రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికకు ఒక వ్యాసం రాశారు. ‘యుద్ధంలో తొలిగా బలయ్యేది సత్యం’ అనే వాక్యంతో ఆ వ్యాసం మొదలవుతుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు ఊహాజనితమైనవనీ, ఎన్నికల సంఘం పనితీరుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిందనీ, దానికి వ్యతిరేకంగా వీధుల్లో జరిగే నిరసనలు అరాచకత్వానికి అడుగులని ఆయన ఈ వ్యాసం ద్వారా భావిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. సత్యానంతర రాజకీయాల గురించి ఆయన రాసిన వ్యాసంలో, భారతదేశ ఎన్నికల సంఘం లోపల జరుగుతున్న పరిణామాలకు సత్యానంతర అనే పదానికి అతికినట్లుండే ఏ ఒక్క అధికారిక పత్రం గురించీ ప్రస్తావించలేదు.
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో సెప్టెంబర్ 23న ప్రచురితమైన రితిక చోప్రా పరిశోధన, అక్టోబర్ 2025 నుండి ఆగస్టు 2026 వరకు నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా సాగింది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరైన సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేశారు. వారి ప్రమేయం లేకుండా తీసుకున్న అనేక నిర్ణయాలపై (ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఎన్నికల జాబితా భద్రతతో పాటుగా) పది నెలల్లో 14 సార్లు (ఒకే రోజు నాలుగు సార్లు సహా) వారు తమ అసమ్మతిని తెలిపారు. ఎన్నికల సంఘం పేరిట చేపట్టిన చర్యలలో కొన్నింటిని వారు "అధికారికం కాదు, చట్ట విరుద్ధం" అని కూడా అభివర్ణించారు. రాజ్‌నాథ్ సింగ్ చెప్పే ఒక్క మాట—ఈ అసమ్మతి వాదనలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలని. అలా అనడంలో ఆయన ఘటికుడే! ఒకసారి వాస్తవాలను పరిశీలిద్దాం.
ఎన్నికల సంఘం ఒక వ్యక్తి చేతిలో నడిచే సంస్థ కాదు. కానీ ప్రస్తుతం అది పనిచేస్తున్న తీరు చూసినట్లయితే అందుకు విరుద్ధంగా వుందని అర్ధమవుతుంది. ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం పర్యవేక్షణ, దిశా నిర్దేశం, నియంత్రణను ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. అంతే తప్ప ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యక్తిగతంగా ఆ అధికారాలను కట్టబెట్టలేదు. ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారో అదే పద్ధతిలో మాత్రమే సి.ఇ.సి ని తొలగించవచ్చు. కానీ ఇతర కమిషనర్లను సి.ఇ.సి సిఫారసు మీద మాత్రమే తొలగించవచ్చు. కాబట్టి, అసమ్మతి తెలిపిన ఆ ఇద్దరు కమిషనర్లు సరిగ్గా తమను తొలగించగల అధికారం ఏ వ్యక్తికి ఉందో తెలిసి కూడా, ఆ వ్యక్తికి వ్యతిరేకంగానే అసమ్మతి గళం విప్పారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన కథనానికి ఎన్నికల సంఘం ఇచ్చిన బహిరంగ స్పందన ఏమిటంటే, నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని. కానీ రికార్డయి ఉన్న 14 రాతపూర్వక అభ్యంతరాలను బట్టి చూస్తే, సి.ఇ.సి తో కమిషనర్లు తీవ్రంగా విభేదిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అభ్యంతరాలను స్వయంగా కమిషనర్లే లేవనెత్తారు తప్ప ప్రతిపక్షాలు కల్పించినవి కావు.
ఈ ఆరోపణలు నిజంగా నిరాధారమైనవే అయితే, దాన్ని రుజువు చెయ్యడానికి ఒక తేలికైన పరిష్కారం ఉన్నది. ఎన్నికల సంఘం తన ఫైల్ నోట్లను ప్రచురించాలి, సాఫ్ట్వేర్ యాక్సెస్ లాగ్లను బహిర్గతపరచాలి, రాష్ట్ర అధికారులను పక్కకు తప్పించి ఢిల్లీలో ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణకు ఎవరు అధికారం ఇచ్చారో రికార్డులను వెల్లడించాలి. ఒకవేళ సంస్థలు రికార్డులను చూపకుండా ప్రజా విశ్వాసాన్ని ఆశించినట్లయితే, అది కేవలం గుడ్డి విధేయతను డిమాండ్ చేయడమే అవుతుంది.
‘సర్’ అనేది ఓటరును జాబితాలో చేర్చాలి. కానీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బీహార్‌లో ఈ ప్రక్రియను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది, అంతేకాదు ఆ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చెయ్యడం అవసరమని చెప్పింది అని సమర్థింపుగా మాట్లాడుతున్నారు. అయితే సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు ఏ కారణాల రీత్యా తొలగించబడ్డాయనేది స్పష్టంగా పేర్కొంటూ జాబితాలు ప్రచురించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎందుకంటే "ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది". అలాగే ఆధార్‌ను గుర్తింపు రుజువుగా అంగీకరించాలని కూడా అది ఆదేశించింది. న్యాయపరంగా సవాలు చేయబడి, ఆ తర్వాత న్యాయపరంగానే సరిదిద్దబడిన ఈ కసరత్తు "చట్టబద్ధమైనది, పరిపాలనాపరంగా సమర్థనీయమైనది" అని రాజనాథ్ సింగ్ చెప్పడం సబబేనా?
ఇక మరో ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి ఈ ‘సర్’ ప్రక్రియను అడ్డం పెట్టుకుంది-అనర్హులను తొలగించడం అనేది అందరినీ నమ్మించడానికి వాడుతున్న మాట. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినట్లుగా, పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదు, పౌరసత్వ చట్టం కింద ఆయా కేసులు సమర్థులైన అధికారులకు నివేదించబడాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులను విచారించే అధికారం ఏ మంత్రిత్వ శాఖకు ఉందో తెలియచెయ్యమని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆ అధికారం ఎవరికి ఉందో ఆ మంత్రిత్వ శాఖకే తెలియదు. కోర్టు ఆదేశాలను పాటించడానికి ఏం చేశారనేదానిపై స్పష్టత లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ కసరత్తు అసలు ఉద్దేశం ఓట్ల తొలగింపు మాత్రమే. ఈ ప్రక్రియలో ఇబ్బందులు పరిష్కరించాలన్న ఆలోచన రాజ్‌నాథ్ సింగ్ కు ఉన్నట్లు కనిపించదు. సుప్రీంకోర్టు ఆమోదించని డిబేట్ లోని విమర్శలను అణిచివేయడానికి మాత్రం ముందుంటారు.
ఇ.వి.యంల పట్ల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఇ.వి.యం ల గురించిన అనేక సమంజసమైన ప్రశ్నలు ప్రజల మనస్సులలో ఇంకా అలాగే ఉన్నాయి. అందువల్ల ఇ.వి.యం లకు సంబంధించిన అనేక కీలక అంశాలను పునఃపరిశీలించడం అనేది ఇప్పటికీ అత్యవసరమైన ఆందోళనగా ఉంది. దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. వి.వి.పాట్ టాలీ 100 శాతం ఉండేలా ఒక నిబంధన ఉండాలన్న మా డిమాండ్‌ను మేం పునరుద్ఘాటిస్తున్నాము. ఈ ప్రక్రియలో పారదర్శకతను తీవ్రంగా వ్యతిరేకించే ఒక వ్యవస్థ ద్వారా యంత్రాలను ఉపయోగించుకుని ఓటర్లను తొలగించడం ఇప్పటికీ కొనసాగుతుందనేదే మా ప్రధాన అభ్యంతరం.
ప్రభుత్వమే ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాన్ని చట్టపరంగా వ్యవస్థీకరించిందనేది రాజనాథ్ సింగ్ ప్రధాన వాదన. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక చరిత్ర మాత్రం దీనికి భిన్నంగా ఉంది. పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారతదేశ ప్రధాన న్యాయమూర్తులతో కూడిన సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ నడుమ, ఈ కమిటీలో సభ్యుడైన ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చి మరీ పార్లమెంటులో చట్టం తీసుకువచ్చింది. ఈ ప్యానెల్లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నాక ప్రతిపక్షం వ్యతిరేకత సహజంగానే వీగిపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం నియామకానికి తగిన చట్టం రూపొందించామని మోడీ ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ ఇది కేవలం పై పై పూత ద్వారా ఆ వ్యవస్థను చేజిక్కించుకోవడమే. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని తమ ప్రభుత్వం గౌరవించిందని సింగ్ చెబుతున్నారు కానీ సెలక్షన్ ప్యానెల్ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాన్ని తమ ప్రభుత్వం ధిక్కరించిందనే వాస్తవాన్ని ఆయన సౌకర్యవంతంగా విస్మరిస్తున్నారు.
అలాగే ఈ ప్రభుత్వం ఎన్నికల సంఘం సభ్యులకు కల్పించిన ఇమ్యూనిటీ (రక్షణ హక్కు ) గురించి మాట్లాడుకోవాలి. 2023 చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం, "ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఎన్నికల కమిషనర్‌గా ఉన్న/పనిచేసిన ఏ వ్యక్తి అయినా, తన అధికారిక విధి/విధులను నిర్వర్తించే క్రమంలో లేదా ఉద్దేశంతో చేసిన, చేసినట్లు భావించిన / చెప్పిన ఏ చర్య లేదా మాటకైనా, అతను పదవిలో ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత, ఎలాంటి సివిల్ / క్రిమినల్ చర్యలు చేపట్టడానికి కానీ, ఏ కోర్టు కూడా విచారించడం లేదా కొనసాగించడం తగదు" అని నిర్దేశించారు. ఈ రక్షణ పదవీకాలానికి మాత్రమే పరిమితం కాదు, పదవీ విరమణ తర్వాత కూడా సదరు అధికారికి వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ను అనుసరించి దేశాధ్యక్షుడికి ఉన్న ఇమ్యూనిటీ కూడా ఆ పదవిలో ఉన్నంతవరకు ఉంటుంది. అంటే ఎన్నికల కమిషనర్‌కు ఇప్పుడు ప్రథమ పౌరుడైన ఈ దేశాధ్యక్షుడి కంటే మరింత మన్నికైన చట్టపరమైన రక్షణ లభించినట్లేగా. నిజాయితీ గల అంపైర్‌కు ప్రభుత్వాలు జీవితకాల రక్షణ కవచాన్ని కల్పించాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం నిజంగానే అంత నిజాయితీగా, స్వచ్ఛంగా ఉంటే, హడావుడిగా ఈ ఇమ్యూనిటీ చట్టం ఎందుకు తీసుకు వచ్చినట్లూ?
రాజ్‌నాథ్ సింగ్ రాజ్యాంగ పీఠికకు తీసుకువచ్చిన తొలి సవరణను, అత్యవసర పరిస్థితి గురించి ఉదహరించారు. ఆ సమయంలో కూడా, కమ్యూనిస్ట్ ఉద్యమం, ఎ.కె. గోపాలన్ తదితరులు పార్లమెంటులో ఆ సవరణను వ్యతిరేకించారు. అత్యయిక పరిస్థితి కాలంలో తీసుకువచ్చిన సవరణలను సి.పి.యం పార్లమెంటులో, వీధుల్లో వ్యతిరేకించింది. అత్యయిక పరిస్థితి కాలంలో సి.పి.యం కార్యకర్తలు, నాయకులు వేల సంఖ్యలో జైళ్లపాలయ్యారు, అత్యయిక పరిస్థితి కాలంలో మా పార్టీ ఎదుర్కున్న నిర్బంధం మేం ఏమిటో చాటి చెబుతుంది. ఈ విషయమై మాకు ఎవరి మెప్పుకోళ్ళు, సర్టిఫికెట్లు అవసరం లేదు. వాస్తవానికి ఆ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతుల మనోభావాలను మన్నించి ఆ చట్టాలను రద్దు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. హర్యానా సరిహద్దులో ముళ్ళ కంచెలు, కందకాలు భాష్పవాయువు ప్రయోగాలు, లాఠీఛార్జ్ ల నడుమ ఒక సంవత్సర కాలం పాటు రోడ్లపై పోరాడిన తర్వాత, 700 మందికి పైగా రైతులు మరణించిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ నల్ల చట్టాలు రద్దు చేసిందన్న నిజాన్ని ఆయన దాచిపెడుతున్నారు. ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత, డివిజన్ కోరినప్పుడు రాజ్యసభలో వాయిస్ ఓట్ ద్వారా ఈ చట్టాలను అక్రమ పద్ధతులలో తీసుకు వచ్చారన్న వాస్తవం ప్రజలు మర్చిపోయి ఉంటారని ఆయన భావిస్తున్నట్లుంది. రైతాంగం సమరశీల పోరాటానికి తలొగ్గి ఈ నల్ల చట్టాలను రద్దు చేసింది తప్పితే వారి మనోభావాలను మన్నించి మాత్రం కాదన్నది బహిరంగ రహస్యమే.
అక్టోబర్ 2, 2026 న, సెక్షన్ 16 బి.ఎన్.ఎస్.ఎస్ కింద ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమలుజేయబడ్డాయి. మెట్రో స్టేషన్లు మూసేశారు. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులతో సహా వేల మంది ప్రజలను నిర్బంధించారు. శాంతియుత నిరసనకారులను చట్ట విరుద్ధంగా నిర్బంధించకూడదని, మెట్రో సర్వీసులు సాధారణంగా నడవాలని, నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న ప్రాంతం ప్రజలను తమ ఇష్టారాజ్యంగా పరిగణించబడకూడదని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే, అక్టోబర్ 10న, శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ప్రజలు గుమికూడడంపై రాజకీయ నిషేధాన్ని విధించడం ద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బాహాటంగా ఉల్లంఘించడాన్ని మనం చూశాము. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ప్రభుత్వం సాకుకి విరుద్ధంగా, నిరసనకారులు ఆ రోజు ఎటువంటి హింసకూ పాల్పడలేదని పోలీసు రికార్డులే చెబుతున్నాయి. పోలీసులు నిర్బంధించడం పేరిట హింసకు పాల్పడడం కనిపించింది. రాజ్యాంగ విరుద్ధమైన పనితీరుకు పాల్పడినట్లు తన సహచరులచే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. రాజ్యాంగపరమైన ఈ డిమాండ్‌కు సమాధానంగా ప్రభుత్వం బారికేడ్లు నిలబెట్టింది.
సంవత్సరాలుగా నిరసన ప్రాంతాల భౌగోళిక స్వరూపం కుంచించుకుపోతోంది. బోట్ క్లబ్ 1993లో మూసేశారు. ప్రదర్శనలు జంతర్ మంతర్ కు తరలించబడ్డాయి. కోవిడ్ లాక్డౌన్ వరకు, నిరసన మార్చ్ రూట్ మండి హౌస్ నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగింది. అప్పటి నుండి, మండి హౌస్ నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు వెళ్లే అనుమతులు ఇవ్వడం చాలా అరుదుగా మారాయి. అయితే, పది రోజుల ముందుగా అనుమతి దరఖాస్తులు అవసరమైతే, అది నిజంగా హక్కేనా? స్థలం లభించే అవకాశం లేకుండా చేసి సమావేశమయ్యే స్వేచ్ఛను ఇచ్చాం అని చెప్పడం కేవలం కంటి తుడుపు చర్యే. ప్రస్తుత పాలనలోని ఇతర నినాదాల మాదిరిగానే ఇది కూడా ఒక జుమ్లానే.
సింగ్ తన వ్యాసంలో అంబేద్కర్ ను కూడా ఆవాహన చేసుకున్నారు. అంబేద్కర్‌ను ఆవాహన చేసుకునే ముందు, ఆయన మొత్తం ప్రసంగాన్ని చదవాల్సింది. రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులను ఎదుర్కోవడానికి రాజ్యాంగ బద్ధమైన మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న అంబేద్కర్ హెచ్చరిక ఆయనకు గుర్తున్నట్లు లేదు. ప్రజలకు కోర్టులను ఆశ్రయించే హక్కు, నిష్పక్ష పాతంగా ఉండే అంపైర్‌ని ఎన్నుకోవడానికి, వీధుల్లో ఎక్కడైనా సమావేశం కావడానికి హక్కు ఉన్నది. కానీ అంపైర్‌ని ప్రభుత్వమే నియమించుకుని, వ్యాజ్యాల నుండి రక్షణ కల్పించినప్పుడు, వీధులను బారికేడ్లతో మూసివేసిన ప్పుడు, ఆ హక్కులు విఫలమైనట్లే. సామాజిక, ఆర్థిక అసమానతలతో కూడిన రాజకీయ సమానత్వంలోకి మనం ప్రవేశిస్తున్నామని ఆనాడే రాజ్యాంగ సభ కూడా మనకు స్పష్టం చేసింది. పేదలు, వలసదారులు, కొత్తగా వివాహం చేసుకున్న మహిళలను ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియ వారిని రాజకీయ అసమానత్వం లోకి కూడా నెట్టేస్తుంది. బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లు గొంతు చించుకున్నా, జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ అరాచకానికి పిలుపు కాదని, కేవలం రాజ్యాంగబద్ధమైన డిమాండ్ అని అది గ్రహించాలి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి, లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణతో తొలగించబడాలి. కార్యనిర్వాహక వర్గం వైపు మొగ్గు చూపని సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడానికి వీలుగా 2023 చట్టాన్ని సవరించాలి, సెక్షన్ 16ను తొలగించాలి. జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్ మార్గం తిరిగి తెరవాలి. సెక్షన్ 163ను ఇష్టారాజ్యంగా అమలుచెయ్యడాన్ని నిలవరించాలి. ఓడిపోయిన వ్యక్తి ఫలితాన్ని అంగీకరించగల పోటీకి ఇవి కనీస షరతులు. ప్రభుత్వం వాటిని నెరవేర్చలేకపోతే, సత్యానంతర వ్యాసాలు రాసే బదులు, ఎన్నికల యంత్రాంగం సత్యానంతర వివరణలు రాయడం మానుకోవాలని అది స్పష్టంగా చెప్పాలి.

వ్యాసకర్త - సి.పి.యం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి







కామెంట్లు (0)