గుళ్లల్లోని రాళ్లన్నీ దేవుళ్లే అయితే, నేడు దేశంలో ఇంత అవినీతి, ఇంత నైతిక పతనం, ఇంత అధోగతి వుండదు" అని సి.వి. తన "ఊళ్లోకి స్వాములవారు వేంచేశారు" పుస్తకంలో అంటారు. భక్తి పేరుతో ఏర్పడిన కొన్ని సంస్థలు, ట్రస్టులు, గుడులు మోసానికి మూలస్తంభంగా మారుతున్నాయి. ఇంతకాలం మతాన్ని, గుడులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల కోసం భక్తుల విశ్వాసాన్ని, దేవుడ్ని, దేవుడి ఆస్తులను కొల్లగొట్టడం కంటే అధోగతి ఇంకేముంటుంది? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎందరో భక్తులు ఎంతో భక్తిభావంతో రామాలయ నిర్మాణానికి విరాళాలు అందించారు. అయితే ఇప్పుడు విరాళాల గోల్ మాల్ వార్తలు… ప్రపంచవ్యాప్తంగా విరాళాలిచ్చిన వారి మనోభావాలను, వారి విశ్వాసాలను గాయపరిచాయి. రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో, ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ భక్తుల కానుకల నగదు దుర్వినియోగమైందన్న అంశం వెలుగులోకి రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. బద్రీనాథ్–కేదార్‌నాథ్ దేవస్థాన కమిటీ (బికెటిసి )కి చెందిన ఓ ఉద్యోగి ఆలయ విరాళాల నగదును అపహరించాడని భైరవ్ సేన అనే సంస్థ ఆరోపించింది. ఆ ఉద్యోగి కమిటీ ఛైర్మన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారని ఆ సంస్థ పేర్కొనడం కలకలం రేపింది.
శతాబ్దాలుగా పాలక వర్గాలు మతాన్ని... ప్రజల చైతన్యాన్ని నియంత్రించే సాధనంగా ఉపయోగించుకున్నాయి. ఎన్నికల సమయంలో దేవుడు ఓట్లుగా మారాడు. ఇప్పుడు అదే దేవుడు కోట్ల రూపాయల విరాళాలుగా మారుతున్నాడు. భక్తి ఒక భావోద్వేగం అయితే, దానిని మార్కెట్‌గా మార్చిన వ్యవస్థే అసలు సమస్య. ప్రజల విశ్వాసమే పెట్టుబడిగా, దేవుడే బ్రాండ్‌గా, గుడులే ఆదాయ కేంద్రాలుగా మారినప్పుడు ధర్మం క్రమంగా వ్యాపారానికి బానిస అవుతుంది. అందుకే అంటాడు వేమన- "ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల?/ భాండశుద్ధి లేని పాకమేల?" అని. శ్రీరాముని హారం, పాదుకలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భక్తులు సమర్పించిన వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయి. వెండి ఇటుకలు, వెండి దీపాలు, నగదు విరాళాలు కూడా దొంగతనానినికి గురయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘రామ మందిర విరాళాల దొంగతనం ఇప్పుడు మొదలైంది కాదు.. 2021లోనే దోపిడీ ప్రారంభమైంది. అక్కడ భారీ భూ కుంభకోణం జరిగింది. రూ. 2 కోట్ల విలువైన భూమిని ఆలయ ట్రస్ట్‌కు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే రూ. 18 కోట్లకు విక్రయించారు. అదేవిధంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని రూ. 24 కోట్లకు, రూ. 9 కోట్ల విలువైన భూమిని రూ. 55 కోట్లకు, అలాగే రూ. 14 కోట్ల విలువైన భూమిని రూ. 95 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి’ అని అరవింద్ కేజ్రీవాల్ వంటివారు ఆరోపించడం మరింత సంచలనంగా మారింది. రోజుకు సుమారు 70వేల మంది భక్తులు వచ్చే తిరుమలకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలాంటిది రామమందిరం ఆదాయం ఏ స్థాయిలో వుండాలి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. దేశంలోని ఆలయాలన్నింటినీ ప్రభుత్వ పెత్తనం నుంచి తొలగించి... అయోధ్య తరహాలో హిందూ సమాజానికి అప్పగించాలని, ఆర్ఎస్ఎస్ అనుయాయ సంఘాలు దేశమంతటా హిందూ శంఖారావ సభలు పెట్టి యాగీ చేయడం వెనుక ఇలాంటి క్రుటలున్నాయా? అని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేవుడి హుండీలో పడేది నోటు కాదు—ఒక పేదవాడి ఆశ. ఒక రైతు చెమట చుక్క. ఒక కూలీ కన్నీరు. ఒక తల్లి ప్రార్థన. ఒక వృద్ధుడి నమ్మకం. అలాంటి విశ్వాసాన్ని అపహరించడం అంటే కేవలం డబ్బు దొంగతనం కాదు; సమాజం నైతిక పునాదులపై దాడి చేయడమే. ఇది వ్యక్తుల వైఫల్యం మాత్రమే కాదు; జవాబుదారీతనం లేని వ్యవస్థ వైఫల్యం. కోట్లాది రూపాయల విరాళాలు వస్తున్న ఆలయాలకు ప్రజల ముందు లెక్క చెప్పాల్సిందే. ప్రతి రూపాయి ఆదాయం, ప్రతి రూపాయి ఖర్చు ప్రజలకు వెల్లడించాల్సిందే. స్వతంత్ర ఆడిట్లు, సామాజిక పర్యవేక్షణ, పారదర్శక లెక్కలు, కఠిన శిక్షలు లేకుండా పవిత్రత గురించి చేసే ప్రసంగాలు ఖాళీ నినాదాలుగానే మిగిలిపోతాయి. మతం వ్యక్తిగత విశ్వాసం కావచ్చు. కానీ ఆలయాల ఆస్తులు ప్రజల విశ్వాసంతో కూడిన సామాజిక సంపద. గుడుల్లో పడిన దొంగలను కాపాడటం అంటే, నేరగాళ్లకు ఆశ్రయం కల్పించడమే. సమాజానికి ఇప్పుడు అవసరమైంది మరింత పారదర్శకత… మరింత జవాబుదారీతనం. ప్రజల నమ్మకాన్ని దోచుకుని, తమ విరాళాల నుండి కోట్లాది రూపాయలను దోచుకునేవారు హిందూ మతం యొక్క కాపలాదారులు ఎలా అవుతారు? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.








కామెంట్‌లు (0)