ఎల్‌నినో, ఒక ప్రకృతి విపత్తు మాత్రమే కాదు; మనిషి అత్యాశకు ప్రకృతి పంపుతున్న నిశ్శబ్ద హెచ్చరిక! ఒకవైపు వాన చినుకుల కోసం ఆకాశాన్ని ప్రార్థించే రైతు; మరోవైపు వాన కత్తులై విరుచుకుపడితే నీటిలో మునిగే పల్లెలు! ఒకచోట ఎండిన బావిలో తన ముఖాన్ని వెతుక్కునే బాల్యం; మరోచోట వరదలో కొట్టుకుపోయిన ఇంటి ముందు తన గతాన్ని వెతుక్కునే వృద్ధాప్యం! ఒకే భూమి, రెండు విషాదాల్ని రెండు భిన్న దిక్కుల్లో ఒకేసారి రోదిస్తోంది! సముద్రపు వేడి జెట్ ప్రవాహాల దిశను మార్చవచ్చు; కానీ మనిషి ఆలోచనల దిశను మార్చగలదా ఈ విపత్తు? పారిస్ ఒప్పందాల్లో ప్రమాణాలు చేసిన పెదవులు ప్రకృతి ముందు ఎందుకు మౌనవ్రతం పడుతున్నాయి? భూమి మండితే కొత్త శీతలీకరణ యంత్రాన్ని కనిపెట్టగలం; సముద్రం ఉప్పొంగితే ఎత్తైన గోడల్ని నిర్మించగలం; కానీ మనిషిలోని అత్యాశకు ఏ ఆనకట్ట కట్టగలం? అడవిని నరికిన గొడ్డలికి ఏ విశ్వవిద్యాలయం పట్టా ఇచ్చింది? నదిని విషపూరితం చేసిన చేతికి ఏ నాగరికత బహుమతి ఇచ్చింది? రేపటి తరాల ఊపిరిని తాకట్టు పెట్టి ఈనాటి సుఖాల్ని కొనుగోలు చేసిన ఏ మేధస్సును మహోన్నతమని పిలవగలం? మరణం అంటే ఊపిరి ఆగిపోవడమే కాదు; ముప్పు కనిపించినా మనసు కదలకపోవడం! మేధస్సు అంటే సమీకరణాలు సాధించడం కాదు; వినాశనాన్ని ముందే గుర్తించి విధ్వంసం వైపు పరుగెడుతున్న మానవాళిని వెనక్కి పిలవడం! వివేకం అంటే ప్రపంచాన్ని జయించడం కాదు; ప్రపంచం మనతోపాటు బతికేలా చేయడం!
ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటోందని మనం కథలు అల్లవచ్చు; కానీ ప్రకృతికి ప్రతీకారం అక్కర్లేదు..ఆమె సమతుల్యత చాలు! ఆ సమతుల్యత చెదిరితే శిక్ష కోసం ఎవరూ రారు; పర్యవసానమే పిడుగై మన మీద పడుతుంది!
రేపటి సముద్రం తీరాన్ని మింగినప్పుడు, రేపటి ఆకాశం వర్షాన్ని వరదగా కురిపించినప్పుడు, రేపటి ఎండ పచ్చని పొలాన్ని బూడిద చేసినప్పుడు.. మన పిల్లలు మన సమాధుల మీద నిలబడి ఒక ప్రశ్న అడగవచ్చు: “మీకు అన్నీ తెలుసు కదా! విపత్తుల్ని ముందే చదివారు కదా! మరి మా భవిష్యత్తు పేజీలపై ఎందుకు హెచ్చరికలే రాశారు? పరిష్కారాలు ఎందుకు రాయలేదు?” .
ఆ ప్రశ్నకు ఏ శాస్త్రమూ సమాధానం చెప్పలేక, ఏ సంపదా కన్నీటిని కొనలేక, ఏ అధికారం ప్రకృతిని శాసించలేక మిగిలిపోతే..? అప్పుడు మనిషి చరిత్రలో అత్యంత తెలివైన జీవి అత్యంత మూర్ఖమైన జాతిగా నమోదవుతుంది! ఇంకా సమయం ఉంది, ఒక మొక్కను నాటడానికి, ఒక నదిని కాపాడడానికి, ఒక అడవిని నిలబెట్టడానికి, ఒక బిడ్డ భవిష్యత్తును లాభనష్టాల పట్టిక నుంచి విడిపించడానికి! ఎందుకంటే సూపర్ ఎల్ నినో వస్తుందో, ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో శాస్త్రం అంచనా వేయగలదు; కానీ మనిషి తన దురాశకు ఎప్పుడు ముగింపు పలుకుతాడో ఏ వాతావరణ నమూనా చెప్పలేదు!
భూమి ఇంకా బతికే ఉంది, ఆమె గుండెల్లో విత్తనాలున్నాయి; ఆమె కన్నీళ్లలో నదులున్నాయి; ఆమె నిశ్శబ్దంలో వేల వసంతాలున్నాయి! చావాల్సింది భూమి కాదు, భూమిని చంపే అహంకారం! ఆగాల్సింది ప్రకృతి కాదు, ప్రకృతిని ధిక్కరించే మేధావులారా మేల్కోండి..! మారాల్సింది వాతావరణం మాత్రమే కాదు. మానవత్వాన్ని మరచిన మనిషి మనస్తత్వం! మేధస్సుకు మరణం సంభవించినప్పుడు వినాశనం జన్మిస్తుంది; వివేకానికి పునర్జన్మ కలిగినప్పుడు భూమికి వసంతం వస్తుంది!
- డా. పెరుగు రామకృష్ణ,
సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత,
సెల్: 9849230443







కామెంట్‌లు (0)