాన్ని నివారించగలిగామని వ్యాఖ్యానించారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, ప్రజల్లో అవగాహన పెరగడం, మూడు నాలుగు దశాబ్దాల క్రితంతో పోలిస్తే రక్షిత నివాసాలు పెరగడం ఆస్తి, ప్రాణ నష్టాలను భారీగానే తగ్గిస్తున్నాయి. అయితే, పంటల నష్టాన్ని నివారించడం సాధ్యం కాదు. నష్టాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను చెప్పుకోవడంతోపాటు, జరిగిన నష్టంపై వాస్తవాలను అంగీకరించాలి. క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా బాధితులకు పరిహారం అందించడంపై దృష్టి పెట్టాలి. మృతుల కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించడంతోపాటు, ఇళ్లు దెబ్బతిన్నవారికి, జీవనోపాధి కోల్పోయినవారికి సాయం చేయాలి. వరద ప్రభావిత కుటుంబాలకు బియ్యం, ఉప్పు, పప్పులు వంటి నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి. వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారులనూ ఆదుకోవాలి. భూమి తమ పేరుపై లేకపోవడం వంటి కారణాలతో కౌలు రైతులు పరిహారానికి దూరం కాకూడదు. వాస్తవంగా సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి సాయం అందించాలి.
2018లో శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తిత్లీ తుపాను ఉద్దానం ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 22 వేల హెక్టార్లకు పైగా జీడిమామిడి తోటలు, 12 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు దెబ్బతిని, 1,06,592 మంది రైతులు నష్టపోయినట్టు అధికారిక నివేదికల్లో పేర్కొన్నారు. అయితే, పంటల వర్గీకరణలో పొరపాట్లు, అర్హులైన రైతుల పేర్లు జాబితాల్లో లేకపోవడం, పరిహారంలో తేడాలు వంటి ఫిర్యాదులు చాలా వచ్చాయి. దాదాపు 16 వేల మంది రైతులకు సాయం అందలేదని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా గ్రామాలవారీగా నష్టం వివరాలను ప్రకటించి, రైతులు తమ వివరాలను పరిశీలించుకునే అవకాశం కల్పించాలి. సర్వేలో పేర్లు నమోదు కానివారు, నష్టం తక్కువగా అంచనా వేశారని భావించేవారు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అర్హులైన ప్రతి రైతుకూ, కౌలు రైతుకూ జాప్యం లేకుండా పరిహారం అందాలి.
రాష్ట్ర ప్రభుత్వం నష్టం వివరాలను కేంద్రానికి నివేదించిన నేపథ్యంలో, కేంద్రం తక్షణమే అదనపు ఆర్థిక సాయం ప్రకటించాలి. విపత్తుల బారినపడ్డ పలు రాష్ట్రాలకు, ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు మోడీ ప్రభుత్వం నుంచి అవసరమైనంత సాయం అందలేదనే విమర్శలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి, బాధితులకు అవసరమైన నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సహాయ కార్యక్రమాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు. పార్టీలు, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా బాధితులందరికీ సాయం అందించాలి. విపత్తుల వేళ పాలకులు మరింత మానవీయంగా, బాధ్యతగా వ్యవహరించాలి.







కామెంట్లు (0)