శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రిజర్వేషన్ల రాజకీయం..

22 గంటల క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన రెండు జిఓలను హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ఒక న్యాయపరమైన ఎదురుదెబ్బ కాదు. దశాబ్దాలుగా బిసిలను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ సంస్కృతికి నిదర్శనం. పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం (ఆగస్టు 20), పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం (ఆగస్టు 19) రిజర్వేషన్లు ఇస్తూ వెలువడిన ఉత్తర్వులు న్యాయ పరీక్షలో నిలవలేదు. ఈ నిర్ణయం న్యాయస్థానాల్లో నిలవదు అనే సందేహాలే నిజమయ్యాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులకు ఈ జిఓలు విరుద్ధమని ధర్మాసనం తేల్చింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లకు మధ్య తేడా ఉందని కె కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావ్ గవాలీ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. పరిమితిని దాటాలంటే ప్రత్యేక కమిషన్ ద్వారా శాస్త్రీయమైన, తాజా గణాంక అధ్యయనం జరగాలనీ, ఆ కమిషన్ సిఫార్సుల ఆధారంగా స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించాలనీ చెప్పింది. కమిషన్ నివేదిక ఈ ఏడాది ఆగస్టు 14న అందినా, ప్రభుత్వం దాన్ని బహిరంగపరచకుండా, దానిపై నిర్ణయం తీసుకోకుండానే మరుసటి వారంలో జిఓలు జారీ చేసిందని కోర్టు గుర్తించింది. అంటే, పునాది వేయకుండానే భవనాన్ని కూటమి ప్రభుత్వం కట్టేసింది. ఈ నేపథ్యంలో బిసిలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందనే ప్రతిపక్షాల విమర్శ సహేతుకమైంది.

ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సంగతులు ప్రభుత్వానికి తెలియవా? కూటమిలో కీలకమైన టిడిపి ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదు? ఈ తీర్పుపై బిజెపి పెద్దలు ఎందుకు స్పందించ లేదు? అసలు బిసి రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్ట సవరణ చేసి, మార్గం సుగమం చేయాల్సిన కాషాయ పెద్దలే ఎందుకు మౌనంగా ఉన్నారు? అనేది ఆంధ్రావని ప్రశ్న. అలాగే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 34శాతం రిజర్వేషన్లను తెరపైకి తేవడంలో ఆంతర్యం జనాలకు ఎరుకే. అయితే, సుప్రీంకోర్టు తీర్పులు కొత్తవి కావు. కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఫిబ్రవరిలోనే. నివేదిక తయారీకి ఆరు నెలల సమయం తీసుకున్నారు. ఎన్నికల ముందు బిసిల ఓట్ల కోసం 34శాతం రిజర్వేషన్లను ముందుకు తెచ్చారు. నివేదికపై నిర్ణయమే తీసుకోని స్థితిలో రిజర్వేషన్లు ప్రకటించడం న్యాయసమీక్షకు నిలవదని తెలియనంత అమాయకత్వం పాలకులకు ఉందని భావించలేం. ఇటువంటి నిర్ణయం తీసుకుని ‘‘మేం బిసిల పక్షం’’ అంటూ ప్రచార ఆర్భాటం చేశారు. ఈ రాజకీయ డ్రామాలో నష్టపోతుంది బిసిలే.

ఎన్నికలను నిర్ణీత సమయంలో నిర్వహించడం రాజ్యాంగ బాధ్యత అని, ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అలాగే, ధర్మాసనం ఒక కీలక సూచన కూడా చేసింది. 50 శాతం పరిమితి అన్ని సందర్భాల్లోనూ మార్చలేనిది కాదు, కానీ దాన్ని దాటాలంటే బలమైన గణాంక ఆధారాలు కావాలి. అంటే తలుపులు మూసుకుపోలేదు. అవసరమైన కసరత్తు చేస్తే బిసిల కోటా పెంపునకు దారి ఉంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది స్పష్టం. స్వతంత్ర కమిషన్ నివేదికను బహిరంగపరచాలి. స్థానిక సంస్థల వారీగా వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా లెక్కించాలి. అవసరమైతే పరిమితి పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అలా కాకుండా మళ్లీ సుప్రీం కోర్టు తలుపులు తట్టడం సరికాదు. అలాగే, కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాజకీయ లబ్ధి కన్నా బిసిల హక్కుకే ప్రాధాన్యం ఇవ్వాలి.

​ఇది ఒక పార్టీకో, ఒక ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదు. గతంలోనూ రిజర్వేషన్ల పెంపు హామీలు న్యాయ చిక్కుల్లో పడి, చివరకు కోటా తగ్గిన అనుభవాలున్నాయి. ప్రతి ఎన్నికకు ముందు వాగ్దానాలు, ప్రతి తీర్పు తర్వాత పరస్పర ఆరోపణలు. ఇదే పునరావృతమవుతోంది. పాలక పక్షం హామీలిస్తే, ప్రతిపక్షం ఎన్నికలు వాయిదా పడే మార్గాలు వెతుకుతోంది. అలాగే, బిసిలకు నిజమైన ప్రయోజనం చేకూర్చే కులగణన, శాస్త్రీయ డేటా, పారదర్శక కమిషన్ నివేదిక వంటి విషయాలను ఏ పక్షమూ ప్రాధాన్యంగా తీసుకోకపోవడం గమనార్హం. అయితే, ఈ పరిణామాలు ఇక్కడితో ఆగవు. సర్పంచుల ఐదేళ్ల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరగక గ్రామాలు నెలల తరబడి ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా కునారిల్లుతున్నాయి.

​బిసిలకు స్థానిక సంస్థలే రాజకీయ ప్రాతినిధ్యానికి తొలి మెట్టు. రిజర్వేషన్ల గందరగోళంతో ఆ అవకాశమే ఆలస్యమవుతుంటే, నష్టం ఓట్ల లెక్కలకు కాదు, అట్టడుగు వర్గాల గొంతుకకు, ప్రజాస్వామ్యంలో అట్టడుగు స్థాయి ప్రాతినిధ్యానికని పాలకులు గుర్తెరగాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్